logo

నగరంలోనూ.. అండమాన్‌ జైలు

బ్రిటిష్‌సైన్యం స్వాతంత్య్ర విప్లవకారులను అండమాన్‌లోని కాలాపానీ జైలుకు తరలించి ఎంత పాశవికంగా వ్యవహరించారో ఇప్పటికీ కథలుగా చెబుతారు. అలాంటి జైలే నగరంలోనూ ఉందని మీకు తెలుసా? తిరుమలగిరిలో ఉన్న దీన్ని 1858లో నిర్మించారు. ఇందుకు అప్పట్లో రూ.4.71లక్షలు వ్యయం చేసినట్లు రికార్డులున్నాయి. ఇక్కడి నిర్మాణాన్ని చూసే కాలాపానీని 1906లో నిర్మించినట్లు చెబుతారు.

Updated : 15 Aug 2022 04:19 IST

తిరుమలగిరి సెల్యూలార్‌ కారాగారం

బొల్లారం, న్యూస్‌టుడే

బ్రిటిష్‌సైన్యం స్వాతంత్య్ర విప్లవకారులను అండమాన్‌లోని కాలాపానీ జైలుకు తరలించి ఎంత పాశవికంగా వ్యవహరించారో ఇప్పటికీ కథలుగా చెబుతారు. అలాంటి జైలే నగరంలోనూ ఉందని మీకు తెలుసా? తిరుమలగిరిలో ఉన్న దీన్ని 1858లో నిర్మించారు. ఇందుకు అప్పట్లో రూ.4.71లక్షలు వ్యయం చేసినట్లు రికార్డులున్నాయి. ఇక్కడి నిర్మాణాన్ని చూసే కాలాపానీని 1906లో నిర్మించినట్లు చెబుతారు.

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నాటి బ్రిటీష్‌ పాలనకు అద్దం పడుతుంది. వారు ఉపయోగించిన అనేక కట్టడాలు, భవనాలు ఇక్కడ ఉన్నాయి. ఇందులో ఒకటి తిరుమలగిరి జైలు. బ్రిటీష్‌ సైన్యంలో పనిచేస్తూ తిరుగుబాటు చేసిన వారిని, క్రమశిక్షణ తప్పిన సిబ్బందిని సన్మార్గంలో పెట్టేందుకు దీన్ని ఉపయోగించారు. ప్రస్తుతం సైన్యం శిక్షణ యూనిట్‌గా ఉపయోగపడుతున్నా.. అలనాటి కర్కశత్వానికి మూగసాక్షిగా నిలుస్తోంది. ప్రత్యేక సందర్భాల్లో జైలు సందర్శనకు ద్వారాలు తీసే అధికారులు సైన్యం నిషేధాజ్ఞల నేపథ్యంలో కొన్నేళ్లుగా పూర్తిగా నిలిపివేశారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ సందర్శనకు అనుమతివ్వాలని పలువురు కోరుతున్నారు.

75 చీకటి గదులు..
20,344 గజాల్లో రెండు అంతస్తుల్లో ఉండే ఈ జైలులో ఒక కేంద్ర బిందువును ఎంచుకొని నాలుగువైపులా సమానంగా ఒకే ఆకృతిలో కట్టడాలు నిర్మించారు. అధికశాతం తెల్లరాతిని ఉపయోగించారు. పైనుంచి చూస్తే పచ్చీస్‌ ఆకారంలో కనిపిస్తోంది. ఒకో దిక్కులో 32మంది ఖైదీలను మొత్తం నాలుగు దిక్కుల్లో 128 మందిని బంధించేందుకు వీలుగా గదులున్నాయి. ఇందులో 75 చీకటి గదులున్నాయి. ప్రతి గదికి ప్రత్యేకమైన చిన్న రంధ్రం ఉంటుంది. ఇందులో నుంచి ఖైదీ బయటకు చూస్తే ఎదురుగా ఉన్నవారు కనిపిస్తారు. బయటి వ్యక్తులు రంధ్రంలో నుంచి లోనికి చూస్తే గది మొత్తం కనిపించడం ప్రత్యేకత.  

మధ్యభాగంలో బయటికి కోటగా కనిపించే భాగమే ఖైదీలను ఉరితీసే ప్రాంతం. 40 అడుగుల కంటే ఎత్తులో ఖైదీ మెడకు తాడు ఉరి వేస్తారు. ఖైదీకి ఏ కారణంచేతనైనా ఉరి తప్పినా అతడు ప్రాణాలతో బయటపడకుండా ఉండేందుకు నేలపై అతడు పడే ప్రాంతంలో ఇనుపరాడ్లతో ఏర్పాటుచేసిన చిన్న బావి ఉంటుంది. (ప్రస్తుతం మూసివేశారు). ఉరి తప్పినవారిని అత్యంత పాశవికంగా ఇక్కడ మృత్యువు ఆవహించేది.


500 మందికి ఉరి..

జైలులో మొత్తం 500 మందికి పైన ఉరివేసినట్లు చెబుతారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పలువురు ఖైదీలను ఇక్కడే బందీగా ఉంచారు. బ్రిటిష్‌ పాలన అంతరించి మన సైన్యం ఆధీనంలోకి వెళ్లాక ఆపరేషన్‌ బ్లూస్టార్‌ కాలంలో ఖైదీల్ని ఇక్కడ ఉంచారని చెబుతారు. 1994 వరకు జైలును వినియోగించారు.

తర్వాత ఆర్మీ శిక్షణ సంస్థ కొనసాగుతోంది. ఈ జైలు నుంచే పక్కనున్న మిలటరీ ఆసుపత్రికి సొరంగముంది. ప్రస్తుతం వినియోగంలో లేదు. 1997లో ఇంటాక్‌ సంస్థ నుంచి హెరిటేజ్‌ అవార్డు లభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని