logo

గర్భిణి మృతి అనుమానాస్పదం?

అనంత కలెక్టర్‌ కార్యాలయ సర్కిల్‌లో ఉన్న ఫాదర్‌ ఫెర్రర్‌ విగ్రహం వద్ద చోటు చేసుకున్న గర్భిణి అంజలి (29) మృతి అనుమానాస్పదంగా మారింది.

Published : 27 Mar 2024 04:44 IST

కలెక్టరేట్‌ ఎదుట జరిగిన ఘటనలో కొత్త కోణం

పిల్లలతో ఐసీడీఎస్‌ పీడీ శ్రీదేవి, ఆర్డీఓ వెంకటేశు, సీడీపీఓ లలిత, తదితరులు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: అనంత కలెక్టర్‌ కార్యాలయ సర్కిల్‌లో ఉన్న ఫాదర్‌ ఫెర్రర్‌ విగ్రహం వద్ద చోటు చేసుకున్న గర్భిణి అంజలి (29) మృతి అనుమానాస్పదంగా మారింది. మానవత్వం మంటగలిసేలా.. హృదయ విదారక నిజం తెరపైకి వచ్చింది. ఏదో ద్విచక్ర వాహనం ఢీకొట్టడం వల్లే గర్భిణి చనిపోయిందని భావించారు. ఇదే ఘటనపై మంగళవారం ‘సంక్షేమం ఎరగని నిరుపేద కుటుంబం’ అన్న కథనాన్ని ‘ఈనాడు’ ప్రచురించింది. ఐసీడీఎస్‌ పీడీ బీఎన్‌ శ్రీదేవి నేతృత్వంలో ఆర్డీఓ వెంకటేశు, సీడబ్ల్యూసీ ఛైర్‌పర్సన్‌ రామలక్ష్మి, సీఐ రెడ్డప్ప, సీడీపీఓ చల్లా లలిత జిల్లా స్త్రీ,శిశు సంక్షేమ కార్యాలయంలో మృతురాలి అత్త, బిడ్డలను వేర్వేరుగా విచారించడంతో అసలు నిజం మంగళవారం బయటకు వచ్చింది. మృతురాలి అత్త తులశమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 23న ఉదయం కూలి పని కల్పిస్తామంటూ ఓ ఇద్దరు వ్యక్తులు వచ్చి తీసుకెళ్లారు. రాత్రి 8 గంటల సమయంలో స్పృహ కోల్పోయిన స్థితిలో ద్విచక్ర వాహనంలో తీసుకొచ్చి పడేసి వెళ్లిపోయారు’ అంటూ అధికారుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. అప్పటికే రక్తస్రావం అయినట్లు చెప్పడంతో ఆమె చెప్పిన నిజాలు విన్న అధికారులు షాక్‌ అయ్యారు. అనంత నగరం నాయక్‌నగర్‌, మరవకొమ్మకాలనీకి చెందిన దస్తగిరి, బాల ఆ గర్భిణిని తీసుకెళ్లినట్లు ప్రాథమిక సమాచారం. ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో అంజలి మృతిని అనుమానాస్పదంగా నమోదు చేసినట్లు స్టేషన్‌ సీఐ రెడ్డప్ప ధ్రువీకరించారు. ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తామని చెప్పారు.

ఆ ముగ్గురికి ఆసరా..

మృతురాలైన అంజలి కుటుంబానికి జరిగిన అన్యాయంపై ‘ఈనాడు’లో వచ్చిన కథనానికి కలెక్టర్‌ గౌతమి స్పందించారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి అన్ని విధాలా చర్యలు తీసుకోవాలంటూ ఐసీడీఎస్‌, రెవెన్యూ, పోలీసు, విద్య.. వంటి శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. పీడీ శ్రీదేవి సారథ్యంలో అత్త తులశమ్మ, 13 ఏళ్ల కూతురు అఖిల, 10 ఏళ్ల చరణ్‌, 9 ఏళ్ల సాయిని ఐసీడీఎస్‌ కార్యాలయానికి తీసుకొచ్చారు. భర్త రాజు వెతికినా దొరకలేదు. ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నారు. ఎలా బతికారు. ఏమేం పనులు చేసుకుంటున్నారు.. వంటి వివరాలన్నీ వారితో ఆరా తీశారు. తాత్కాలిక వసతిలో భాగంగా అఖిలను బాలసదన్‌లో, తక్కిన ఇద్దరు బాలలను బీకే సముద్రం మండలం రోటరీపురంలో జీవని ఆశ్రమంలో చేర్పించారు. వృద్ధురాలు తులసమ్మను బుధవారం ఆకుతోటపల్లి సమీపంలోని అమ్మఒడి వృద్ధాశ్రమంలో చేర్పించేలా చర్యలకు ఉపక్రమించారు. వీరి ఆలనాపాలనా సంబంధిత అధికారులే తీసుకోనున్నారు.

విచారణ ఏదీ?

కలెక్టర్‌ కార్యాలయం ఫెర్రర్‌ విగ్రహం వద్ద ఈ ఆదివారం(24న) తెల్లవారుజామున గర్భిణి అంజలి మృతిపై సమాచారం అందుకున్న నగర పాలక సంస్థ సిబ్బంది ఓ సేవా సంస్థ సాయంతో హడావుడిగా జేఎన్‌టీయూ సమీపంలోని శ్మశాన వాటికలో ఖననం చేశారు. ఈ ఘటన ఎలా జరిగింది. ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? అనే వివరాలు ఆరా తీయలేదు. ఆ రోజు నుంచి కేసు కూడా నమోదు చేయలేదు. నిరుపేద గర్భిణి కదా.. ఏం కాలేదన్న ఉద్దేశంతో అధికారులు చేతులు దులిపేసుకున్నట్లు తెలుస్తోంది. కనీస విచారణ చేయకుండానే ముగించాలని చూశారు. మృతురాలి కుటుంబ సభ్యుల విచారణతో అసలు బాగోతం తెరపైకి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని