logo

ఎందుకిలా చేశావయ్యా..

స్నేహితులకు ఏ కష్టమొచ్చినా ధైర్యం చెప్పేవాడివి. క్లాస్‌లో లీడర్‌గా ఉన్నావు. ఎన్‌సీసీలో ఉత్తమ కేడెట్‌గా పేరు తెచ్చుకున్నావు.. అలాంటి నువ్వు ఎందుకు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయావు. బీటెక్‌ రెండో ఏడాదిలో ఓ సబ్జెక్టు ఆగింది. మరో పది రోజుల్లో మూడో సంవత్సరం సెమిస్టర్‌ పరీక్షలున్నాయి. పాస్‌ కాలేనని ఎందుకనుకున్నావ్‌.. ఇలా ఎందుకు చేశావ్‌.. మాన

Updated : 26 Jan 2022 04:54 IST


లోళ్ల సాయి చరణ్‌

తాళ్లరేవు, న్యూస్‌టుడే: స్నేహితులకు ఏ కష్టమొచ్చినా ధైర్యం చెప్పేవాడివి. క్లాస్‌లో లీడర్‌గా ఉన్నావు. ఎన్‌సీసీలో ఉత్తమ కేడెట్‌గా పేరు తెచ్చుకున్నావు.. అలాంటి నువ్వు ఎందుకు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయావు. బీటెక్‌ రెండో ఏడాదిలో ఓ సబ్జెక్టు ఆగింది. మరో పది రోజుల్లో మూడో సంవత్సరం సెమిస్టర్‌ పరీక్షలున్నాయి. పాస్‌ కాలేనని ఎందుకనుకున్నావ్‌.. ఇలా ఎందుకు చేశావ్‌.. మానసిక ఒత్తిడితో బలవన్మరణానికి పాల్పడి మంగళవారం గోదావరిలో విగత జీవిగా తేలిన కోరంగి కైట్‌ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థి లోళ్ల సాయిచరణ్‌(19) కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల వేదన.. మనసు కలచివేసే రోదన ఇది.

కన్నోళ్లకు కడుపుకోత..

పాస్‌ కాకుంటే.. ఉద్యోగంలో స్థిరపడలేననే ఆందోళనతో చివరిసారిగా సాయిచరణ్‌ తల్లితో మాట్లాడాడు. మరో ఏడాదిలో చదువు పూర్తికాగానే కొడుకు ప్రయోజకుడవుతాడనుకుంటే.. మానసిక ఒత్తిడితో ప్రాణం తీసుకున్న అతని నిర్ణయం కన్నోళ్లకు కడుపుకోత మిగిల్చింది. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బి.గొనపపుట్టుగ గ్రామానికి చెందిన లోళ్ల సాయిచరణ్‌ జనవరి 10న సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్లి ఆనందంగా గడిపాడు. ఈ నెల 18న తిరిగి కళాశాలకొచ్చాడు. జనవరి 26న రిపబ్లిక్‌ డే పరేడ్‌ ఉందని, సెలూన్‌కు వెళ్లొస్తానని 23న తన తండ్రితో వసతిగృహ నిర్వాహకులకు ఫోన్‌ చేయించి, బయటికి వచ్చి కనిపించకుండాపోయాడు. పోలీసులు, స్నేహితులు, బంధువులు గాలించారు. మంగళవారం తెల్లవారుజామున తాళ్లరేవు మండలంలోని అరటికాయలంక వద్ద గోదావరిలో మృతదేహంగా కనిపించాడు. నేను ఫోన్‌ చేయకుండా ఉంటే.. నా పెద్దకొడుకు బతికేవాడంటూ తండ్రి షణ్ముఖరావు, తల్లి లోకేశ్వరి విలపిస్తుంటే.. సాయి స్నేహితులూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మంచి విద్యార్థిని కోల్పోయామని కళాశాల ఎన్‌సీసీ ఆఫీసర్‌ ఎం.సుబ్రహ్మణ్యం వాపోయారు. విద్యార్థి మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని కోరంగి ఏఎస్సై ఎ.ప్రసాదరావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని