logo

వంశీ వచ్చారు.. నగదు పంచారు..!

ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తొలిరోజే నగదు పంపకాలకు తెరదీశారు... కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌..!

Published : 31 Mar 2024 06:39 IST

తొలి రోజు ప్రచారంలోనే హల్‌చల్‌ 

విజయవాడ, న్యూస్‌టుడే: ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తొలిరోజే నగదు పంపకాలకు తెరదీశారు... కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌..! పోటీపై తర్జన భర్జన పడిన వంశీకి... ఎట్టకేలకు వైకాపా అధిష్ఠానం టికెట్‌ కేటాయించడంతో గన్నవరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తన నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ గ్రామీణ మండలం ఎనికేపాడులో మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్‌తో కలిసి శనివారం ఉదయం ప్రచారం ప్రారంభించారు. ఇదిలా ఉండగా... సాయంత్రం నుంచి రామవరప్పాడు హనుమాన్‌నగర్‌లో ఇంటింటికి తిరుగుతూ.. అక్కడక్కడ నగదు పంపకాలు చేశారు. ఆయన అనుచరుడు ఒకరు రూ.5 వేలు, రూ.10 వేలు నగదు ఉన్న కవర్లను వెంటపెట్టుకున్నారు. కొంతమందికి ఎమ్మెల్యే సైగ చేయడంతో కవరు ఇస్తున్నారు. వైకాపా కార్యకర్త, ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు వెనుకగా వెళ్లి నగదు ఇస్తున్నారు. కుటుంబ పరిస్థితులు, ఆరోగ్యం బాగాలేదని చెబుతున్న వారికి ఈ కవర్లను అందజేస్తున్నారు. గతంలోనూ ఇదే విధంగా నగదు పంపకాలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది. ఎన్నికల ప్రచారం చేస్తూ నగదు పంచడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా వ్యవహరించడం... ఓట్ల కొనుగోలు చేయడమే అని వ్యాఖ్యానిస్తున్నారు. రూ.50 వేలకు మించి నగదు రవాణా చేయకూడదు. కానీ ఆయన అనుచరులు ఎన్నికల ప్రచారంలోనే పెద్దమొత్తాలను వెంట పెట్టుకుని పంపకాలకు తెర తీయడం విశేషం. దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని తెదేపా డిమాండ్‌ చేస్తోంది.

 ఇదిలా ఉండగా.. శనివారం ఉదయం ఎనికేపాడులో కొందరు తాగునీటి సమస్య ఉందని చెప్పి... తమకు సరఫరా అవుతున్న తాగునీరు తాగమని వంశీకి ఇచ్చారు. ఆయన నీటిని పరిశీలించమని అనుచరులకు చెప్పగా... వారు ఆ నీటిని నోట్లో పోసుకొని.. దుర్వాసనతో కూడిన నీరు కావడంతో మింగలేక కక్కేశారు. ఇదే క్రమంలో వంశీతో సహా ఆయన అనుచరులు సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెనుదిరిగారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని