logo

పస్తులతో పనులు చేస్తున్నాం

త్రిరాష్ట్ర కూడలిలో ఏర్పాటైన ద్రవిడ వర్సిటీలో ఒకప్పుడు సీటు దొరకడమే కష్టం. తెదేపా హయాంలో వెలిగిపోయిన వర్సిటీ.. వైకాపా పాలకుల కక్ష సాధింపు చర్యలకు మనుగడే ప్రశ్నార్థకంగా మారింది.

Published : 18 Apr 2024 02:39 IST

జీతాలిచ్చి ఆదుకోండి ప్రభో..!
ఎనిమిది నెలలుగా పోరాటం.. స్పందన లేక ఆందోళన

ద్రవిడ వర్సిటీలో సమ్మె చేస్తున్న పొరుగు సేవల ఉద్యోగులు (పాతచిత్రం)

కుప్పం గ్రామీణ, న్యూస్‌టుడే: త్రిరాష్ట్ర కూడలిలో ఏర్పాటైన ద్రవిడ వర్సిటీలో ఒకప్పుడు సీటు దొరకడమే కష్టం. తెదేపా హయాంలో వెలిగిపోయిన వర్సిటీ.. వైకాపా పాలకుల కక్ష సాధింపు చర్యలకు మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. కనీసం అక్కడి పొరుగు సేవల సిబ్బందికి వేతనాలు చెల్లించలేని దుస్థితి. ఇది చాలు ఈ పాపం వైకాపా సర్కార్‌దేనని చిన్నపిల్లాడికి సైతం ఇట్టే అర్థమైపోతుంది.

ద్రవిడపై ప్రభుత్వం శీతకన్ను..!

ద్రవిడ విశ్వవిద్యాలయానికి బ్లాక్‌ గ్రాంటు కింద రూ.33 కోట్లకు ప్రతిపాదనలు పంపగా... ప్రభుత్వం రూ.19 కోట్లు మాత్రమే కేటాయించింది. వీటితో వర్సిటీ పాలన, రెగ్యులర్‌ బోధన, బోధనేతర ఉద్యోగులకు రూ.1.60 కోట్ల వరకు ప్రతినెలా జీతాల రూపంలో చెల్లిస్తున్నారు. ప్రస్తుతం దూరవిద్య నిధులు ఖాళీ కావడంతో పొరుగు సేవల ఉద్యోగుల జీతాలూ బ్లాక్‌ గ్రాంట్‌ నుంచి చెల్లించాలి. అయితే అందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. దాని కోసం వీసీ ఆచార్య మధుజ్యోతి యత్నిస్తున్నా.. ఉన్నత విద్యాశాఖ నుంచి స్పందన కరవైంది. దీంతో ఆమె ఏమి చేయలేని పరిస్థితి. మరోవైపు   వర్సిటీ బ్లాక్‌ గ్రాంట్‌ నుంచి పొరుగు సేవల ఉద్యోగులకు జీతాలు చెల్లించరాదంటూ రెగ్యులర్‌ ఉద్యోగులు అడ్డుపడుతున్నారు.

ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టి...

వర్సిటీలో ఒకప్పుడు 254 మంది పొరుగు సేవల ఉద్యోగులు పనిచేసేవారు. జీతాలు రాకపోవడంతో కొందరు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లి వేరే పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. దీంతో వారి సంఖ్య 227కు పడిపోయింది. వీరంతా ఇటీవల వరకు జీతాల కోసం కలిసికట్టుగా పోరాటం చేశారు. వారిలో సుమారు 10 మందిని వర్సిటీ రిజిస్ట్రార్‌ వేణుగోపాల్‌రెడ్డి మచ్చిక చేసుకుని చిచ్చుపెట్టారు. సమ్మె విరమించి విధుల్లో చేరాలని వారిని ఆదేశించారు. దీంతో పొరుగు సేవల ఉద్యోగుల్లో లుకలుకలు మొదలయ్యాయి. పరస్పర దాడులకు సైతం దిగారు. ఇటీవల ఇరువర్గాలు గుడుపల్లె పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. దీనిపైనా కూడా పాలకవర్గం స్పందించలేదు.

సమ్మె చేసినా... ఫలితం శూన్యమే...

2023 జనవరి నుంచి పొరుగు సేవల ఉద్యోగులకు జీతాల సమస్య ఏర్పడింది. అప్పట్లోనే 53 రోజులపాటు విధులు బహిష్కరించి సమ్మె చేపట్టారు. దీనిపై స్పందించిన వర్సిటీ అధికారులు దాదాపు 3 నెలల జీతాలు చెల్లించారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా జీతాలు వస్తాయని హామీ ఇచ్చి సమ్మె విరమింపజేశారు. తర్వాత సమ్మె కాలం 68 రోజులతో పాటు మరో ఆరు నెలల జీతాల బకాయిలు పడ్డారు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి 12 నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. మార్చి 1న వర్సిటీ బంద్‌ చేశారు. అయినా... వర్సిటీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పొరుగు సేవల ఉద్యోగులు అయోమయంలో పడ్డారు.

కుటుంబ పోషణ ఎలా?..: జీతాలపై ఆధారపడి బతుకుతున్నాం. ఎనిమిది నెలలుగా జీతాలు అందించకుంటే కుటుంబ పోషణ భారమైంది.  అధికారులేమో మా వద్ద పనులు మాత్రం చేయించుకొంటున్నారు. జీతాలు చెల్లించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిరసన, సమ్మె, బంద్‌ ఇలా ఏమి చేసినా పట్టించుకోవడం లేదు. ఉద్యోగాలు చేయాలా... వద్దా.. అనే అయోమయంలో పడ్డాం.

జ్ఞానేశ్వరబాబు, అటెండరు

మా జీవితాలతో చెలగాటమాడొద్దు..: విశ్వవిద్యాలయం ప్రారంభం నుంచి పనిచేస్తున్నా. ఎప్పుడూ జీతాల సమస్య రాలేదు. ఏడాది నుంచి అధికారులు వేధిస్తున్నారు. నిరసనలు చేపట్టినా మా సమస్య పట్టించుకోవడం లేదు. అధికారులు స్పందించకుంటే మరింత ఉద్ధృతం చేస్తాం.

శ్రీనివాసులు, పొరుగు సేవల ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు