logo

అంతంతమాత్రమే ‘కరుణ’?

తితిదే పరిధిలోని బర్డ్‌ అసుపత్రిలో పనిచేస్తున్న స్పీచ్‌ థెరపిస్టు రూ.22,907 జీతం పొందేవారు. తాజా పెంపుతో రూ.25 వేలకు చేరింది. వేదపారాయణదారు పోస్టుకు నెలకు రూ.21,500 చెల్లిస్తుండగా..

Updated : 18 Apr 2024 05:29 IST

తితిదేలో వేతనాల పెంపులో అసమతుల్యత
ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగుల అసంతృప్తి

తిరుపతి (నగరపాలిక), న్యూస్‌టుడే: తితిదే పరిధిలోని బర్డ్‌ అసుపత్రిలో పనిచేస్తున్న స్పీచ్‌ థెరపిస్టు రూ.22,907 జీతం పొందేవారు. తాజా పెంపుతో రూ.25 వేలకు చేరింది. వేదపారాయణదారు పోస్టుకు నెలకు రూ.21,500 చెల్లిస్తుండగా.. దాన్ని రూ.54 వేలకు చేర్చారు. జూనియర్‌ ఆడిటర్‌/ జూనియర్‌ అకౌంటెంట్లకు రూ.25 వేల నుంచి రూ.40 వేలకు పెంచారు.   తితిదే తాజాగా పెంచిన జీతాల్లో కొన్ని విభాగాల్లో అపరిమిత లబ్ధి చేకూరగా.. మరికొన్ని విభాగాల్లో అత్యల్పంగా పెరిగింది.. ఇది కనిష్ఠంగా రూ.2 వేలు.. గరిష్ఠంగా రూ.30 వేల వరకు ఉందని ఉద్యోగులు చెబుతున్నారు.

  • తితిదేలో 6,800 మంది వరకు శాశ్వత ఉద్యోగులున్నారు. వీరితోపాటు ఒప్పంద/పొరుగుసేవల సిబ్బందిలో కార్పొరేషన్లు, సొసైటీలు, ఏజెన్సీల పరిధిలో, దినసరి వేతనంతో పనిచేస్తున్నవారు ఉన్నారు. వీరి జీతాలు ఎంతకూ పెరగడం లేదు. సిబ్బంది హోదాలు, జీతాల్లో సారూప్యత తీసుకువచ్చి జీతాలు పెంచాలని.. 2024 ఫిబ్రవరి 27న తితిదే పాలక మండలికి 568వ అజెండా అంశంగా చర్చకు ప్రవేశపెట్టగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు.
  • తితిదేలో పనిచేసే ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగుల జీతాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2022 జనవరి 17న విడుదల చేసి జీవో నం.7న అనుసరించి స్కిల్డ్‌, సెమీస్కిల్డ్‌, అన్‌స్కిల్డ్‌ అనే మూడు కేటగిరీలుగా విభజించి మొదటి విభాగం నెలసరి జీతం రూ.21,500, రెండో కేటగిరికి రూ.18,500, మూడో కేటగిరికి రూ.15 వేల వేతనం ప్రకటించింది. ఈ జీవోకు అనుగుణంగా
    తితిదేలో పనిచేసే ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు కార్పొరేషన్లు, ఏజెన్సీలు, కాంట్రాక్టర్ల ద్వారా వేతనాలు చెల్లిస్తున్నారు. తితిదేలో ప్రత్యేకంగా శ్రీవారి సేవా కోఆర్డినేటర్‌, రికార్డింగ్‌ ఇంజినీర్‌, కాస్ట్‌ అకౌంటెంట్‌ వంటి 20 లోపు పోస్టులకు రూ.21,500 మించి వచ్చేది. వేతనాల పెంపు కోసం తితిదే పొరుగుసేవల ఉద్యోగులు ఏళ్లతరబడి పోరాటం చేస్తుండగా తిరుపతి ఎమ్మెల్యే, తితిదే పాలకమండలి అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి ఎన్నికల ప్రకటనకు కచ్చితంగా నెలముందు జీతాల పెంపును తీర్మానించారు. ఆయన అసలు లక్ష్యం, కారణమేదైనా పెంచిన జీతాలు ఈనెల ఆలస్యంగా అందుకున్న పొరుగుసేవలు, ఒప్పంద ఉద్యోగుల ఖంగుతిన్నారు. కొన్ని విభాగాల్లో పనిచేసేవారికి 110 శాతం పెరుగుదల కనిపించగా.. మరికొందరికి 10 నుంచి 15 శాతం మాత్రమే పెరగడంపై సగటు వేతనజీవిలో ఆవేదన, అయోమయం మిగిలింది.

కనిపించని హోదా, వేతన సారూప్యత

తితిదే తాజా వేతనాల పెంపు గందరగోళంగా ఉంది. స్కిల్డ్‌, సెమీస్కిల్డ్‌, అన్‌స్కిల్డ్‌ విభాగాలతోపాటు హైస్కిల్డ్‌ విభాగం చేర్చారు. సెమీస్కిల్డ్‌ ఉద్యోగి పొందుతున్న వేతనంకంటే ఎక్కువగా అన్‌స్కిల్డ్‌ ఉద్యోగి పొందుతున్నారు. పెంపులో శాస్త్రీయత లోపించిందనేది పొరుగుసేవల ఉద్యోగుల వాదన. గరిష్ఠంగా రూ.2 వేల నుంచి రూ.33 వేలకు పైగా పెరుగుదల కనిపిస్తుండగా హోదాల పెంపు, వేతనాల నిర్ధారణకు తితిదే అవలంబించిన విధానం ఏమిటనేది ఉద్యోగులకు అంతుచిక్కడం లేదు. కేటగిరీలు, హోదాలు, అనుభవంతో సంబంధం లేకుండా అతి పెరుగుదల, అత్యల్ప పెరుగుదల కనిపిస్తోందని వారు విమర్శిస్తున్నారు.

  • లక్ష్మీ శ్రీనివాస మ్యాన్‌పవర్‌ కార్పొరేషన్‌ ద్వారా ఫిబ్రవరి 15న పరిచారికలు, అర్చకుల పోస్టులకు రూ.24,640 వేతనంతో పోస్టులు భర్తీ చేయగా.. ఇదేనెల 26న జరిగిన పాలకమండలి సమావేశంలో జీతం పెంపు నిర్ణయం తీసుకోవడంతో వారి తొలినెల వేతనం రూ.45 వేలు, రూ.21 వేలతో నియమితులైన పరిచారిక రూ.30 వేలు అందుకున్నారు.

నాలుగువేల మందికే వర్తింపు

తితిదేలో పనిచేస్తున్న పొరుగుసేవలు, ఒప్పంద ఉద్యోగుల జీతాల పెంపు వర్తింపు గణనీయంగా కుదించినట్లు స్పష్టమవుతోంది. 16 వేలమందిని నిబంధనల పేరుతో 6,800కు తగ్గించగా అర్హుల జాబితాకు వచ్చేసరికి 4,901, జీతాల చెల్లింపునకు వచ్చేసరికి 4,052 మందిని పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడవుతోంది. నిబంధనల పేరుతో పలు విభాగాలకు జీతాలపెంపు వర్తించకపోవడం, రూ.10 వేలలోపు వేతనం తీసుకుంటున్న 12 వేలమంది సిబ్బంది దైన్యాన్ని తితిదే అధికారులు పట్టించుకోలేదా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని