logo

పండగ చేస్తానన్నావ్‌.. ప్రాణాలు తీస్తున్నావ్‌

వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్‌ ఆచరణలో రైతులను గాలికొదిలేశారు. సాగుకు బ్యాంకుల నుంచి రుణాలు అందక.. అధిక వడ్డీలకు తెచ్చి పంట పండిస్తే గిట్టుబాటు ధర దక్కక రైతు కునారిల్లాడు..

Published : 24 Apr 2024 06:56 IST

సర్కారు నుంచి ప్రోత్సాహం కరవై.. ఉరికొయ్యల పాలై..
సాగు గిట్టుబాటు కాక.. బతుకు లేక బలవన్మరణాలు
జగన్‌ ఏలుబడిలో 215 మంది రైతుల ఆత్మహత్యలు
ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - బాపట్ల

25
రెండేళ్లలో జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతులు, కౌలు రైతులు
18
ప్రభుత్వ లెక్కల ప్రకారం నమోదైన సంఖ్య
10
ఇప్పటి వరకు ప్రభుత్వ సాయం అందినవారి సంఖ్య

వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్‌ ఆచరణలో రైతులను గాలికొదిలేశారు. సాగుకు బ్యాంకుల నుంచి రుణాలు అందక.. అధిక వడ్డీలకు తెచ్చి పంట పండిస్తే గిట్టుబాటు ధర దక్కక రైతు కునారిల్లాడు.. నకిలీ విత్తనాలు, పురుగుల మందులు, దళారుల మాయాజాలం, ప్రకృతి విపత్తులతో రైతు పీకల్లోతు కష్టాల్లో మునిగినా ప్రభుత్వం చోద్యం చూసిందే తప్ప ఆపన్న హస్తం అందించింది లేదు. పంట కాలువలతో అలరారే డెల్టా ప్రాంతంలోనూ కర్షకులు బలవన్మరణాలకు పాల్పడటం గమనార్హం. సాగు వ్యయం దక్కని పరిస్థితుల్లో అప్పులు తీర్చే మార్గం లేక కుటుంబ పోషణ చేయలేని స్థితిలో ఆత్మామాభిమానం చంపుకోలేక.. ఆత్మస్థైర్యం కోల్పోయి అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వైకాపా ఐదేళ్ల పాలనలో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధి(బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాలు)లో సర్కారు లెక్కల ప్రకారం 215 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. అనధికారికంగా వందల మంది బతుకుపై ఆశ కోల్పోయి ప్రాణాలు తీసుకున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే దేశానికి అన్నం పెట్టే రైతన్న ఉరికొయ్యల పాలయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పంటను తుడిచిపెడుతున్న తుపాన్లు

కృష్ణా పశ్చిమ డెల్టాలో ఏటా నవంబరు, డిసెంబరు నెలల్లో వస్తున్న తుపాన్లు వరి పంటకు తీవ్ర నష్టం కలుగజేస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పంటను కాపాడుకుంటే పంట కోత సమయంలో వచ్చే తుపాన్లు రైతులను నిలువునా ముంచుతున్నాయి. ఏటా ఏదో ఒక తుపాను వచ్చి రైతులు నష్టపోతూనే ఉన్నారు. ఈసారి వచ్చిన మిగ్‌జాం తుపాను వల్ల చేతికొచ్చిన పంట ఇంటికి చేరకుండానే వర్షార్పణమైంది. కొన్ని రోజుల్లో చేతుల్లోకి సొమ్ములు వస్తాయని ఆశించిన రైతులకు తుపానుకు దెబ్బతిన్న పంటను గట్టెక్కించడానికి మళ్లీ అప్పులు చేసి ఎదురు పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. పత్తి, మిర్చి, పొగాకు, శనగ పంటలు కూడా దెబ్బతిన్నాయి.

వ్యవసాయ ప్రాధాన్యం కలిగిన జిల్లాలోనే ఆత్మహత్యలు

రాష్ట్రంలో ఉమ్మడి గుంటూరు జిల్లా తొలి నుంచి అత్యంత కీలకంగా ఉంది. అలాంటి జిల్లాలోనూ పంట నష్టాల కారణంగా రైతుల ఆత్మహత్యలు ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. నిత్యం ఏదో ఒక మూల రైతుల ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఇలా చనిపోతున్నవారిలో కౌలు రైతులు ఎక్కువ మంది ఉంటున్నారు. సొంత రైతులతో పోలిస్తే కౌలు రైతులకు అన్నిచోట్లా ఇబ్బందులే.. కౌలు రైతులు చాలామందికి గుర్తింపు కార్డులు లేవు. ప్రభుత్వం నుంచి గానీ బ్యాంకుల నుంచి సహకారం ఉండటం లేదు. దీంతో ప్రైవేటుగా అప్పులు చేసి పంటలు సాగు చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు, తెగుళ్ల కారణంగా గత నాలుగేళ్లుగా పంటలు దెబ్బతిన్నాయి. కౌలు రైతులు అప్పులపాలై ఆర్థికంగా చితికిపోయారు. దీంతో ఒత్తిళ్లు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. అలా మరణించిన కౌలు రైతుల కుటుంబాల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.

కౌలు కర్షకుల కన్నీటి కష్టాలు

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 60 శాతంపైగా కౌలు రైతులే పంటలు సాగు చేస్తున్నారు. వ్యవసాయం చేద్దామనుకోవడమే వారు చేసిన సాహసం. సొంత పొలం లేక కౌలు రైతులు కావడమే వారు చేసుకున్న పాపం. అసలు రైతులు కాడి పక్కన పడేసిన తరుణంలో ఆ బరువు నెత్తికెత్తుకున్న కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కళ్లెదుటే పాడైన పంటలు, చేసిన అప్పులకు పెరుగుతున్న వడ్డీలు, ఆర్థిక సమస్యలు కౌలు రైతుల్ని మనోవేదనకు గురిచేస్తున్నాయి. పాలకుల నుంచి భరోసా దక్కక, భవిష్యత్తు కానరాక బలవంతంగా తనువు చాలిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల విషయంలో కనీస కనికరం లేని ప్రభుత్వ వైఖరితో అన్నదాతల కుటుంబాలు తీవ్ర అవస్థలు పడుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో గత ఐదేళ్లలో ఆత్మహత్య చేసుకున్న వారిలో కౌలు రైతు కుటుంబాలే అధికంగా ఉండటం దురదృష్టకరం.

కరవైన ప్రభుత్వ ప్రోత్సాహం..

రైతులు ఆధునిక సాగు పద్ధతులను అవలంభించడానికి గత ప్రభుత్వాలు రాయితీలు ఇచ్చి ప్రోత్సాహం అందించాయి. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో విధానాలు మార్చి కొందరికే పరిమితం చేశారు. వ్యక్తిగతంగా వ్యవసాయ పరికరాలకు రాయితీకి మంగళం పాడారు. అదే విధంగా రాయితీ విత్తనాల ధరలు పెంచడం, కొంత పరిమాణంలో అందుబాటులో ఉంచడం వంటి అంశాల ద్వారా రైతులకు సాయం అందకుండా పోయింది. బిందు, తుంపర్ల సేద్య పరికరాలు 90 శాతం రాయితీతో ఇచ్చేవారు. ఆయా కంపెనీలకు సకాలంలో సొమ్ము చెల్లించకపోవడంతో వారు సరఫరా ఆపేశారు. దీంతో రైతులు వంద శాతం సొమ్ము చెల్లించి బహిరంగ మార్కెట్‌లో కొనుక్కోవాల్సి వస్తోంది.


మిగ్‌జాం ఊపిరి తీసింది

వేమూరు మండలం చావలికి చెందిన కౌలు రైతు గోపాళం యానాదిరావు నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేసిన వరి మూడేళ్లు భారీ వర్షాల కారణంగా దెబ్బతిని రూ.నాలుగు లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. గత డిసెంబరులో మిగ్‌జాం తుపాను ప్రభావానికి కురిసిన భారీ వర్షాలతో చేతికి అందే దశలో ఉన్న వరి పంట నీట మునిగి దెబ్బతినడంతో నష్టపోయాడు. అప్పుల భారం పెరిగిపోవడంతో తీర్చే మార్గం కనిపించడం లేదని ఈ ఏడాది జనవరి 3న పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతునికి భార్య జయలక్ష్మి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు. ప్రభుత్వం నుంచి రూ.ఏడు లక్షల సాయం కోసం భార్య జయలక్ష్మి ఎదురుచూస్తోంది. రెవెన్యూ, వ్యవసాయ, పోలీసు అధికారులతో కూడిన కమిటీ విచారణ చేసినా రైతు ఆత్మహత్యను ఇంకా అధికారికంగా నమోదు చేయలేదు.


14 నెలలు గడిచినా సాయమేదీ?

కొరిశపాడు మండలం పమిడిపాడు పంచాయతీ పరిధిలోని కనగాలవారిపాలెంలో కౌలు రైతు  కనగాల శ్రీనివాసరావు(56) పద్నాలుగెకరాలు కౌలుకు తీసుకుని మిర్చి సాగు చేశాడు. వైరస్‌లు, పురుగుల ఉద్ధృతితో పంట దెబ్బతింది. గతంలో సాగు చేసిన శనగ పంటలోనూ నష్టాలు వచ్చాయి. మొత్తం రూ.70 లక్షల అప్పు చేశాడు. ఉన్న రెండెకరాల్లో ఓ ఎకరం విక్రయించి కొంత అప్పులు తీర్చాడు. మిగిలిన అప్పులు తీర్చే మార్గం లేక గతేడాది ఫిబ్రవరి 5న ఇంటి వద్దనే పురుగు మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో భర్త బలవన్మరణానికి పాల్పడటంతో ఆమె ఒంటరి అయ్యారు. రెవెన్యూ, వ్యవసాయ, పోలీసు అధికారులతో కూడిన కమిటీ విచారణ చేసింది. ఆత్మహత్య చేసుకుని 14 నెలలు దాటినా కౌలు రైతు కుటుంబానికి ఎలాంటి సాయం అందలేదు.


పొలంలోనే పురుగు మందు తాగి మృతి

బల్లికురవ మండలం గుంటుపల్లికి చెందిన కౌలు రైతు మాదాల శ్రీనివాసరావు మూడేళ్లుగా మిర్చి, మొక్కజొన్న, వరి సాగులో రూ.లక్షల్లో నష్టపోయాడు. మొత్తం రూ.ఏడు లక్షల అప్పు తేలింది. అప్పులు తీర్చమని ఒత్తిడి రావడంతో గత మార్చిలో పొలంలోనే పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్య భూలక్ష్మి కూలీ పనులు చేస్తూ పిల్లల్ని చదివిస్తున్నారు. కుమారుడు లీలా సురేంద్ర ఇంటర్‌, కుమార్తె వర్షిత పదో తరగతి చదువుతున్నారు. కౌలు రైతు ఆత్మహత్య చేసుకుని ఏడాది గడిచినా ప్రభుత్వం నుంచి రూపాయి కూడా సాయం అందలేదు.


గత డిసెంబరులో వచ్చిన మిగ్‌జాం తుపానుకు దెబ్బతిన్న వరి పైరును చూపుతున్న రైతు
బటన్‌ నొక్కి పరిహారం అందజేశామని ప్రభుత్వం చెప్పినా.. నేటికి రైతుల ఖాతాకు జమ కాకపోవడం గమనార్హం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని