logo

జనం మధ్యే భాజపా

ఇకపై ప్రతి నెలా రాజధాని కేంద్రంగా జనం సమస్యలపై భారీ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా మహానగరంపై మరింత పట్టు సాధించాలని భారతీయ జనతా పార్టీ(భాజపా) లక్ష్యంగా పెట్టుకొంది. ఇటీవల రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సమక్షంలో నిర్వహించిన

Published : 27 May 2022 02:34 IST

వచ్చే ఏడాదికి ఇదే వ్యూహం

అగ్రనేతల పర్యటనలు విజయవంతంతో కేడర్‌లో జోష్‌

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

హెచ్‌సీయూలో మోదీకి స్వాగతం పలుకుతున్న గవర్నర్‌ తమిళిసై, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, నగర సీపీ ఆనంద్‌, రంగారెడ్డి కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌

కపై ప్రతి నెలా రాజధాని కేంద్రంగా జనం సమస్యలపై భారీ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా మహానగరంపై మరింత పట్టు సాధించాలని భారతీయ జనతా పార్టీ(భాజపా) లక్ష్యంగా పెట్టుకొంది. ఇటీవల రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సమక్షంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతం కావడం.. గురువారం బేగంపేట విమానాశ్రయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్న రాజకీయ కార్యక్రమం సఫలం కావడంతో ఆ పార్టీ క్యాడర్‌లో నూతనోత్సాహం నెలకొంది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో 24 నియోజకవర్గాలున్నాయి. వీటిపై పట్టు సాధించి వచ్చే ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకునే దిశగా వ్యూహాలను రూపొందిస్తున్నట్లు భాజపా సీనియర్‌ నేతలు చెబుతున్నారు. ఇకపై ప్రజాసమస్యల పరిష్కారానికి పెద్దఎత్తున ఆందోళనలు చేయడానికి కమలం పార్టీ సిద్ధమవుతోంది. రాష్ట్రంలో భాజపా మొదటి నుంచి భాగ్యనగరం పరిధిలో బలంగా ఉంది. మిగిలిన జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉన్నా బల్దియాలోని ప్రతి నియోజకవర్గంలోనూ భాజపాకు కార్యకర్తల బలం ఉంది. గత బల్దియా ఎన్నికల్లో 150 డివిజన్లలో పోటీ చేసి 48 స్థానాలను కైవసం చేసుకుంది. ఇదే ఊపుతో రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోని 22 పురపాలక సంఘాలు, ఏడు నగరపాలక సంస్థల్లో పట్టు సాధించడానికి ప్రణాళికలు రూపొందించారు. వీటి పరిధిలో 12 నియోజవర్గాలున్నాయి. ఇందులో భాగంగానే రాజధానిలో గత కొద్దికాలంగా పెద్దఎత్తున అగ్రనేతల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర పాతబస్తీలో మొదలై హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల మీదుగా సాగింది. రెండో విడత పాదయాత్ర ముగింపు సభ రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఇటీవల నిర్వహించారు. ఈ సభకు భారీ ఎత్తున జనం హాజరుకావడంతో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పార్టీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా రెట్టించిన ఉత్సాహంతో ప్రసంగించారు.

మోదీ చిత్రంతో బాలుడు

వ్యూహాత్మకంగా మోదీ సభ

ఐఎస్‌బీ ద్విదశాబ్ది ఉత్సవాల్లో ప్రధాన మోదీ పాల్గొనే కార్యక్రమం వారం రోజుల కిందటే ఖరారైంది. ఆ సమయంలో బేగంపేట విమానాశ్రయంలో భాజపా కార్యకర్తలనుద్దేశించి ప్రధాని ప్రసంగించే కార్యక్రమం షెడ్యూలులో లేదు. రాష్ట్ర నేతలు అభ్యర్థించడంతో 5 నిమిషాలపాటు ప్రసంగిస్తారని పార్టీ నేతలు తొలుత చెప్పారు. విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన సభకు హాజరైన కార్యకర్తల ఉత్సాహం చూసి మోదీ ఏకంగా 25 నిమిషాలు ప్రసంగించారు. ప్రసంగానికి కార్యకర్తలు అడుగడుగునా నీరాజనం పట్టారు. ఇదీ విజయవంతం కావడంతో నగర శాఖలో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది.


ఎన్నికల నాటికి మరింత బలపడతాం

జి.కిషన్‌రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి

ఏళ్లుగా రాజధాని ప్రజలకు భాజపాతో ఉన్న అనుబంధాన్ని మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వచ్చే ఎన్నికల్లో ప్రధాన పార్టీలను సవాల్‌ చేసి మెజార్టీ స్థానాలను కైవశం చేసుకుంటాం. ఈసారి పాతబస్తీలోనూ పాగా వేస్తాం. పార్టీ పరంగా నిర్వహిస్తున్న నిరసనలకు, సభలకు నగర ప్రజలు స్వచ్ఛందంగా హాజరవుతున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు ఇది నిదర్శనం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని