logo

మువ్వన్నెలు మురిసిన వేళ..

200 ఏళ్ల బానిస సంకెళ్ల నుంచి యావత్‌ భారతావని స్వేచ్ఛావాయువులు పీల్చిన రోజు.. ఆంగ్లేయుల పీడ తొలగి మువ్వన్నెల జెండాలతో ప్రజలంతా సంబరాల్లో మునిగిన వేళ..500కు పైగా సంస్థానాలు రాచరిక, నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందిన తరుణాన..

Published : 09 Aug 2022 02:50 IST

నిర్బంధంలోనే నగర నేల

ఈనాడు, హైదరాబాద్‌

1947 ఆగస్టు 15న హైదరాబాద్‌ స్టేట్‌లో ఏం జరిగిందంటే..
75 ఏళ్ల క్రితం.. 1947 ఆగస్టు 15
200 ఏళ్ల బానిస సంకెళ్ల నుంచి యావత్‌ భారతావని స్వేచ్ఛావాయువులు పీల్చిన రోజు.. ఆంగ్లేయుల పీడ తొలగి మువ్వన్నెల జెండాలతో ప్రజలంతా సంబరాల్లో మునిగిన వేళ..
500కు పైగా సంస్థానాలు రాచరిక, నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందిన తరుణాన..

హైదరాబాద్‌ స్టేట్‌లో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి. నిజాం ప్రభుత్వం జాతీయ జెండాలు ఎగురవేయకుండా నిషేధాజ్ఞలు విధించింది. నిర్భంధాన్ని కొనసాగించింది. అయినా సరే ప్రజలు ప్రభుత్వ నిషేధాజ్ఞలు ఖాతరు చేయక జాతీయ జెండాలను ఎగురవేసి తమ స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. అసలు అప్పుడు ఏం జరిగిందో తెలియాలంటే ఏడున్నర దశాబ్దాలు వెనక్కి వెళ్లాల్సిందే!
ఆ రోజుల్లో హైదరాబాద్‌ స్టేట్‌ ప్రత్యేక సంస్థానం. నిజాం ఏలుబడిలో ఉండేది. 200 ఏళ్లలో అత్యధిక కాలం హైదరాబాద్‌ రాజధానిగా చేసుకుని వీరు పరిపాలించారు. దేశాన్ని ఏలుతున్న బ్రిటీష్‌ కనుసన్నల్లోనే వీరి పాలన సాగేది. దేశవ్యాప్తంగా స్వతంత్ర ఉద్యమాలు ఊపందుకోవడంతో.. హైదరాబాద్‌ స్టేట్‌లోనూ ఆ ప్రభావం కనిపించింది. కాంగ్రెస్‌ పోరాటాలను తీవ్రతరం చేసింది. హైదరాబాద్‌ రాజ్యాన్ని భారత్‌ యూనియన్‌లో విలీనం చేయాలనే నినాదంతో నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టింది. కాంగ్రెస్‌ పార్టీలోని నాటి ప్రముఖులు స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావు వంటివారు సత్యాగ్రహం చేశారు. ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు నాటి నిజాం వారిని అరెస్టు చేసి జైల్లో వేశారు. హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ 1947 ఆగస్టు 7న జాయిన్‌ ఇండియా డేని ప్రకటించింది. పోరాటాన్ని మరింత తీవ్రతరం చేసింది.
* దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటాలకు దిగివచ్చిన బ్రిటీషర్లు భారత్‌కు స్వాతంత్య్రం ప్రకటించారు. అన్ని సంస్థానాలు ఒక్కోటిగా భారత్‌లో విలీనం అవుతూ వచ్చాయి. ఇక్కడ సైతం స్వేచ్ఛా వాయువులు పీల్చవచ్చని అందరూ భావిస్తున్న సమయంలో 1947 ఆగస్టు 13న ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ప్రకటన అందర్ని నిశ్చేష్టుల్ని చేసింది. భారత్‌ యూనియన్‌లో చేరకుండా నిజాం ప్రభువు స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాడు. ఆగస్టు 15న దేశానికి విముక్తి లభించినా ఇక్కడి ప్రజలు నిజాం నిరంకుశ పాలనలో బందీలుగా ఉన్నారు. రజాకార్ల దాష్టీకాల నడుమే మగ్గారు.
* దేశంలోని అన్ని ప్రాంతాలు స్వపరిపాలనలో జీవిస్తుంటే.. ఇక్కడ నిజాం పాలనలో అడుగడుగునా ఆంక్షల మధ్య జీవించడం.. నగరం చుట్టు పక్కల ప్రాంతాల్లో నిజాం సైన్యం రజాకార్ల ఆగడాలు శ్రుతిమించడంతో విముక్తి కావాలనే ఆకాంక్ష మరింత పెరిగింది. 1947 సెప్టెంబరు నుంచే కమ్యూనిస్టుల నేతృత్వంలో సాయుధ రైతాంగ పోరాటం తీవ్రమైంది. రావినారాయణరెడ్డి లాంటివారు ఎంతో పోరాటం చేశారు. నిజాం పీడను తొలగించాలనే కసితో ఆచార్య కొండాలక్ష్మణ్‌ బాపూజీ, నారాయణరావు పవార్‌, జంగయ్య, రఘువీర్‌ తదితరులను కలుపుకొని మహారాష్ట్ర వెళ్లి బాంబులను విసిరేందుకు శిక్షణ తీసుకున్నారు. తిరిగి హైదరాబాద్‌ వచ్చాక అదను చూసి నిజాం తన కారులో బయటికి రాగానే బాంబులు విసిరారు. ఆ దాడిలో నిజాం తప్పించుకున్నాడు. ఉద్యమకారులపై అణచివేత చర్యలు చేపట్టాడు. పత్రికా స్వేచ్ఛను హరించారు. కలం వీరులను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. కాళోజీ నారాయణరావు లాంటివారు తమ సాహిత్యంతో నిజాం నిరంకుంశత్వాన్ని ప్రశ్నించారు. స్వతంత్రం వచ్చినప్పుడు నిజాం రాజుతో భారత ప్రభుత్వం యథాతథ ఒడంబడికను కుదుర్చుకున్నప్పటికీ.. ప్రజల ఆకాంక్షల మేరకు కేంద్రం జోక్యం చేసుకోక తప్పలేదు. నిజాం రాజు లొంగకపోవడంతో భారత్‌ హోంశాఖమంత్రి సర్దార్‌ వల్లభాయి పటేల్‌ 1948 సెప్టెబరు 13న పోలీసు చర్యకు ఆదేశించారు.


జైలుకెళ్లడానికి సిద్ధపడి జెండాలెగరేశారు
-జయధీర్‌ తిరుమలరావు, కవి, ఆద్యకళ సేకర్త

కృష్ణానది ఆవల ఆంధ్రలో ఆగస్టు 15న ఉత్సవాలు జరుపుకొంటుంటే.. ఇవతల ఉన్న తెలంగాణలోని 9 జిల్లాలు, మహారాష్ట్రలోని 4, కర్ణాటకలోని 3 జిల్లాల్లో నిజాం నిర్బంధంతో సంబరాల ఊసే లేదు. హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ ప్రముఖులు కొందరు జైళ్లకు వెళ్లడానికి సిద్ధమై నగరంలో జాతీయ జెండాలు ఎగురవేశారు. సరిహద్దు ప్రాంతాలైన కోదాడ, సూర్యాపేట ప్రాంతాల్లోనూ సంబరాలు చేసుకున్నారు. నిజాంకు వ్యతిరేకంగా కోదాటి నారాయణరావు లాంటివారు తుపాకులు సేకరించి క్యాంపులు పెట్టుకుని రజాకార్లకు వ్యతిరేకంగా నిలబడ్డారు. స్వాతంత్య్ర ఉద్యమానికి సంబంధించి ఇక్కడ కొన్ని పాటలు జనాలు పాడుకునేవారు. బుర్రకథలు వచ్చాయి. స్వతంత్ర ఉద్యమ ఆకాంక్ష వ్యక్తమైనా.. నిర్బంధం వల్ల ఉద్యమ ఛాయలు తక్కువగా కనిపించేవి. బయటి నుంచి వచ్చే పత్రికలను నిషేధించారు. వంద పత్రికల వరకు ఆగిపోయాయి. స్వాతంత్య్ర వార్తలు ఇక్కడివారికి తెలిసేవి కావు. రేడియో ఉన్నా నిజాం రేడియోనే.’


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని