logo

నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవు

పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

Published : 07 Dec 2022 04:21 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వీసీ హాలులో మంగళవారం జిల్లా వైద్యారోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వైద్యారోగ్య శాఖలో ప్రవేశపెడుతున్న వివిధ కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వహించే అధికారులపై శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జీజీహెచ్‌, ఆసుపత్రి, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో వైద్యులు, సిబ్బంది కచ్చితంగా ఆన్‌లైన్‌లో హాజరు నమోదు చేసుకోవాలన్నారు. విధులకు ఆలస్యంగా వస్తున్న వారు, ముందుగా వెళ్లిపోతున్న వారిని సంజాయిషీ కోరుతూ మెమోలు జారీ చేయాలన్నారు. క్షేత్ర స్థాయి సిబ్బంది సైతం నూతనంగా వచ్చిన ఫేస్‌ రికగ్నజేషన్‌ యాప్‌ ద్వారా కచ్చితంగా హాజరు నమోదు చేసుకోవాలన్నారు. ప్రయోగాత్మకంగా జరుగుతున్న ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని క్షేత్ర స్థాయిలోని అధికారులు నిరంతర పర్యవేక్షించాలన్నారు. ఓపీ తక్కువగా నమోదవుతున్న గ్రామాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అక్కడి కారణాలు విశ్లేషించాలన్నారు. ఎనీమియా ముక్త్‌ భారత్‌ ద్వారా సక్రమంగా రక్త పరీక్షలు నిర్వహించి, రక్తహీనత ఉన్న గర్భిణులపై సంబంధిత పీహెచ్‌సీల వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి వారికి రక్తహీనత లేకుండా మందులు, పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యారోగ్య శాఖలో ఉద్యోగుల భర్తీ, బయోమెట్రిక్‌ హాజరు తదితర అంశాలపై డీఎంహెచ్‌వో సక్రమంగా వివరాలు తెలియజేయకపోవడంతో కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభావతి, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ హనుమంతరావు, డాక్టర్‌ వైఎస్సాఆర్‌ ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త జయరామకృష్ణ, డీఐఓ సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని