logo

సిద్ధం..ప్రయాణానికి యుద్ధం

‘ఎక్కడైనా సీఎం వస్తున్నాడంటే వరాలు జల్లులు కురిపిస్తారని ఆనందపడతారు. జగన్‌ వస్తే మాత్రం అమ్మో అంటున్నారు. ఈ సీఎం వస్తే పచ్చని చెట్లపై గొడ్డలి వేటు పడాల్సిందే.. కరెంటు తీగలు తొలగించాల్సిందే.

Updated : 20 Apr 2024 04:24 IST

కాకినాడ సభకు ఉమ్మడి జిల్లా నుంచి 450 బస్సుల తరలింపు
నేడు కశింకోటలో సభకు అంతకు మించి సమకూర్చిన ఆర్టీసీ
జాతీయ రహదారిపై రాకపోకలకు నరకం
ఈనాడు, అనకాపల్లి, న్యూస్‌టుడే, కొత్తూరు(అనకాపల్లి)

‘ఎక్కడైనా సీఎం వస్తున్నాడంటే వరాలు జల్లులు కురిపిస్తారని ఆనందపడతారు. జగన్‌ వస్తే మాత్రం అమ్మో అంటున్నారు. ఈ సీఎం వస్తే పచ్చని చెట్లపై గొడ్డలి వేటు పడాల్సిందే.. కరెంటు తీగలు తొలగించాల్సిందే. అన్నకు హారతులివ్వడానికి, పూలు జల్లడానికి బలవంతపు ఏర్పాట్లు చేయాల్సిందే. జనాల అవస్థలతో జగన్‌కు సంబంధం లేదు. రోడ్లపై గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన ప్రజలంతా తన కోసమే వచ్చారంటూ డ్రోన్‌ కెమెరాలతో ఫొటోలు తీయించుకుంటారు.

మందీమార్బలంతో ‘మేమంతా సిద్ధం’ అంటూ బస్సు యాత్ర సాగిస్తున్న జగన్‌ శుక్రవారం రాత్రి అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించారు. శనివారం కశింకోట మండలం గొబ్బూరులో ఎన్నికల సభ నిర్వహించబోతున్నారు. రెండునెలల క్రితం ఇదే మండలంలో చేయూత సభ పెట్టి, జాతీయ రహదారిని దిగ్భందం చేసి ప్రయాణికులకు నరకం చూపించారు. తాజాగా జాతీయ రహదారిని ఆనుకునే మరలా సభ నిర్వహిస్తుండడంతో బాబోయ్‌ జగన్‌ అంటూ భయపడుతున్నారు.


ట్రాఫిక్‌ కష్టాలు షురూ..

శింకోట మండలం పిసినికాడ సమీపంలో రెండు నెలల క్రితం చేయూత సభ పెట్టారు. జాతీయ రహదారిపై రాకపోకలను 40 కి.మీ ముందే మళ్లించేశారు. సభకు జనాలను తరలించే వాహనాలతో ఒక పూటంతా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎంతలా అంటే అంబులెన్స్‌లకు కూడా దారివ్వలేనంతగా. గుండెపోటుకు గురైన ఓ ఉపాధ్యాయురాలు సీఎం సభ ట్రాఫిక్‌ కారణంగా సకాలంలో ఆసుపత్రి చేరలేక మృతిచెందింది. ఇప్పుడు ఏకంగా నక్కపల్లి మండలం గొడిచర్ల నుంచి అనకాపల్లి పట్టణం వరకు బస్సు యాత్ర జాతీయ రహదారిపైనే సాగనుంది. గొబ్బూరు వద్ద సభ ఏర్పాటు చేస్తున్నారు. జగన్‌ బస్సు యాత్ర గురించి తెలిసిన వారిలో కొంతమంది ప్రత్యామ్నాయ మార్గాల్లో రవాణా వెతుక్కుంటున్నారు. మరికొందరు ప్రయాణాన్ని రద్దు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.


బస్సులన్నీ వాళ్లకే..

కాకినాడలో సిద్ధం సభ జరిగితే విశాఖ నుంచి 350, అనకాపల్లి జిల్లా నుంచి 100 బస్సులు వైకాపాకు అప్పగించారు. ఉమ్మడి జిల్లాలో శుక్రవారం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  శనివారం నాటి సిద్ధం సభకు ఉమ్మడి జిల్లాలో 700 పైగా బస్సులు వినియోగిస్తున్నారు. పొరుగు జిల్లాల నుంచి బస్సులు ఎక్కువ తరలించబోతున్నారు. దీంతో ప్రయాణ కష్టాలు మరింత తీవ్రం కానున్నాయి. అనకాపల్లి, నర్సీపట్నం డిపోల నుంచి 120 బస్సులను కేటాయించామని జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి పద్మావతి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని