logo

ఇచ్చినట్లే ఇచ్చి.. వెనక్కి తీసుకుని

ప్రభుత్వ పథకాలన్నీ పార్టీ రహితంగా, పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి కనిపించట్లేదు.

Updated : 05 Feb 2024 13:49 IST

తెదేపా సానుభూతిపరులు కావడమే కారణమా..!

శాంతిపేరుపై ఇచ్చిన పట్టా

బిక్కవోలు, న్యూస్‌టుడే: ప్రభుత్వ పథకాలన్నీ పార్టీ రహితంగా, పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి కనిపించట్లేదు. బిక్కవోలు ఆర్‌.ఎస్‌.పేటకు చెందిన బాదిరెడ్డి శాంతికి స్థానిక లేఔట్‌-1లో ఇంటిస్థలం(ప్లాట్‌ నంబరు 94) మూడేళ్ల క్రితం మంజూరు చేశారు. ఆర్థిక కారణాలతో వెంటనే ఇల్లు నిర్మించుకోలేకపోయారు. ఆరు నెలల అనంతరం నిర్మాణానికి శంకుస్థాపకు సిద్ధం కాగా అప్పటికే అందులో పునాదులు తీసి ఉన్నాయి. వెంటనే తహసీల్దారును కలిశారు. వీఆర్‌వోను పరిశీలించమని ఆయన ఆదేశించారు.

కొద్ది రోజులకు సాంకేతిక లోపంతో ఇలా జరిగిందని, లేఔట్‌-2లో స్థలం ఇస్తామని అధికారులు నచ్చజెప్పారు. ఆ ప్రకారమే అక్కడ స్థలం చూపించగా గృహనిర్మాణానికి సిద్ధపడ్డారు. శంకుస్థాపనకు వెళ్లబోతే అధికారులు అడ్డుకున్నారు. దీన్ని కేటాయించలేమని, ఇప్పటికే మీకు మొదటి లేఔట్‌లో కేటాయించిన స్థలం ఆన్‌లైన్‌లో నమోదైందని, మరొకటి ఇవ్వడానికి అంగీకరించట్లేదన్నారు. ఎన్నిసార్లు తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని బాధితురాలు ఆవేదన చెందుతున్నారు. గతేడాది మార్చిలో స్పందనలో కలెక్టరుకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు పరిష్కారం కాలేదన్నారు. తాము తెదేపా సానుభూతిపరులం కావడంతోనే స్థలం రాకుండా అడ్డుకుంటున్నారని, తమకు కేటాయించిన స్థలంలో ఎవరో ఇల్లు నిర్మించుకోవడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. వీఆర్వో అశోక్‌ను వివరణ అడగ్గా పరిశీలిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు