logo

ఎట్టకేలకు భూగర్భ రైలు వంతెన పూర్తి

నగరవాసులు చాలాకాలంగా ఎదురు చూస్తున్న గడియారం స్తంభం కూడలిలోని ప్రధాన వంతెన కింద ఏర్పాటు చేసిన భూగర్భ రైలు వంతెన పనులు ఎట్టకేలకు పూర్తి చేశారు.

Published : 27 Mar 2024 04:51 IST

వాహనాల రాకపోకలు ప్రారంభం

పూర్తయిన భూగర్భ రైలు వంతెన

అనంతపురం(రైల్వే), న్యూస్‌టుడే: నగరవాసులు చాలాకాలంగా ఎదురు చూస్తున్న గడియారం స్తంభం కూడలిలోని ప్రధాన వంతెన కింద ఏర్పాటు చేసిన భూగర్భ రైలు వంతెన పనులు ఎట్టకేలకు పూర్తి చేశారు. ప్రధాన వంతెన పూర్తి అయినప్పటికీ భూగర్భ రైలు వంతెన పనులు రైల్వే శాఖ నుంచి అనుమతులు రావడంలో ఆలస్యమైంది. రైల్వే శాఖ నుంచి అనుమతులు వచ్చిన తర్వాత  రైల్వే ఇంజినీర్ల పర్యవేక్షణలో పట్టాల కింద తవ్వకాల పనులు చేపట్టారు. అనంతరం రైలు పట్టాలకు గరండాలను ఏర్పాటు చేసి సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం భూగర్భ రైలు వంతెన పనులు పూర్తి అయ్యాయి. ఇక రైల్వే శాఖ గరండాలను తొలగించి సాధారణ రైలు పట్టాలను వేయాల్సి ఉంది. అప్పటి వరకు రైళ్ల రాకపోకలు సాగుతాయి. ఈ వంతెనలో మంగళవారం నుంచి వాహనాల రాకపోకలు ప్రారంభం అయ్యాయి.

రోడ్డు ఉపరితల వంతెన (ఆర్‌వోబీ)పై వెళ్లే వాహనాలు నడిమివంక దాటిన తర్వాత యూ టర్న్‌ తీసుకొని ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు రోడ్లవైపు వెళ్లాల్సి ఉంటుంది. వాహన చోదకులు ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం భూగర్భ రైలు వంతెన (ఆర్‌యూబీ) రావడంతో గడియారం కూడలి, కోర్డు రోడ్డు నుంచి ఒకటో రోడ్డు వైపు ఒకటి, రెండు, మూడు, నాలుగు రోడ్ల వైపు నివసించే వాసులతో పాటు ఆర్కేనగర్‌, రజకనగర్‌ వైపు వాసులకు సౌలభ్యంగా ఉంటుంది. ప్రధానంగా గడియారం స్తంభం వైపు ఉన్న ప్రయాణికులు ఒకటో రోడ్డు వైపు ఉన్న ప్రధాన రైల్వేస్టేషన్‌ ఒకటో ప్లాట్‌ఫారానికి వెళ్లడానికి వీలుగా ఉంటుంది. అనంతపురం నుంచి గుత్తి, గుంతకల్లు, విజయవాడ, హైదరాబాద్‌ వెళ్లే రైళ్లు ఒకటో ప్లాట్‌ఫారంలోనే ఆగుతాయి. గడియారం వైపు ఉన్న ప్రయాణికులు భూగర్భ రైలు వంతెన ద్వారా రెండో రోడ్డు, ఒకటవ రోడ్డు మీదుగా రైల్వేస్టేషన్‌కు చేరడానికి వీలుగా ఉంటుంది. ఒకటి, రెండు, మూడు, నాలుగురోడ్లవైపు ప్రజలు కోర్టు రోడ్డుకు వెళ్లడానికి సౌలభ్యంగా ఉంటుంది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని