logo

ప్రత్యక్ష బోధన.. ఆన్‌లైన్‌ విద్య

కరోనా మహమ్మారితో చదువులు ఆన్‌లైన్‌ బాట పట్టాయి. భవిష్యత్తులో పూర్తిస్థాయి తరగతి గది బోధన ప్రారంభమైనప్పటికీ.. ఆన్‌లైన్‌ విద్య సైతం కొనసాగించాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు

Published : 21 Jan 2022 02:11 IST

హెచ్‌పీ కంపెనీ అధ్యయనంలో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌

కరోనా మహమ్మారితో చదువులు ఆన్‌లైన్‌ బాట పట్టాయి. భవిష్యత్తులో పూర్తిస్థాయి తరగతి గది బోధన ప్రారంభమైనప్పటికీ.. ఆన్‌లైన్‌ విద్య సైతం కొనసాగించాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కోరుకుంటున్నారని ఓ సర్వేలో తేలింది. ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌పీ ఇండియా నిర్వహించిన అధ్యయనంలో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ కలగలిపిన బోధన ఉండాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. గురువారం సర్వే వివరాలను కంపెనీ ఎండీ కేతన్‌పటేల్‌ వర్చువల్‌గా జరిగిన విలేకరుల సమావేశంలో వివరించారు. ‘ది హెచ్‌పీ ఇండియా ఫ్యూచర్‌ ఆఫ్‌ లెర్నింగ్‌ స్టడీ-2022’ పేరిట దిల్లీ, హైదరాబాద్‌, ముంబయి, చెన్నై సహా 13 నగరాలు, పట్టణాలలోని 1597 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై సర్వే చేసినట్లు చెప్పారు.

పాఠశాలలకు వెళ్లేందుకే పిల్లల ఆసక్తి

ఆన్‌లైన్‌ బోధనతో తమ హాబీలకు సమయం చిక్కుతుందని 83 శాతం మంది విద్యార్థులు తెలిపారు. పాఠ్యాంశాలు మరింత అర్థం చేసుకునేందుకు వీలు కలిగిందని 91శాతం మంది, ఎక్కువ సమయం గుర్తుంచుకునేందుకు ఉపయుక్తంగా ఉందని 82 శాతం మంది చెప్పారు. ఇదే సమయంలో పాఠశాల జీవితాన్ని కోల్పోతున్నామని ఒప్పుకొన్నారు. 76 శాతం మంది విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు మొగ్గు చూపారు. ఆన్‌లైన్‌లో చదువుకునేందుకు చరవాణి కంటే పర్సనల్‌ కంప్యూటర్‌(పీసీ) ఉత్తమమని అభిప్రాయపడ్డారు. 88 శాతం టీచర్లు, 72 శాతం విద్యార్థులు, 89 శాతం తల్లిదండ్రులు దీనికి ఓటు వేశారు.

ఆన్‌లైన్‌ విద్య ఎంచుకోవడానికి విద్యార్థులు చెప్పిన కారణాలు శాతాల్లో..

పాఠ్యాంశాలు తిరిగి చూసుకుని చదివేందుకు ఉపయుక్తం 92

నేర్చుకోవడం సులభం 85

హాజరుకాని తరగతులు వినేందుకు వీలు 82

చదువుకునేందుకు తల్లిదండ్రులపై ఆధారపడటం తగ్గడం 80

ట్యూషన్స్‌కు వెళ్లాల్సిన అవసరం తగ్గడం 78

ఆన్‌లైన్‌ విద్యపై ఉపాధ్యాయులు చెప్పిన సమాధానాలు ఇలా..

వృత్తి- వ్యక్తిగత జీవితం సమ ప్రాధాన్యం ఇవ్వడం 92

అదనపు తరగతులు బోధించేందుకు వెళ్లాల్సిన సమయం తగ్గడం 90

వీలున్న వేళల్లో విద్యార్థుల సందేహాలు తీర్చడం 89

డిజిటల్‌ టూల్స్‌తో పాఠ్యాంశాలు సమర్థంగా బోధించేందుకు వీలు 88

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని