logo

Crime: మామ బైక్‌ కొనివ్వలేదని ఆత్మహత్య

తన మామ ద్విచక్ర వాహనం కొనివ్వలేదని ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నెల రోజుల తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు.

Updated : 01 Jul 2021 06:57 IST

నెల రోజుల తర్వాత ఇంట్లో మృతదేహం గుర్తింపు

శంకర్‌పల్లి మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: తన మామ ద్విచక్ర వాహనం కొనివ్వలేదని ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నెల రోజుల తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో వెలుగు చూసింది. ఎస్సై లక్ష్మీనారాయణ వివరాల ప్రకారం.. శంకర్‌పల్లి పురపాలిక పరిధిలోని బుల్కాపురానికి చెందిన క్రాంతికుమార్‌(30) ప్లంబర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఆయనకి భార్య, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. ఆరేళ్ల క్రితం వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట మండలానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకోవడంతో.. రెండిళ్లలోనూ కుటుంబ పెద్దలు అంగీకరించలేదు. నాటి నుంచి శంకర్‌పల్లిలోని హనుమాన్‌ నగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నాడు. కొన్నేళ్ల తర్వాత భార్య తల్లిదండ్రులు వీరి దగ్గరకు రాకపోకలు సాగించడం.. ఈ క్రమంలో వారు బండి కొనిస్తామని మాటిచ్చారు. ఆ మేరకు బైక్‌ కొనివ్వాలంటూ ఏడాది కాలంగా తన మామను అతను అడుగుతున్నాడు. సరిగ్గా స్పందన లేకపోవడంతో మార్చిలో పురుగుమందు తాగాడు. కుటుంబీకులు వెంటనే చికిత్స చేయించగా కోలుకున్నాడు. మే నెలలో మళ్లీ బండి కోసం గొడవ పడి.. ఇంటి నుంచి వెళ్లిపోగా, ఆయన భార్య సైతం పుట్టింటికి చేరుకుంది. నివాసం నుంచి బయటికెళ్లిన క్రాంతికుమార్‌ బుల్కాపురంలో పాత ఇంట్లోకి వెళ్లి ఉరి వేసుకున్నాడు. ఆ ఇంటి లోపలకి ఎవరూ వెళ్లకపోవడంతో ఆ విషయం బాహ్యప్రపంచానికి తెలియకుండా పోయింది. నెల రోజుల తర్వాత బుధవారం తన అన్న పురుషోత్తం ఆ ఇంటి తలుపులు తీయగా క్రాంతికుమార్‌ మృతదేహం కనిపించింది. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని