logo
Published : 22 May 2022 04:30 IST

కళ్లెదురుగా కనిపిస్తున్నాడన్న కసితోనే చంపేశారు

నీరజ్‌ పన్వర్‌ హత్య కేసులో నలుగురి అరెస్టు
సంజన పెదనాన్న కొడుకు అభినందన్‌ యాదవ్‌ సూత్రధారి
రోదిస్తున్న మృతుడి భార్య సంజన, ఆమె బంధువులను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే రాజాసింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: బేగంబజార్‌లో పల్లీల వ్యాపారి నీరజ్‌ పన్వర్‌(20) హత్య కేసును పోలీసులు ఛేదించారు. తమ అమ్మాయిని కులాంతర వివాహం చేసుకోవడమే కాకుండా... కళ్లెదురుగా సంతోషంగా కనిపిస్తున్నాడన్న కసితో నీరజ్‌ను అతడి భార్య సంజన బంధువులు దారుణంగా చంపారని సాక్ష్యాధారాలు సేకరించారు. విజయ్‌ యాదవ్‌తో సహా నలుగురిని శనివారం అరెస్ట్‌ చేశారు. వివరాలను పశ్చిమమండలం డీసీపీ జోయల్‌ డేవిస్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నీరజ్‌ పన్వర్‌ తాత జగదీష్‌ ప్రసాద్‌ ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. సంజన పెదనాన్న కొడుకు అభినందన్‌యాదవ్‌ సూత్రధారిగా వ్యవహరించాడని, ఆమె మేనమామ కొడుకు విజయ్‌ యాదవ్‌, మరోపెదనాన్న కొడుకు సంజయ్‌ యాదవ్‌, అతడిస్నేహితుడు రోహిత్‌యాదవ్‌తోపాటు ఓ బాలుడు హత్యోదంతంలో పాల్గొన్నారని డీసీపీ వివరించారు. అభినందన్‌ యాదవ్‌, మహేశ్‌యాదవ్‌లు పారిపోగా.. నలుగురిని అదుపులోకి తీసుకున్నామని, ఆదివారం వారిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలిస్తామని పేర్కొన్నారు.

అక్కడే ఉండాలిగా.. ఎందుకు వస్తున్నాడు?

బేగంబజార్‌లోని కోసల్‌వాడీలో నివాసముంటున్న నీరజ్‌ పన్వర్‌ గతేడాది ఏప్రిల్‌లో అక్కడే ఉంటున్న సంజనను కులాంతర వివాహం చేసుకున్నాడు. ఆమె తల్లిదండ్రులకు ఇష్టంలేకపోవడంతో వారు అఫ్జల్‌గంజ్‌ పోలీసులను ఆశ్రయించారు. ఇరువర్గాలను కౌన్సిలింగ్‌కు పిలిపించిన పోలీసులు.. ఫలక్‌నుమా పోలీస్‌ఠాణా పరిధిలోని షంషీర్‌గంజ్‌లో ఉండాలంటూ సూచించారు. అప్పటి నుంచి నీరజ్‌, సంజనలు అక్కడే ఉంటున్నారు. కొద్దిరోజుల నుంచి సంజన, నీరజ్‌లు కోసల్‌వాడీలో తమ పల్లీల దుకాణానికి వస్తున్నారు. సంజన ఇల్లు అక్కడే ఉండడంతో విజయ్‌యాదవ్‌, అభినందన్‌ యాదవ్‌లకు నచ్చలేదు.. తమకు అవమానపరిచేందుకే నీరజ్‌ రోజూ వస్తున్నాడని భావించిన వీరు.. అతడిని చంపాలని నిర్ణయించుకున్నారు.

మూడురోజుల నుంచి నీరజ్‌ వెన్నంటే...

నీరజ్‌ను హత్యచేసేందుకు పథకం సిద్ధం చేసుకున్న విజయ్‌, అభినందన్‌లు.. తమ స్నేహితులకు విషయాన్ని వివరించారు. వారు అంగీకరించడంతో జుమ్మేరాత్‌ బజార్‌లో మూడురోజుల క్రితం రెండు కత్తులు కొన్నారు. అప్పటి నుంచి నీరజ్‌ వెన్నంటే వెళ్లేవారు. నీరజ్‌ ఏయే సమయాల్లో ఇంటి నుంచి దుకాణానికి వస్తాడు. హతమార్చేందుకు ఎక్కడ అనుకూలంగా ఉంటుందనే అంశాలపై రెక్కీ నిర్వహించారు. శుక్రవారం చంపాలనుకున్న వారు.. సాయంత్రం మద్యం తాగారు. కత్తులను సిద్ధం చేసుకున్నారు. సంజయ్‌ కదలికలను గమనించి దుకాణం వద్ద ఉన్నారు. రాత్రి 7 గంటలకు పల్లీల దుకాణానికి వచ్చిన నీరజ్‌... బంధువుల ఇంట్లో వేడుక ఉందంటూ తాతను రమ్మన్నాడు. ఇద్దరూ కలిసి బేగంబజార్‌ నుంచి మచ్చిగల్లీ మీదుగా వెళ్తుండగా... విజయ్‌, అభినందన్‌, సంజయ్‌, రోహిత్‌, మహేష్‌లు రెండు ద్విచక్రవాహనాల్లో వెనకే ఉన్నారు. యాదగిరి గల్లీ వద్దకు చేరుకోగానే.. అభినందన్‌ ముందుకు వెళ్లి నీరజ్‌ను అడ్డుకున్నాడు. వెంటనే విజయ్‌, సంజయ్‌, రోహిత్‌, మహేష్‌లు ద్విచక్రవాహనాలు దిగారు. నీరజ్‌ను అభినందన్‌ కిందపడేయగా.. సంజయ్‌ రోడ్డుపై ఉన్న బండరాయితో తలపైమోదాడు. అనంతరం ఆరుగురూ కలిసి నీరజ్‌ను కత్తులతో విచక్షణా రహితంగా పొడిచి పారిపోయారు. తీవ్రగాయాలతో ఉన్న నీరజ్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి చనిపోయాడు. అనంతరం నిందితులు కర్ణాటక పారిపోయారు. వీరిని పట్టుకునేందుకు 7 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి.. నిందితులు ఉపయోగించిన సెల్‌ఫోన్లు ఆధారంగా అదుపులోకి తీసుకున్నామని డీసీపీ జోయల్‌ డేవిస్‌ తెలిపారు. నీరజ్‌, సంజనలు ఏప్రిల్‌ 13, 2014న షాహినాయత్‌గంజ్‌లోని సాయిబాబా దేవాలయంలో పెళ్లి చేసుకున్నారని, అప్పటి నుంచి రెండు కుటుంబాలకు దూరంగా ఉన్నా.. ఇటీవల నీరజ్‌ సంజన ఇంటి పరిసరాలకు రావడంతోనే నీరజ్‌ను హత్య చేశారా? ఇంకేదైనా కారణం ఉందా? అన్నకోణంలో పరిశోధిస్తున్నామని వివరించారు. కొన్ని పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో వస్తున్నట్టు ఇది పరువు హత్యకాదని, పదేపదే పరువు హత్యగా ప్రసారం చేయవద్దని డీసీపీ జోయల్‌ డేవిస్‌ స్పష్టం చేశారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని