logo

షౌకత్‌నగర్‌లో డెంగీ కలకలం

వెంకటేశ్వరకాలనీ డివిజన్‌ పరిధి బంజారాహిల్స్‌ షౌకత్‌నగర్‌లో డెంగీ వ్యాధి కలకలం రేపింది. ఈ ప్రాంతంలో నెలరోజులుగా ఒక్కొక్కటిగా వస్తున్న కేసులతో వైద్య ఆరోగ్య శాఖ, అటు మలేరియా విభాగం, జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు.

Published : 27 May 2022 02:34 IST

షౌకత్‌నగర్‌లో మందు చల్లిస్తున్న ఎంటమాలజీ సీఈ రాంబాబు

బంజారాహిల్స్‌, న్యూస్‌టుడే: వెంకటేశ్వరకాలనీ డివిజన్‌ పరిధి బంజారాహిల్స్‌ షౌకత్‌నగర్‌లో డెంగీ వ్యాధి కలకలం రేపింది. ఈ ప్రాంతంలో నెలరోజులుగా ఒక్కొక్కటిగా వస్తున్న కేసులతో వైద్య ఆరోగ్య శాఖ, అటు మలేరియా విభాగం, జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం షౌకత్‌నగర్‌ బస్తీ, మరో బస్తీలో ఇప్పటికి ఐదు డెంగీ కేసులను ఆరోగ్య సిబ్బంది గుర్తించారు. సమాచారం అందుకుని గురువారం ఆరోగ్యశాఖ, ఎంటమాలజీ అధికారులు, సిబ్బంది ఆయా ప్రాంతాల్లో విడివిడిగా సర్వేలు నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ప్రజలతో మాట్లాడారు. నిల్వ నీటిని పరీక్షించారు. ఆయా నివాసాల్లో, వీధుల్లో మందు పిచికారీ చేయించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో ఉమ్మడి సమావేశం నిర్వహించారు. వర్షాకాలం రానున్న నేపథ్యంలో తొలి దశలోనే డెంగీని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఇప్పటికే డెంగీ బారినపడిన వారిని ఐసోలేషన్‌లో ఉంచాలని, మాత్రల వాడకంపై ఎప్పటికప్పుడు సూచనలందించాలని నిర్ణయించారు. జ్వర సర్వే జరపాలని నిర్ణయించారు. నీరు నిల్వ ఉండకుండా, నివాసాలను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్థానికులకు సూచించారు. ప్రభుత్వ వైద్యుడు డా.వెంకట్‌, జిల్లా మలేరియా అధికారి నిరంజన్‌, నగర చీఫ్‌ ఎంటమాలజిస్టు రాంబాబు, ఆ విభాగం అధికారులు రజిని, రజిత, మలేరియా సిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని