logo

రాయదుర్గంలోని మెట్రో భూమి సబ్‌లీజుకు!

హైదరాబాద్‌ మెట్రోకు ప్రభుత్వం కేటాయించిన రాయదుర్గంలోని 15 ఎకరాల ఖరీదైన భూమిని ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రో రూ.1,020 కోట్లకు సబ్‌లీజ్‌కు ఇచ్చింది. 50 ఏళ్ల కాలానికి కెనడాకు చెందిన అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ బ్రూక్‌ఫీల్డ్‌ గ్రూపుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది.

Published : 29 Sep 2022 03:38 IST

రూ.1,020 కోట్లకు బ్రూక్‌ఫీల్డ్‌తో ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రో ఒప్పందం?


మెట్రోకు కేటాయించిన 15 ఎకరాల భూమి ఇదే

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మెట్రోకు ప్రభుత్వం కేటాయించిన రాయదుర్గంలోని 15 ఎకరాల ఖరీదైన భూమిని ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రో రూ.1,020 కోట్లకు సబ్‌లీజ్‌కు ఇచ్చింది. 50 ఏళ్ల కాలానికి కెనడాకు చెందిన అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ బ్రూక్‌ఫీల్డ్‌ గ్రూపుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. నిర్మాణంలో ఉన్న టవర్‌ బ్లాక్‌1తో కలుపుకొని ఈ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.

హైదరాబాద్‌లో మెట్రోని నిర్మించి, నిర్వహించి, అప్పగించు.. విధానంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టారు. ఎల్‌అండ్‌టీ సంస్థ ఈక్విటీ, బ్యాంకుల కన్సార్షియం నుంచి తీసుకున్న రుణాలతో 69 కి.మీ. పరిధిలో మెట్రోని నిర్మించింది. పెట్టుబడిని ప్రయాణికుల టికెట్ల ద్వారా 50 శాతం, మెట్రోకి కేటాయించిన భూముల్లో రవాణా ఆధారిత అభివృద్ధి(టీవోడీ) ద్వారా 45 శాతం, ప్రకటనల ద్వారా మరో 5 శాతంతో రాబట్టుకోవాలనేది ఒప్పందం. టీవోడీ కోసం ప్రభుత్వం 269 ఎకరాలను మూడు కారిడార్లలో 18 చోట్ల కేటాయించింది. వీటిలో 18.5 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో మాల్స్‌, ఐటీ కార్యాలయాలు నిర్మాణం చేపట్టి లీజు ఇవ్వడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలనేది ప్రణాళిక. వాటిని 60 ఏళ్ల వరకు లీజుకు ఇవ్వొచ్చు. ఇప్పటివరకు పంజాగుట్ట, ఎర్రమంజిల్‌, హైటెక్‌సిటీ, మూసారాంబాగ్‌లో మాల్స్‌ నిర్మించారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో మిగతా చోట్ల నిర్మించకుండానే భూములనే లీజింగ్‌కు ఇచ్చేస్తోంది.

రాయదుర్గంలో మొదలెట్టినా.. రాయదుర్గం స్టేషన్‌ సమీపంలో మెట్రోకి 15 ఎకరాల స్థలం కేటాయించారు. నిధుల సమస్యతో ఐటీ టవర్‌ బ్లాక్‌-1 మాత్రమే నిర్మాణం మొదలెట్టింది. జీ+23 అంతస్తుల్లో బ్లాక్‌-2, బ్లాక్‌-3 కట్టాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇప్పుడు ప్రణాళికలు మారిపోయాయి. 15 ఎకరాలను బ్రూక్‌ఫీల్డ్‌కు అప్పజెబుతోంది. ఈ ఒప్పందంపై ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రో వర్గాలను ‘ఈనాడు’ సంప్రదించగా.. మాట్లాడేందుకు నిరాకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని