logo

పట్టుదలతో శ్రమించి.. విజేతలుగా నిలిచి

ప్రజాసేవ చేయాలనే సంకల్పమే వారి విజయానికి ఇంధనం. లక్ష్య సాధనలో ఎదురైన వైఫల్యాలను గెలుపునకు సోపానాలుగా మార్చుకుని ప్రతిష్ఠాత్మక సివిల్స్‌లో మెరిశారు.

Updated : 17 Apr 2024 06:41 IST

తాడేపల్లి, పెదనందిపాడు, న్యూస్‌టుడే: ప్రజాసేవ చేయాలనే సంకల్పమే వారి విజయానికి ఇంధనం. లక్ష్య సాధనలో ఎదురైన వైఫల్యాలను గెలుపునకు సోపానాలుగా మార్చుకుని ప్రతిష్ఠాత్మక సివిల్స్‌లో మెరిశారు. ఈ క్రమంలో ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటూ వారు చేసిన ప్రయాణం ఎంతో మందికి ఆదర్శం.

మూడుసార్లు అపజయం వెక్కిరించినా..

కుటుంబం: గుంటూరు జిల్లా తాడేపల్లిలో నివాసం ఉంటున్న బడబాగ్ని వినీషా యూపీఎస్‌సీ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 821వ ర్యాంకు సాధించారు. తల్లిదండ్రులు శ్రీనివాసరాజు, విజయభారతి ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలందిస్తున్నారు.

చదువు: మద్రాస్‌ ఐఐటీ నుంచి బీటెక్‌, అమెరికాలోని పెన్సిల్‌వేనియా యూనివర్సిటీ నుంచి ‘సోషల్‌ పాలసీ’లో మాస్టర్స్‌ పూర్తి చేసిన ఆమె..ప్రస్తుతం విజయవాడ సీఆర్డీఏలో మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. మూడు సార్లు అపజయం ఎదురైనా..మొక్కవోని దీక్షతో సొంతగా పరీక్షకు సన్నద్ధమై విజేతగా నిలిచారు.
ఊరు మెచ్చేలా..: సోషియాలజీని ఆప్షనల్‌గా ఎంచుకున్న ఆమె సొంతగా నోట్సు తయారు చేసుకుని రోజూ కొంత సమయాన్ని ప్రిపరేషన్‌కు కేటాయించేవారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆమె వృత్తిరీత్యా తాడేపల్లిలో నివాసం ఉంటున్నారు. ప్రజలందరికీ సమ దృష్టితో సేవలు అందించాలన్నది తన లక్ష్యమని ఆమె చెబుతున్నారు.

చివరి ప్రయత్నంలో విజయ శిఖరం

పట్టువీడక: పట్టుదలకు ప్రణాళిక తోడైతే విజయం తథ్యమని చెబుతున్నారు పెదనందిపాడు మండలం గొరిజవోలుగుంటపాలెం గ్రామానికి చెందిన సయింపు కిరణ్‌. తాజాగా విడుదలైన సివిల్స్‌ ఫలితాల్లో ఆయన జాతీయస్థాయిలో 516వ ర్యాంకు సాధించారు.

చదువు: దిల్లీ ఐఐటీలో బీటెక్‌ పూర్తి చేసిన ఆయన ఆరేళ్ల పాటు పట్టువిడవకుండా శ్రమించి చివరి ప్రయత్నంలో విజయం సాధించారు. రోజూ ఏడు గంటలపాటు శిక్షణకు కేటాయించేవారు.

ఊరికి పేరు: దశాబ్దాల కిందటే ఈయన తల్లిదండ్రులు ప్రభాకరరావు, జయ తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ సమీపంలోని అనంతారం (గుంటూరు పల్లె) గ్రామానికి వ్యవసాయం నిమిత్తం వలస వెళ్లిపోయారు. కిరణ్‌ ర్యాంక్‌ సాధించి తమ సొంత ఊరికి మంచి పేరు తీసుకొచ్చారని బంధువులు, గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని