logo

అండ నేనన్నావు.. గుదిబండలా మార్చావు..

జిల్లాలో వైకాపా ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఉన్నవి చాలా వరకు మూతపడ్డాయి. పత్తి ఆధారిత పరిశ్రమలైన జిన్నింగ్‌ పూర్తిగా ఎత్తేయగా.. స్పిన్నింగ్‌ మిల్లులు అదే దిశగా నడుస్తున్నాయి.

Published : 19 Apr 2024 05:49 IST

సంక్షోభంలో పత్తి ఆధారిత మిల్లులు
మూతపడిన స్టోన్‌ క్రషర్‌ యూనిట్లు
పరిశ్రమల మూతతో ఉపాధి అవస్థలు
ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, మేడికొండూరు, పెదకాకాని, తెనాలి టౌన్‌

పేరేచర్ల: మూత పడిన కంకర తయారీ యూనిట్‌

జిల్లాలో వైకాపా ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఉన్నవి చాలా వరకు మూతపడ్డాయి. పత్తి ఆధారిత పరిశ్రమలైన జిన్నింగ్‌ పూర్తిగా ఎత్తేయగా.. స్పిన్నింగ్‌ మిల్లులు అదే దిశగా నడుస్తున్నాయి. స్థిరాస్తి వ్యాపారం పూర్తిగా స్తంభించడంతో దాని ఆధారంగా ఉన్న అనేక అనుబంధ వ్యాపారాలు దెబ్బతిన్నాయి. క్వారీలు, స్టోన్‌క్రషర్లు, మిక్సర్‌ ప్లాంట్లు కొన్ని మూతపడగా మరికొన్ని సామర్థ్యం మేరకు పని చేయడం లేదు.

  • అండగా ఉంటానని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చిన జగన్‌ గెలిచాక సాయం మరిచారు. రాయితీలు సకాలంలో విడుదల చేయలేదు. ప్రభుత్వ నిర్ణయాలు పరిశ్రమకు  ప్రతికూలంగా మారాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రభావంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల కుటుంబాల ఉపాధికి గండిపడింది. యువతకు వారి అర్హతకు తగిన పనులు లేకపోవడంతో పొరుగు రాష్ట్రాల బాట పట్టారు.
  • ఇసుక కొరతతో భవన నిర్మాణ రంగం కుదేలు కావడంతో దానిపై ఆధారపడిన వారంతా రోజువారీ కూలీకి పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చింది. మొత్తంగా రోజువారీ పనులు చేసుకునే కూలీల నుంచి నెలవారీ వేతనానికి పని చేసే ప్రైవేటు ఉద్యోగుల వరకు అందరూ అయిదేళ్లలో తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. ఒకవైపు ఉపాధి లేక ఆదాయం తగ్గిపోవడం, మరోవైపు నిత్యావసరాలతో సహా అన్ని వస్తువుల ధరలు పెరగడంతో సామాన్యులు, మధ్య తరగతి ప్రజల జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం పడింది.

పొరుగు రాష్ట్రాలకంటే పన్నులెక్కువ

జిల్లాలో వాణిజ్య పంట పత్తి విస్తారంగా పండుతోంది. పత్తి నుంచి దూదిని తీసే జిన్నింగ్‌ మిల్లులకు ప్రోత్సాహం లేకపోవడంతో అవి పూర్తిగా కనుమరుగయ్యాయి. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే మన వద్ద పన్నులు ఎక్కువగా ఉండడం, ప్రభుత్వం వైపు నుంచి ప్రోత్సాహం లేకపోవడంతో అవి మూతపడి ప్రత్యక్షంగా వందల మంది ఉపాధికి గండిపడింది. దూది నుంచి దారం తయారు చేసే స్పిన్నింగ్‌ మిల్లులకు విద్యుత్తు బిల్లులు పెరగడం, ముడి పదార్థాల ధరలు పెరిగిన నిష్పత్తిలో దారం ధరలు పెరగకపోవడం, ప్రభుత్వం నుంచి రాయితీలు విడుదల కాకపోవడం, అంతర్జాతీయ పరిణామాలతో నష్టాలు మూటగట్టుకుని కొన్ని మూతపడగా మరికొన్ని ఉత్పత్తి తగ్గించుకుని నడుస్తున్నాయి. ఒక్కొక్క మిల్లులో సగటున ప్రత్యక్షంగా 800 మంది పని చేస్తుండగా వారందరూ ఉపాధి కోల్పోయారు. పరోక్షంగా రవాణా, ఆతిథ్యం, మార్కెటింగ్‌, అకౌంటింగ్‌ తదితర రంగాల్లో కూడా ఉద్యోగాలు కోల్పోయారు.

నిర్మాణ రంగం కుదేలు

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాల వల్ల జిల్లాలో తీవ్రమైన ఇసుక కొరత ఏర్పడింది. నిర్మాణ రంగం అతలాకుతలం కావడంతో స్థిరాస్తి వ్యాపారం పతనమైంది. నిర్మాణ రంగానికి ఆధారంగా ఉన్న కంకర క్వారీలు, స్టోన్‌ క్రషర్లు, మిక్సర్‌ యూనిట్లు మూతపడ్డాయి.

ప్లాస్టిక్‌ పరిశ్రమల్లో 10వేల మంది రోడ్డున..

జిల్లాలో ప్లాస్టిక్‌ తయారీ పరిశ్రమలు, తెనాలిలో స్టీల్‌ పాత్రల తయారీ పరిశ్రమ, గుంటూరు పరిసరాల్లో పేపర్‌ కప్‌లు, ప్లేట్లు తయారు చేసే సుమారు 50 యూనిట్లు మూతపడ్డాయి. ప్లాస్టిక్‌ బకెట్లు, డబ్బాలు, వివిధ రకాల వస్తువులు తయారు చేసే సూక్ష్మ, చిన్నతరహా యూనిట్లు చాలా వరకు మూతపడ్డాయి. వీటి వల్ల ప్రత్యక్షంగా సుమారు 10వేల మంది ఉపాధి కోల్పోయారు.

గుంటూరు ఆటోనగర్‌లో వెల్డింగ్‌ ఫౌండ్రీ


మేడికొండూరు మండలం పేరేచర్ల పరిసర ప్రాంతాల్లో గతంలో 54 కంకర తయారీ యూనిట్లు (క్రషర్లు) పని చేశాయి. తెదేపా పాలనలో అమరావతి నిర్మాణానికి కావాల్సిన కంకర ప్రధానంగా ఇక్కడ నుంచే తరలించారు. అప్పట్లో అభివృద్ధి పనులు చురుగ్గా జరిగాయి. క్రషర్లలో పని చేసే ఎంతో మంది కూలీలకు ఉపాధి దొరికొంది. ప్రభుత్వానికి పన్ను రూపేణా ఆదాయం సమకూరేది. వైకాపా అధికారంలోకి వచ్చాక రాజధానిలో భవనాలు, రోడ్లు, వంతెనలు కట్టడం వంటి అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. దీంతో కంకర తయారీ యూనిట్లకు పని లేకుండా పోయింది. అవి నష్టాల బాట పట్టాయి. ఖర్చులు పెరగడం, ఆదాయం తగ్గడం, కంకర అమ్మకాలు లేకపోవడంతో కాలక్రమేణా చిన్న తరహా యూనిట్లు మూసేశారు. అన్ని సక్రమంగా పని చేసే సమయంలో ఒక్కో యూనిట్లో రోజుకి సగటున 100 మందికి పని ఉండేది. ప్రస్తుతం 14 క్రషర్లు మాత్రమే పని చేస్తున్నాయి. 50 ఏళ్ల కిందట మెటల్‌ క్వారీలు, క్రషర్లో కూలీ పని చేసేందుకు కర్నూలు, పల్నాడు జిల్లా నుంచి సుమారు 200 కుటుంబాలు పేరేచర్ల వలస వచ్చాయి. ప్రస్తుతం క్రషర్లో పని తక్కువగా ఉండడంతో వ్యవసాయం, సిమెంట్‌, మట్టి పనికి వెళ్తున్నారు. అందరికీ పని దొరకడం లేదు. కుటుంబ పోషణ భారంగా మారిందని కూలీలు ఆవేదన చెందుతున్నారు.  


15 రోజులు పని దొరకడమే గగనం
- వీరన్న, పేరేచర్ల గ్రామం దినసరి కూలీ

20 ఏళ్లుగా రాయి కొట్టే పనికి వెళ్తున్నా. అప్పట్లో రోజూ పని ఉండేది. కొన్నాళ్లుగా పని ఉండడం లేదు. వారానికి మూడు రోజులు మాత్రమే ఉంటుంది. గతంలో నెలకు రూ.15వేల నుంచి రూ.20వేల దాకా సంపాదన ఉండేది. ప్రస్తుతం 15 రోజులు మాత్రమే పని ఉంటోంది. వచ్చే రూ.7వేలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం.


కంపెనీ తరలించే పరిస్థితి ఏర్పడింది
- రవి, (యూపీవీసీ కిటికీలు తయారీ కంపెనీ), ఆటోనగర్‌

గుంటూరు ఆటోనగర్‌లో యూపీవీసీ కిటికీల తయారీ కంపెనీ పెట్టా. రాజధాని కావడంతో నిర్మాణ రంగం జోరుగా ఉండి ఆర్డర్లు వచ్చేవి. వ్యాపారం బాగా సాగింది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే 60 శాతం విద్యుత్తు బిల్లులు పెంచారు. ఆర్డర్లు తగ్గాయి. ప్రస్తుతం 8 మంది పని చేస్తున్నారు. వారికి నెల జీతాలు ఇవ్వడం కష్టంగా మారింది. మళ్లీ ఇదే ప్రభుత్వం వస్తే కంపెనీ హైదరాబాద్‌కి తరలించే ఆలోచనలో ఉన్నా.


రాయితీల కోసం ఎదురుచూపులు
-కొత్త సుబ్రహ్మణ్యం, కుమార్‌ పంపుల పరిశ్రమ వ్యవస్థాపకులు, తెనాలి

పరిశ్రమల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. గత అయిదేళ్లుగా రాయితీలు సరైన తీరులో అందలేదు. వాటి కోసం ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అధిక శాతం పరిశ్రమల వారు బ్యాంకుల్లో బకాయిలు పేరుకుపోయి, వాటికి వడ్డీలు కట్టుకుంటూ నానా ఇబ్బందులు పడుతున్నారు. వేసవిలో విద్యుత్తు వెతలు కూడా కొనసాగుతున్నాయి.


రూ.లక్షకు పైగా కరెంటు బిల్లు అదనపు భారం
- ఓ క్రషర్‌ యజమాని

వైకాపా ప్రభుత్వ నుంచి ఎలాంటి సాయం అందడం లేదు. విద్యుత్తులో రాయితీ ఇవ్వకపోగా 6 శాతం అపరాధ రుసుం విధించారు. ఈ కారణంతో ఒక్కో యూనిట్‌కు ప్రతి నెలా కరెంట్‌ బిల్లు రూపేణా రూ.లక్షకు పైగా అదనపు భారం పడుతోంది. దీనికి తోడు కంకర కొనుగోళ్లు మందగించాయి. ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గిపోయింది. చిన్న క్రషర్లు 40 దాకా మూసేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు