logo

‘చెత్త’నూ తొలగించలేని ప్రభుత్వం

Published : 18 Apr 2024 04:17 IST

ఆర్భాటాలకే పరిమితమైన క్లాప్‌ కార్యక్రమం
ఇంటింటా సేకరణలో పూర్తిగా విఫలం

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాదుడే బాదుడు అంటూ ప్రసంగాలు చేసిన జగనన్న.. సీఎం కుర్చీ ఎక్కాక సరికొత్త పన్నులతో జనాల నడ్డి విరుస్తున్నారు. పన్నులందు జగనన్న పన్నులు వేరయా అనేలా పరిపాలన కొనసాగించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా చెత్తపన్ను విధించి పట్టణవాసుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. క్లాప్‌ అంటూ కొత్త కార్యక్రమం తీసుకొచ్చి హంగామా చేశారు. బినామీలకు పనులు కట్టబెట్టి జనాల నుంచి రూ.కోట్లలో దండుకున్నారు. కానీ పట్టణాల్లో ఎక్కడా శుభ్రత అనేది కనిపించడం లేదు.

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: తెదేపా హయాంలో ఇంటింటికీ వెళ్లి తడి పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేవారు. పట్టణవాసుల నుంచి రూపాయి కూడా వసూలు చేయలేదు. జగన్‌ అధికారంలోకి వచ్చాక చెత్తసేకరణను కొద్దిరోజులు పూర్తిగా పక్కన పెట్టేశారు. తర్వాత క్లాప్‌ పేరుతో యూజర్‌ ఛార్జీల కింద ప్రతినెలా రూ.90 నుంచి రూ.150 వరకు వసూలు చేయడం మొదలుపెట్టారు. ఉమ్మడి అనంత జిల్లాలో అనంతపురం, హిందూపురం, ధర్మవరం, కదిరి, గుంతకల్లు మున్సిపాలిటీల్లో కొద్దిరోజులు నామమాత్రంగా వీధుల్లో వాహనాలు పెట్టి చెత్త సేకరించిన జగన్‌ ప్రభుత్వం.. తర్వాత వాటిని పక్కనపెట్టేసింది. వాహనాల కొనుగోలుకు ఖర్చుచేసిన కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరులా మారాయి.

రూ. 11 కోట్ల వడ్డన

క్లాప్‌ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి రోజూ చెత్త సేకరించాలి. సరిపడా వాహనాలు, సిబ్బందిని అందించకుండా చెత్తపన్ను వసూలు చేయడం మొదలుపెట్టారు. అనంతపురం, హిందూపురం, ధర్మవరం, కదిరి, గుంతకల్లు మున్సిపాలిటీలకు మొత్తం 160 వాహనాలు అవసరం ఉండగా కేవలం 136 మాత్రమే సరఫరా చేశారు. కొన్నిచోట్ల డ్రైవర్లను నియమించకపోవడంతో వాహనాలు మూలకు చేరాయి. ఇన్ని లోపాలున్నా ప్రతినెలా చెత్తపన్ను వసూలు చేస్తున్నారు. ఐదు మున్సిపాలిటీల్లో నెలకు రూ.11 కోట్ల మేర చెత్తపన్ను వసూలుకు లక్ష్యం విధించుకున్నారు. గుంతకల్లు, అనంతపురంలో వృద్ధులకు ఇచ్చే పింఛను సొమ్ములో నుంచి చెత్త పన్ను మినహాయించుకోవడం గమనార్హం. వ్యాపార సముదాయాలు, కిరాణ దుకాణాలు, హోటళ్ల నుంచి భారీ మొత్తంలో పన్ను వసూలు చేస్తున్నారు. దీంతో చిరువ్యాపారులు ఆర్థికంగా నష్టపోతున్నారు.


తోపుడు బండ్లే దిక్కు

ధర్మవరం: పట్టణంలో ఇంటింటా చెత్త సేకరణకు వినియోగించే వాహనాలు మూడు నెలలుగా మూలనపడ్డాయి. పురపాలక కార్యాలయంలో 20కి పైగా వాహనాలు చెట్ల కింద నిరుపయోగంగా నిలిపివేశారు. వాహనాలు తిరగకపోవడంతో కార్మికులు ఇంటింటా చెత్త సేకరణ చేసేందుకు తోపుడు బండ్లు వినియోగిస్తున్నారు. సేకరించిన చెత్తను రహదారుల పక్కన నిల్వ చేస్తున్నారు. ఆ చెత్తను ట్రాక్టర్లలో నింపి డంపింగ్‌ యార్డుకు తీసుకెళుతున్నారు. రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన చెత్త తరలింపు వాహనాలు నిరుపయోగంగా ఉన్నాయి.

ధర్మవరం
1.50 లక్షలు
40
72 టన్నులు

మున్సిపాలిటీ

జనాభా

వార్డులు

రోజూ ఉత్పత్తయ్యే చెత్త


ఆరునెలలుగా తిరగని ఆటోలు

హిందూపురం పట్టణం: గతంలో పురపాలిక తన వద్ద ఉన్న వాహనాలు, ఆటోలు, కార్మికులతో ఇంటింటా చెత్త సేకరణ చేయించేది. వైకాపా ప్రభుత్వం పట్టణాలను చెత్తరహితంగా చేస్తామని, క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) పేరుతో కొత్త విధానం తీసుకొచ్చారు. పట్టణానికి 22 ఆటోలు అందించారు. కానీ, ఆశించిన స్థాయిలో చెత్త పన్ను వసూలు కాక, మున్సిపల్‌ ఖజానాలో నిధులు లేక ఆరు నెలలుగా ఆటోలు తిప్పడం లేదు. గతంలో ఉన్న వాహనాలను పక్కన పెట్టడంతో అవీ పాడయ్యాయి. చెత్త సేకరణను కార్మికులతో తోపుడు బండ్లతో చేయించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.

హిందూపురం
1,76,000
38
66 టన్నులు


మాటలేగానీ.. చేతల్లో లేదు

అనంత నగర పాలక: నగరంలో పూర్తి స్థాయిలో చెత్త సేకరణ సాగడం లేదు. పలు ప్రాంతాలకు క్లాప్‌ ఆటోలు వెళ్లడం లేదు. రోడ్లు మీదే చెత్త ఉంటోంది. నగరపాలక సంస్థ ఏర్పాటై 19 ఏళ్లు అవుతున్నా పారిశుద్ధ్యం తీరు మారలేదు. చెత్తను తరలించకుండా నగరంలోని పలు వీధుల్లో, ప్రధాన రోడ్లలో నిప్పు పెడుతున్నారు. ఇంటింటా చెత్త సేకరిస్తున్నామనే మాటే గాని నగరంలోని పలు ప్రాంతాల్లో, నివాసాల వద్ద, ఖాళీ ప్రదేశాల్లో చెత్త పేరుకుపోతోంది.

అనంతపురం
3,46,000
50
125 టన్నులు


ఎక్కడ చూసినా వ్యర్థాలే..!

పుట్టపర్తి: పట్టణంలో రోజూ చెత్త తరలించే ఒక కంపార్ట్‌ మురమ్మతులకు గురై ఆరు నెలలు అవుతున్నా నేటికీ వినియోగంలోకి తీసుకురాలేదు. అద్దె ట్రాక్టర్ల ద్వారా డంపింగ్‌ యార్డుకు వ్యర్థాలు తరలిస్తున్నారు. ప్రధాన రహదారుల్లో ఉన్న చెత్త కుప్పలను మాత్రమే రోజూ తరలిస్తున్నారు. వీధుల్లో ఉన్న వ్యర్థాలను రెండు, మూడు రోజులకోసారి మాత్రమే తొలగిస్తున్నారు. 9, 10, 13, 14, 15, 16, 17, 18, 19, 20 వార్డుల్లో పది రోజులకోసారి కూడా చెత్త తొలగించే పరిస్థితి లేదు. పారిశుద్ధ్యం పూర్తిగా లోపించింది.

పుట్టపర్తి
37.500 లక్షలు
20
13 టన్నులు


వాహనాలు కదలక.. చెత్తను కాల్చేస్తూ..

కదిరి: మున్సిపాలిటీలో చెత్తసేకరణకు క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కింద 15 వాహనాలు కేటాయించారు. అవి సుమారు మూడు నెలలుగా తిరగడం లేదు. మున్సిపల్‌ వాటర్‌ ట్యాంక్‌ ఆవరణలో మూలన పడేశారు. దీంతో ఇంటింటా చెత్తసేకరణ కష్టంగా మారింది. ఈ ఆటోలు తక్కువ ఉండటంతో పారిశుద్ధ్యం మెరుగు చర్యలు కష్టంగా మారాయి. సరైన వేళల్లో చెత్తసేకరించకపోవడంతో ప్రజలు మురుగు కాలువల్లో వేస్తున్నారు. దీంతో మురుగు ముందుకెళ్లడం లేదు. కొన్నిచోట్ల బహిరంగ ప్రదేశాల్లో చెత్తకుప్పలకు నిప్పుపెడుతున్నారు.

కదిరి
1.08 లక్షలు
36
30 టన్నులు


రూ.3 కోట్ల యంత్రాలు మూలకు

గుంతకల్లు: చెత్తను పట్టణం నుంచి కంపోస్టు యార్డుకు తరలించే క్లాప్‌ ఆటోలు కొన్ని పాడై మూలనపడ్డాయి. దీంతో ఏరోజు చెత్తను ఆరోజు తరలించడానికి కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం 26 వాహనాలు ఉంటే ఇందులో 8 పనిచేయడం లేదు. 400 మంది పారిశుద్ధ్య కార్మికులకుగాను 210 మంది మాత్రమే ఉన్నారు. ప్రభుత్వం రూ.3 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన యంత్రాలకు చోదకులను నియమించలేదు. దీంతో అవి మూలనపడ్డాయి.

గుంతకల్లు
1,60,000
37
60 టన్నులు


పారిశుద్ధ్యం అధ్వానం.. అవస్థల్లో జనం

రాయదుర్గం: పట్టణంలో స్వచ్ఛాంధ్ర ప్రదేశ్‌ (క్లాప్‌) కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం చెత్తసేకరణకు 9 వాహనాలివ్వగా వాటిలో 8 పాడవడంతో మున్సిపల్‌ కార్యాలయం వద్ద నిలిపివేశారు. ప్రస్తుతం ఒకటి మాత్రమే చెత్తసేకరణకు వినియోగిస్తున్నారు. ఆరు నెలలకోమారు ముక్కుపిండి పన్నులు వసూలు చేసే మున్సిపల్‌ అధికారులు పట్టణాన్ని స్వచ్ఛంగా మార్చటంలో విఫలమవుతున్నారు. 41 మంది రెగ్యులర్‌, 78 మంది ఒప్పంద ఉద్యోగులతో చెత్తసేకరణ కష్టసాధ్యంగా మారింది.

రాయదుర్గం
70 వేలు
32
27 టన్నులు


15 రోజులకోసారీ డ్రైనేజీ శుభ్రం

కళ్యాణదుర్గం గ్రామీణం: మున్సిపాలిటీలో 85 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉండాల్సి ఉండగా ఒక్కరు కూడా రెగ్యులర్‌వారు లేరు. 63 మంది ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులున్నారు. కార్మికుల సంఖ్య తక్కువగా ఉండటంతో సకాలంలో చెత్త సేకరణ చేయడంలో ఆలస్యమవుతోంది. ఒక్కో వార్డులో డ్రైనేజీ శుభ్రం చేయాలంటే 15 రోజులు అవుతోంది. రోజు విడిచి రోజు చెత్తసేకరణ చేస్తున్నారు.

కళ్యాణదుర్గం
60 వేలు
24
19 టన్నులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని