logo

మాయమాటలతో పాస్టర్‌ ప్రేమాయణం!

మాయమాటలు చెప్పి బాలికతో ప్రేమాయణం నడిపిన పాస్టర్‌ను గన్నవరం పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.

Published : 07 Dec 2022 08:01 IST

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: మాయమాటలు చెప్పి బాలికతో ప్రేమాయణం నడిపిన పాస్టర్‌ను గన్నవరం పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లాలో మొదలైన పాస్టర్‌ వ్యవహారం.. ఏలూరు జిల్లా నూజివీడు వేదికగా తలెత్తిన వివాదానికి గన్నవరంలో అడ్డుకట్ట పడింది. పోలీసులు కథనం ప్రకారం. తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన కల్యాణి నాగేశ్వరరావు.. ఏలూరు జిల్లా నూజివీడు ఎన్టీఆర్‌ కాలనీలో చర్చి పాస్టర్‌గా జీవనం సాగిస్తున్నారు. రెండేళ్ల క్రితం స్థానికంగా చర్చి ఏర్పాటు చేసిన పాస్టర్‌ నాగేశ్వరరావుకు అదే కాలనీకి చెందిన 17 ఏళ్ల బాలికతో పరిచయం ఏర్పడింది. ఆరోగ్యం బాగాలేదని ఓసారి పాస్టర్‌ వద్దకు సదరు బాలిక వెళ్లగా.. ప్రత్యేక ప్రార్థన చేస్తే తగ్గిపోతుందంటూ ఆమెకు దగ్గరయ్యాడని బాలిక బంధువులు ఆరోపించారు. పాస్టర్‌ ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు గన్నవరం మండలం ముస్తాబాదలోని బంధువుల ఇంటికి బాలికను పంపించారు. ఈనెల 2వ తేదీ సదరు బాలిక ఇంట్లో కనిపించక పోవడంతో గన్నవరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బాలిక పాస్టర్‌తో కలిసి హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఇరువురిని అదుపులోకి గన్నవరం తీసుకొచ్చిన పోలీసులు.. పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో ప్రార్థనల నిమిత్తం మాత్రమే తాము వెళ్లినట్లు బాలిక, పాస్టర్‌ చెబుతున్నారని గన్నవరం సీఐ సత్యనారాయణ వివరించారు. పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి వివరాలు వెల్లడిస్తామని సీఐ పేర్కొన్నారు. మరోవైపు అనారోగ్య కారణాలతో భార్య చనిపోయి ఇద్దరు పిల్లలున్న పాస్టర్‌ నాగేశ్వరరావు.. మాయమాటలతో తమ కూతుర్ని ఎత్తుకెళ్లి వేధిస్తున్నాడని, అతడిపై పోక్సో చట్ట ప్రకారం చర్యలు తీసుకొని న్యాయం చేయాలంటూ బాధిత తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ మేరకు పాస్టర్‌పై పోక్సో కేసు నమోదు చేశామని ఎస్‌.ఐ రమేష్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని