logo

వల్లభనేని వంశీ కవ్వింపు.. తెదేపా, జనసేన శ్రేణుల శిబిరం వద్ద కారు ఆపి...

కృష్ణా జిల్లా విజయవాడ రూరల్‌ మండలం ఎనికేపాడులోని తెదేపా కార్యాలయం వద్ద గురువారం చేపట్టిన నిరసన శిబిరం వద్ద, మాజీ ఎమ్మెల్యే వంశీ కారులో వచ్చి కవ్వింపు చర్యలకు పాల్పడడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

Updated : 08 Mar 2024 08:19 IST

చోద్యం చూసిన పోలీసులు, ఎనికేపాడులో తీవ్ర ఉద్రిక్తత

దీక్షా శిబిరం నిర్వహిస్తున్న తెదేపా కార్యాలయం ఎదుట రోడ్డుపై మాజీ ఎమ్మెల్యే వంశీ కారు

ఎనికేపాడు (రామవరప్పాడు), న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా విజయవాడ రూరల్‌ మండలం ఎనికేపాడులోని తెదేపా కార్యాలయం వద్ద గురువారం చేపట్టిన నిరసన శిబిరం వద్ద, మాజీ ఎమ్మెల్యే వంశీ కారులో వచ్చి కవ్వింపు చర్యలకు పాల్పడడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. బుధవారం తెదేపా నాయకులు, కార్యకర్తలపై విజయవాడ కోర్టు ఆవరణలో మాజీ ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడులు చేశారు. దీనికి నిరసనగా తెదేపా, జనసేన గన్నవరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో రెండు పార్టీల కార్యకర్తలు, నాయకులు కార్యాలయంలో దీక్ష చేపట్టారు. కొద్దిసేపటికి విజయవాడ వైపు నుంచి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన అనుచరులతో కలిసి అయిదు కార్లలో అక్కడికి వచ్చారు. తెదేపా కార్యాలయం ఎదుట కార్లను నిలిపి దీక్షా శిబిరంలో కూర్చున్న కార్యకర్తలను రెచ్చగొట్టారు. ఆగ్రహించి తెదేపా, జనసేన కార్యకర్తలు పార్టీ కార్యాలయం నుంచి బయటకు దూసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అప్పటికే శిబిరం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. సుమారు పది నిమిషాల పాటు వంశీ కారులో నుంచి కవ్విస్తున్నా, పోలీసులు చోద్యం చూస్తున్నారే తప్ప, అక్కడి నుంచి ఆయనను పంపే ప్రయత్నం చేయలేదు. కొంతసేపటికి వంశీ కారును ముందుకు తీసుకెళ్లి ఎనికేపాడు సెంటర్‌ వద్ద యూటర్న్‌ తీసుకొని, తిరిగి తెదేపా కార్యాలయం ముందు నుంచి విజయవాడ వైపునకు వచ్చారు. అప్పటికే పోలీసులను తోసుకొని శిబిరం నుంచి పార్టీ కార్యాలయం బయటకు వచ్చిన తెదేపా కార్యకర్తలను చూసి వంశీ కారులో నుంచే చేయి ఊపుతూ వెళ్లడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇదంతా గమనించిన యార్లగడ్డ వెంకట్రావు దీక్ష శిబిరం నుంచి బయటకు వచ్చేందుకు లేచారు. వెంటనే పోలీసులు శిబిరాన్ని చుట్టుమట్టారు. మండిపడిన కార్యకర్తలు పోలీసులను నెట్టుకుంటూ బయటకు వచ్చేందుకు చూశారు. ఈక్రమంలో పోలీసులు, కార్యకర్తలకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ‘ వైకాపా కార్యకర్తల్లా మారి కవ్వింపు చర్యలకు దిగిన వంశీకి మద్దతు తెలుపుతున్నారా’ ‘ దీక్షా శిబిరం ముందు కారు ఆపి రెచ్చగొడుతున్న వంశీని పంపించకుండా మమ్మల్ని ఆపుతున్నారా’ అంటూ పోలీసులకు కార్యకర్తలు ఎదురుతిరిగారు. పరిస్థితి అదుపు తప్పుతోందని గ్రహించిన యార్లగడ్డ వెంకట్రావు కార్యకర్తలకు సర్దిచెప్పి దీక్ష శిబిరం వద్దకు తేవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.

శిబిరం నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న తెదేపా, జనసేన శ్రేణులను అడ్డుకుంటున్న పోలీసులు

మంచిని చేతగానితనంగా చూడొద్దు..

అనంతరం యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ రాజకీయాల్లో హింసకు తావు లేదనేది తన అభిప్రాయమన్నారు. తమ మంచితనాన్ని చేతగానితనంగా చూడొద్దని కోరారు. తాజా మాజీ ఎమ్మెల్యే వంశీకి ఓటమి భయం పట్టుకుందని, పిచ్చిపట్టి రోడ్లపై తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. తమ దీక్షా శిబిరం వద్ద వంశీకి ఏం పని అని ప్రశ్నించారు. పోలీసులను అడ్డం పెట్టుకొని కవ్విస్తున్న వంశీని చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోందన్నారు. కొందరు పోలీసులు ఖాకీ యూనిఫాం వేసుకుని వైకాపా కార్యకర్తల్లాగా పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. పాము కంటే వంశీకి విషం ఎక్కువని, తన గెలుపు కోసం పనిచేసిన వారిపైనే దాడులు, కేసులు పెట్టిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో తమ పార్టీల శ్రేణులపై దాడులు ఆపేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆత్మరక్షణకు తామూ ప్రతిదాడులు చేస్తామని హెచ్చరించారు.

  • దీక్షా శిబిరంలో తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గూడవల్లి నర్సయ్య, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి చలమలశెట్టి రమేష్‌, కృష్ణా జిల్లా తెదేపా ఉపాధ్యక్షులు గుజ్జర్లపూడి బాబురావు, దండు సుబ్రహ్మణ్యం రాజు, రూరల్‌ మండల అధ్యక్షుడు గొడ్డళ్ల చిన రామారావు, ప్రధాన కార్యదర్శి కోనేరు సందీప్‌, రూరల్‌ మండల జనసేన అధ్యక్షుడు పొదిలి దుర్గారావు, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాల కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని