logo

కుటుంబ వైద్యునికి కుదరని లగ్నం

ఫ్యామిలీ డాక్టరు పథకానికి సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రతి విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ పరిధిలో నెలకు కనీసం రెండుసార్లు వైద్యునితో కూడిన బృందం పర్యటించి రోగులకు చికిత్స చేయాలనే నిర్ణయంలో భాగంగా విధివిధానాలను నిర్దేశించారు.

Published : 20 Oct 2022 04:01 IST

సౌకర్యాలు సమకూరకుండానే ఆర్భాటపు ప్రచారం

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే

ప్రతి ఇంటికీ ప్రభుత్వ వైద్యసేవలు చేరువ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయాలనుకున్న ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమానికి లగ్నం కుదరడం లేదు. ఉద్దేశం మంచిదే అయినా ప్రాథమికంగా అవసరమైన వసతులు సమకూర్చకుండానే చేస్తున్న హడావుడితో పథక లక్ష్యం ఏ మేరకు నెరవేరుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఫ్యామిలీ డాక్టరు పథకానికి సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రతి విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ పరిధిలో నెలకు కనీసం రెండుసార్లు వైద్యునితో కూడిన బృందం పర్యటించి రోగులకు చికిత్స చేయాలనే నిర్ణయంలో భాగంగా విధివిధానాలను నిర్దేశించారు. అందుకు తగిన విధంగా పీహెచ్‌సీ వైద్యాధికారి, ఏఎన్‌ఎం, ఆశా, ఎంపీహెచ్‌ఏ(మేల్‌), ఎంఎల్‌హెచ్‌పీ, సూపర్‌వైజర్‌తో కూడిన బృందాలను నియమించారు. ప్రతి బృందానికి గ్రామాలను సందర్శించే విధంగా 104 వాహనాలను అనుసంధానం చేశారు. అన్ని హెల్త్‌ క్లినిక్‌లకు 67 రకాల మందులతో పాటు 14 రకాల వ్యాధి నిర్ధరణ పరీక్షల కిట్లు సమకూర్చారు.అక్టోబరు 2 నుంచి ఈ కార్యక్రమం అమలు చేయాలన్న సంకల్పం మాత్రం ఆచరణకు నోచుకోవడం లేదు. ఇప్పటికే రెండు విడతలుగా వాయిదా పడిన కార్యక్రమం పూర్తి స్థాయిలో ఎప్పటి నుంచి అమలవుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.

వసతే ప్రధాన సమస్య
బృందాలు వైద్యసేవలు అందించేందుకు ఇప్పటి వరకూ సరైన వసతులు సమకూరలేదు. ప్రతి సచివాలయ పరిధిలో హెల్త్‌వెల్‌నెస్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినా వాటికి సొంతభవనాలు లేవు. ఫలితంగా సబ్‌సెంటర్లు, సచివాలయాలు, తదితర ప్రాంతాల్లో కొనసాగిస్తున్నారు. ముందుచూపుతో ప్రభుత్వం అన్ని సచివాలయాల్లో వెల్‌నెస్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించినా, నిధులు విడుదల చేయకపోవడంతో రమారమి రెండేళ్ల క్రితం ప్రారంభించిన భవనాలు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. కృష్ణా జిల్లాకు 281 వెల్‌నెస్‌ సెంటర్లు కేటాయించగా ఇప్పటివరకు 63, ఎన్టీఆర్‌ జిల్లాలో 293 కేంద్రాలకు 51 మాత్రమే పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నా సకాలంలో బిల్లులు మంజూరవుతాయన్న ఆశలు వదిలేసుకున్న పలువురు గుత్తేదారులు పక్కకు తప్పుకున్నారు. వైద్యులు, సిబ్బంది 104 వాహనం లేదా ఇతర షెల్టర్‌ నుంచి సేవలు అందించినా, వివిధ పరీక్షల నిమిత్తం వచ్చే రోగులకు మూత్ర, ఇతర పరీక్షలు ఎక్కడ నిర్వహిస్తారనేది ప్రశ్నార్థకమవుతోంది.
సచివాలయాల్లో విలువైన పరికరాలు: ఆయుష్మాన్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా అన్ని వెల్‌నెస్‌ కేంద్రాలకు సుమారు రూ.10 లక్షల విలువచేసే అధునాతన పరికరాలు సరఫరా చేశారు. ఆక్సిజన్‌ సిలిండర్లు, శస్త్ర చికిత్సలు చేసేందుకు అవసరమైన అన్ని పరికాలు ఆయా కేంద్రాలకు సరఫరా చేశారు. వెల్‌నెస్‌ కేంద్రాలకు పూర్తి స్థాయి సొంత భవనాలు లేకపోడంతో విలువైన పరికరాలను కొన్నిచోట్ల పీహెచ్‌సీలు, సచివాలయాల్లో పడేశారు.

పూర్తి స్థాయిలో లేని సిబ్బంది

ప్రతి సచివాలయానికి ఇప్పుటికే ఒక వైద్యుడు, ఏఎన్‌ఎం, హెల్త్‌ అసిస్టెంట్‌లతో పాటు 104 వాహనాన్ని మ్యాపింగ్‌ చేశారు. అవసరం మేరకు వైద్యులు, ఏఎన్‌ఎం, ఆశాలను నియమించినా వెల్‌నెస్‌ కేంద్రాల నిర్వహణలో కీలకంగా ఉండే ఎంఎల్‌హెచ్‌పీ( మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌)ల భర్తీ పూర్తి కాలేదు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఇంకా దాదాపు 125 మందిని నియమించాల్సి ఉంది. ఇప్పటి వరకూ సబ్‌సెంటర్లలో ఓపీ చూసే ఎంఎల్‌హెచ్‌పీల పట్ల ప్రజలకు అంతగా అవగాహన లేదు. ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమం గురించి ఇందులో కీలకంగా వ్యవహరించే ఎంఎల్‌హెచ్‌పీల గురించి చాలా గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులకు స్పష్టమైన సమాచారం లేదు. ఏఎన్‌ఎంల మ్యాపింగ్‌ పూర్తి చేసినా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మిగిలిన వారిలో కొందరు ఏకపక్షంగా తమను దూర ప్రాంతాలకు మ్యాపింగ్‌ చేశారన్న అసంతృప్తితో ఉన్నారు. ఈ ఇబ్బందులతో పాటు ఎంతో ప్రయోజనకరమైన ఈ కార్యక్రమం పట్ల క్షేత్రస్థాయిలో తగు అవగాహన కల్పించలేదన్న విమర్శలున్నాయి.
 

లాంఛనంగా అమలుకు చర్యలు
క్షేత్రస్థాయిలోని సమస్యలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం పీహెచ్‌సీల పరిధిలోని ఒక గ్రామాన్ని ఎంచుకుని ప్రయోగాత్మకంగా ఈనెల 15న ప్రారంభించాలని ఆదేశించినా అమలుకు నోచుకోలేదు. తాజాగా ఈనెల 21న నిర్వహించాలని నిర్ణయించారు. అందుకు తగిన విధంగా జిల్లా వైద్యశాఖ తగు చర్యలు చేపడుతోంది. మొత్తంమీద పూర్తిస్థాయిలో ఈ కార్యక్రమం ఎప్పటికి ప్రజలకు చేరువ అవుతుందనేది సమాధానం లేని ప్రశ్నగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని