logo

తీరిన వాహనదారుల కష్టాలు

టవర్‌క్లాక్‌ సమీపంలో నిర్మించిన నాలుగు వరుసల వంతెనపై వాహనాల రాకపోకలు ఆరంభమయ్యాయి. మే 29న వంతెనను కలెక్టర్‌ ప్రారంభించారు. ఈనెల 1వ తేదీ నుంచి వాహనాల రాకపోకలకు అనుమతిస్తామన్నారు.

Updated : 01 Jun 2023 04:58 IST

వంతెనపై రాకపోకలు ఆరంభం
బస్సులకు ఇప్పుడే అనుమతిలేదు

టవర్‌క్లాక్‌ వద్ద వంతెనపై ప్రయాణిస్తున్న వాహనాలు

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: టవర్‌క్లాక్‌ సమీపంలో నిర్మించిన నాలుగు వరుసల వంతెనపై వాహనాల రాకపోకలు ఆరంభమయ్యాయి. మే 29న వంతెనను కలెక్టర్‌ ప్రారంభించారు. ఈనెల 1వ తేదీ నుంచి వాహనాల రాకపోకలకు అనుమతిస్తామన్నారు. ప్రకటించిన తేదీ కంటే ముందుగానే అనుమతి లభించింది. వాహనచోదకులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా మంగళవారం నుంచే వాహనాల రాకపోకలకు అడ్డు తొలగించారు. కానీ, బస్సులు, లారీలు వంటి భారీ వాహనాలకు ఇంకా అనుమతివ్వలేదు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు తదితర లైట్‌ మోటారు వాహనాలు ఫ్లైఓవర్‌బ్రిడ్జిపై రాకపోకలు సాగిస్తున్నాయి. జాతీయ రహదారులశాఖ ఆధ్వర్యంలో ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. సుమారు 16 నెలలుగా పనులు సాగుతున్నాయి. నాటి నుంచి వాహనదారుల కష్టాలు వర్ణనాతీతం. రైల్వేట్రాక్‌కు అటువైపు నివసిస్తున్న ప్రజలు టవర్‌క్లాక్‌ వద్దకు రావాలంటే చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి. కొన్ని రోడ్లలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కరించలేక అడ్డంగా బారికేడ్లు నిర్మించారు. దీంతో వాహనదారులు సజావుగా వెళ్లలేని పరిస్థితి. వంతెనకు అటు, ఇటు ఉన్న దుకాణదారులు కూడా వ్యాపారాలు లేక ఇబ్బందులు పడ్డారు. అన్నివర్గాల ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. ఆర్వోబీ ప్రారంభించడంతో అనంత వాసుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

ప్రయాణికులకు మరికొంత కాలం అదనపు భారం

ఫ్లైఓవర్‌ బ్రిడ్జిపై రాకపోకలకు అనుమతిచ్చినా.. ఆర్టీసీ బస్సులకు అనుమతించలేదు. నడిమివంకపై నిర్మిస్తున్న వంతెన ఒకవైపు మాత్రమే పూర్తి చేశారు. మరోవైపు మంగళవారం రాత్రి స్లాబ్‌పనులు పూర్తి చేశారు. బ్రిడ్జి క్యూరింగ్‌ దశలో ఉంది. జాతీయ రహదారులశాఖ అధికారులు వాహనాలకు అనుమతిచ్చారు. కానీ, ట్రాఫిక్‌పోలీసు అధికారులు భారీ వాహనాలకు అనుమతివ్వలేదు. బళ్లారి, ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు ఇస్కాన్‌ ఆలయం చుట్టుముట్టి రావాల్సిన పరిస్థితి. బస్టాండుకు చేరాలంటే సుమారు 6 కి.మీ. దూరం అదనంగా ప్రయాణించాలి. అదనపు ప్రయాణానికి ప్రయాణికుల నుంచి రూ.10 అదనంగా ఆర్టీసీ బస్సులో వసూలు చేస్తున్నారు. ఈ అదనపు భారం, సమయం మరికొంత కాలం భరించక తప్పదు. అధికారులేమంటున్నారంటే..


రాకపోకలకు అనుమతిచ్చాం

ప్రజలు ఇబ్బందులు పడకుండా సజావుగా ప్రయాణం సాగాలనే ఉద్దేశంతో రహదారి విస్తరణ, వంతెన నిర్మాణం చేపట్టాం. వంతెన పూర్తయింది. ఇంకా వాహనదారులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో వంతెనపై రాకపోకలకు అనుమతిచ్చాం. ప్రజల ఇక్కట్లు పరిష్కరించాం. అన్ని వాహనాలు ప్రయాణించవచ్చు.

జగదీశ్‌గుప్తా, డీఈ, జాతీయ రహదారులశాఖ


అప్పటి నుంచి అదనపు వసూళ్లు చేయం

వంతెనపై బస్సుల ప్రయాణానికి పోలీసుశాఖ నుంచి ఇంకా అనుమతి రాలేదు. ట్రాఫిక్‌ పోలీసులు అనుమతిచ్చిన వెంటనే వంతెనపై బస్సులు నడుపుతాం. అప్పటి నుంచి అదనంగా రూ.10 వసూలు చేయం. పాత టికెట్టు రేట్లే వర్తిస్తాయి.

నాగభూపాల్‌, డిపో మేనేజరు, ఆర్టీసీ


15 రోజుల తర్వాతే భారీ వాహనాలు

నడిమివంకపై బ్రిడ్జి పనులు ఇంకా పూర్తి కాలేదు. ఒకవైపు మాత్రమే వాహనాలు వెళ్తున్నాయి. దీంతో ట్రాఫిక్‌ సమస్య ఎదురవుతోంది. అందుకే భారీ వాహనాలను అనుమతించలేదు. బ్రిడ్జి క్యూరింగ్‌ పనులు పూర్తయ్యాక 15 రోజుల తరువాత బస్సులకు అనుమతిస్తాం.

వెంకటేష్‌నాయక్‌, ట్రాఫిక్‌ సీఐ


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని