logo

సైజు మారదు.. కాలు దూరదు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరిస్థితి ఇలాగే ఉంది. జగనన్న విద్యాకానుకలో భాగంగా ప్రతి విద్యార్థికి ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు ఇస్తామన్నారు. వీటి సరఫరాలో జాప్యం జరిగింది.

Published : 20 Oct 2022 04:50 IST

-న్యూస్‌టుడే, మండపేట, రామచంద్రపురం

రాజమహేంద్రవరం జిల్లా సీతానగరం వంగలపూడి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి పది తరగతుల విద్యార్థులు 241 మంది చదువుతున్నారు. జగనన్న విద్యాకానుకలో భాగంగా అందరికీ బూట్లు అందాలి. కానీ ఇప్పటికీ 46 మందికి రాలేదు. బూట్లు తీసుకున్నవారు కూడా వేసుకుని తిరగడానికి నానాపాట్లు పడుతున్నారు. కొందరి కాళ్లకు చిన్నవిగా, బిగుతుగా మరికొందరికి పెద్దవిగా లూజుగా ఉన్నాయి. దాంతో చెప్పులతోనే పాఠశాలకు వస్తున్నారు.


కాకినాడ జిల్లా కాజులూరు మండలం కాజులూరు ఉన్నత పాఠశాలలో 970 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాలలోకి 3,4,5 తరగతులు కూడా విలీనం అయ్యాయి. వారు అక్కడి నుంచి వచ్చేటపుడే బూట్లు తెచ్చుకోవడంతో సమస్య లేదు. ఆరు నుంచి పది తరగతులు చదువుతున్న 212 మందికి బూట్లు ఇప్పటికీ అందలేదు. విద్యార్థుల పాదాల కొలతలకు సరిపడా ఎక్కడైనా మిగిలి ఉంటే తెచ్చుకోవాలని అధికారులు సూచించారు.  


డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం దంగేరు ఉన్నత పాఠశాలలో 455 మంది విద్యార్థులున్నారు. ఇంకా 148 మందికి బూట్లు అందనే లేదు. తీసుకున్నవారు కూడా చాలా మంది బూట్లు బడికి వేసుకురావడం లేదు. ఎందుకని అడుగుతుంటే సరిపోలేదని, కరిచేస్తున్నాయని, జారిపోతున్నాయని ఇలా పలు రకాలుగా చెబుతున్నారు. మండల వనరులకేంద్రంలో చాలా బూట్లు స్టాకు ఉందని తెలిసి వెళ్లి చూసుకున్నామని అయితే స్టాకున్నా అవి తమ పిల్లలకు సరిపోవడం లేదని పాఠశాల ఉపాధ్యాయులు చెప్పారు.


రామచంద్రపురం మండలంలోని పాఠశాలల విద్యార్థులకు బూట్లు వచ్చాయి. కానీ అవి చాలా మందికి సరిపోవడం లేదు. సైజుల్లో చాలా తేడాలొచ్చాయి. కొన్ని పాఠశాలకు ఒక కాలుకు సంబంధించినవే వచ్చాయి. సమగ్ర శిక్షా అభియాన్‌ అధికారులను అడిగితే ఇండెంటు ప్రకారం బూట్లు ఇచ్చేశామని.. సరిపోకపోతే పక్క మండలాల నుంచి సర్దుబాటు చేసుకోవాలని సూచించారని ఎంఈవో ఎం.శ్రీనివాసు చెప్పారు. దీంతో  630 జతల బూట్లు తెచ్చామని, ఇంకా 245 వరకూ వస్తే కానీ అందరికీ సరిపెట్టలేమని, ఎక్కడున్నాయో వాకబు చేసుకోవాలని చెప్పారు.

సత్యవాడలో చెప్పులతోనే పాఠశాలకు వస్తున్న విద్యార్థినులు

మ్మడి జిల్లా వ్యాప్తంగా పరిస్థితి ఇలాగే ఉంది. జగనన్న విద్యాకానుకలో భాగంగా ప్రతి విద్యార్థికి ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు ఇస్తామన్నారు. వీటి సరఫరాలో జాప్యం జరిగింది. ఇప్పటికీ కొన్ని పాఠశాలలకు వస్తూనే ఉన్నాయి. ఇచ్చిన వాటిలో సైజులు సరిపోక విద్యార్థులు నానాపాట్లు పడ్డారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గణాంకాల ప్రకారం 4,26,000 మందికి బూట్లు అందాలి. సరఫరాలో పలు లోపాలు తలెత్తాయి. వేసవి సెలవుల్లోనే విద్యార్థులకు కావాల్సిన బూట్ల కొలతలు ఆన్‌లైన్‌లోనే సంబంధిత అధికారులకు అందజేశారు. తీరా వచ్చేటప్పటికి చాలా మందికి సైజులు మారిపోయాయి. ముఖ్యంగా 9,10 తరగతులు చదువుతున్న బాలురుకు ఎక్కడా కూడా సరిగా సరిపోలేదు. ఇలా సరిపోని బూట్లను తిరిగి ఇచ్చేస్తే సరైన సైజులు ఇస్తామన్నారు. ఇలా మండల వనరుల కేంద్రాలకు ఎన్నో బూట్లు వచ్చి చేరాయి. అంతే పెద్ద సైజు బూట్లు ఇప్పటికీ అందలేదు. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులందరికీ బూట్లు, సాక్సులు అందాయని ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు చెబుతున్నారు.

అవసరమైన వాటి కన్నా ఎక్కువే వచ్చాయి..
- శివరామ్‌, ఉమ్మడి జిల్లా సీఎంవో, సమగ్ర శిక్షా అభియాన్‌

జిల్లాకు బూట్లు 4,26,000 జతలకన్నా పది శాతం ఎక్కువే వచ్చాయి. దఫదఫాలుగా రావడంతో మండలాలకు వీటిని సరఫరా చేయడంలో అక్కడక్కడా లోపాలు తలెత్తిన మాట వాస్తవమే. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో బూట్లు ఆయా మండల వనరుల కేంద్రాల్లో, కొన్ని పాఠశాలల్లో నిరుపయోగంగా ఉన్నాయి. వీటిని అవసరమైన మండలాలకు ఇవ్వాలని ఎంఈవోలకు సూచించాం. ఈ వారంలో అన్ని సర్దుబాట్లు పూర్తవుతాయి. అందరికీ సరిపడా సైజుల్లో బూట్లు అందుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని