logo

సీఎన్జీ వాహనం.. దొరకని ఇంధనం

సీఎన్జీ(కంప్రెస్డ్‌ నాచురల్‌ గ్యాస్‌) వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇంధనం పంపిణీ నిరంతరంగా లేకపోవడంతో గ్రేటర్‌ పరిధిలోని సీఎన్జీ బంకుల ముందు వాహనాలు క్యూ కడుతున్నాయి. డిమాండ్‌కు తగినట్లు సరఫరా లేకపోవడంతో ఈ వాహనాలు

Updated : 16 Aug 2022 06:39 IST

ఈనాడు, హైదరాబాద్‌

బంకుల వద్ద వరస కట్టిన ఆటోలు

సీఎన్జీ(కంప్రెస్డ్‌ నాచురల్‌ గ్యాస్‌) వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇంధనం పంపిణీ నిరంతరంగా లేకపోవడంతో గ్రేటర్‌ పరిధిలోని సీఎన్జీ బంకుల ముందు వాహనాలు క్యూ కడుతున్నాయి. డిమాండ్‌కు తగినట్లు సరఫరా లేకపోవడంతో ఈ వాహనాలు తీసుకోవాలంటే కొత్తవారు ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. లోడ్‌ వచ్చిన రోజే మూడు గంటల్లో ఇంధనం అయిపోవడం మరోలోడ్‌ వచ్చేందుకు రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోందని బంకుల నిర్వాహకులు చెబుతున్నారు. గ్రేటర్‌ పరిధిలో మొత్తం 50 సీఎన్జీ స్టేషన్లున్నాయి. ఒక్కో బంకులో సుమారు 2,000 కేజీల వరకు విక్రయిస్తున్నారు. వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో అందుకనుగుణంగానే డిమాండ్‌ పెరుగుతోంది. ఉదయాన్నే గ్యాస్‌ కోసం సీఎన్జీ స్టేషన్ల ముందు బారులు తీరాల్సి వస్తోందని ఇంధనం నింపుకోవడానికి కొద్దిరోజులుగా నిత్యం 3గంటలు క్యూలో ఉంటున్నామని ఆటో డ్రైవర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధి సత్తిరెడ్డి అన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజీ వస్తే నాలుగు రూపాయలు వెనకేసుకుందామని అనుకుంటే పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో పోటీ పడుతూ సీఎన్జీ కేజీ ధర రూ.97 ఉండటంతో తమకెలాంటి ఉపయోగం లేదంటూ వాహనదారులు వాపోతున్నారు.

పూర్తి సరఫరా ఎప్పుడు..?

హైదరాబాద్‌ నగరంలో పూర్తిస్థాయిలో సీఎన్జీని అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ సైతం ముందుకు సాగడం లేదు. శామీర్‌పేట్‌లో మదర్‌స్టేషన్‌ ఏర్పాటు చేసి సీఎన్జీని అందుబాటులోకి తెచ్చినప్పటికీ కొంతకాలంగా గ్యాస్‌ కొరతతో గ్రిడ్‌ నుంచి స్టేషన్లకు డిమాండ్‌కు తగ్గ సరఫరా చేయలేకపోతున్నారు. పన్నెండేళ్ల క్రితం గ్రేటర్‌లో ప్రజారవాణాకు వినియోగించే 85వేల ఆటోలు, 7,500 బస్సులు, 20వేలకు పైగా టాక్సీలకు సగటున రోజుకు 7,62,500 కిలోల (1.067ఎంఎంఎస్‌సీఎండీ) సీఎన్జీ అవసరమని భాగ్యనగర్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ (బీజేఎల్‌) అంచనా వేసింది. తొలిదశలో మేడ్చల్‌, హకీంపేట్‌, కంటోన్మెంట్‌ తదితర డిపోలకు చెందిన 350 ఆర్టీసీ బస్సులకు సీఎన్జీ పంపిణీ చేస్తామని ప్రకటించింది. కానీ కొద్ది రోజులు 164 బస్సులకు సరఫరా చేసినా ప్రస్తుతం ఆ సంఖ్య 135కి తగ్గింది. దీంతో 215 సీఎన్జీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

గ్రేటర్‌ పరిధిలోని మొత్తం సీఎన్జీ స్టేషన్లు 50

సీఎన్జీ కేజీ ధర రూ.97

నగరంలో మొత్తం సీఎన్జీ ఆటోలు 50,000

సీఎన్జీ ఇంధన కార్లు 2000

సీఎన్జీ ఇంధన బస్సులు 135

గతేడాదితో పోల్చితే తగ్గిన పంపిణీ 30 శాతం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని