logo

Airport Bus: ఎక్కడుందో తెలుసుకోవచ్చు.. ఆన్‌లైన్‌లో చెల్లించొచ్చు

శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే బస్సు సర్వీసులు ఆ స్థాయిలో ఉండేలా టీఎస్‌ఆర్టీసీ పలు చర్యలు తీసుకుంది. ప్రతి బస్టాపులో 24 గంటలూ సిబ్బంది అందుబాటులో ఉండడమే కాకుండా బస్సులు ఎక్కడున్నాయి..

Updated : 30 Sep 2022 07:17 IST

విమానాశ్రయ బస్సుల్లో పలు సౌకర్యాలు

ఈనాడు, హైదరాబాద్‌: శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే బస్సు సర్వీసులు ఆ స్థాయిలో ఉండేలా టీఎస్‌ఆర్టీసీ పలు చర్యలు తీసుకుంది. ప్రతి బస్టాపులో 24 గంటలూ సిబ్బంది అందుబాటులో ఉండడమే కాకుండా బస్సులు ఎక్కడున్నాయి.. ఎంత సమయంలో వస్తున్నాయి.. అనే సమాచారం చరవాణిలో ‘టీఎస్‌ఆర్టీసీ బస్సు ట్రాకింగ్‌’ యాప్‌ద్వారా తెలుసుకునే వెసులుబాటు కూడా కల్పించారు.

* మొత్తం 45 బస్సులను నగరం నలుమూలల నుంచి విమానాశ్రయానికి 24 గంటలూ.. ప్రతి అరగంటకూ అందుబాటులో ఉండేలా జాగ్రత్త పడ్డారు.

* ఐటీ కారిడార్‌లో బస్సు సౌకర్యం ఎక్కువ ఉండాలనే ఉద్దేశంతో శిల్పారామం- విమానాశ్రయం మధ్య మరో 6 మెట్రోలగ్జరీ ఏసీ బస్సులను కూడా ఇటీవల అందుబాటులోకి తెచ్చారు.

ఇవీ సౌకర్యాలు..

* ఈ సర్వీసుల్లో నగదు రహిత లావాదేవీలకు కూడా అవకాశం కల్పించారు. గూగుల్‌ పే, ఫోన్‌పే, కార్డు ద్వారా చెల్లించవచ్చు.

* ఆన్‌లైన్‌లో టిక్కెట్టు తీసుకునే అవకాశం కల్పించారు.

* తాగునీరు, వైఫై, వార్తా పేపర్లు అందుబాటులోకి తెచ్చారు.

* దివ్యాంగులు బస్సులోకి వెళ్లేందుకు వీలుగా చక్రాల కుర్చీ (వీల్‌ ఛైర్‌)సౌకర్యం కల్పించారు.

* విమానాశ్రయంలోని ప్రవేశ, నిష్క్రమణ మార్గాలకు చేరువగా బస్సులు ఆగుతాయి.

ఏయే మార్గాల్లో అంటే..

* జేబీఎస్‌ - విమానాశ్రయం: సంగీత్‌, తార్నాక, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్సు, ఎల్బీనగర్‌, పహాడీషరీఫ్‌

* జేబీఎస్‌-విమానాశ్రయం: యాత్రి నివాస్‌, వివంతా/బేగంపేట, పర్యాటక భవన్‌, కేర్‌ ఆసుపత్రి, ఆరాంఘర్‌, శంషాబాద్‌

* జేబీఎస్‌-విమానాశ్రయం: సంగీత్‌, తార్నాక, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్సు, ఎల్బీనగర్‌, బాలాపూర్‌ క్రాస్‌ రోడ్సు, పహాడీషరీఫ్‌

* సికింద్రాబాద్‌ - విమానాశ్రయం: తాజ్‌ హోటల్‌, రాణిగంజ్‌,  సచివాలయం, లక్డీకాపూల్‌, ఏసీగార్డ్స్‌, ఎన్‌ఎండీసీ, మెహిదీపట్నం ఫ్లైఓవర్‌ మొదలైన దగ్గర, ఆరాంఘర్‌, శంషాబాద్‌

* మియాపూర్‌-విమానాశ్రయం: హైదర్‌నగర్‌, ప్రగతినగర్‌, జేఎన్‌టీయూ, ఫోరం మాల్‌, మలేసియా టౌన్‌షిప్‌, శిల్పారామం, మైండ్‌ స్పేస్‌, బయోడైవర్సిటీ, టెలికాంనగర్‌, గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌

* లింగంపల్లి-విమానాశ్రయం: చందానగర్‌, మదీనాగూడ, ఆల్విన్‌ చౌరస్తా, సీఆర్‌ ఫౌండేషన్‌, కొండాపూర్‌ చౌరస్తా, బొటానికల్‌ గార్డెన్‌, ర్యాడిసన్‌ హోటల్‌, గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌

* శిల్పారామం-విమానాశ్రయం: కొత్తగూడ, బొటానికల్‌ గార్డెన్‌, ర్యాడిసన్‌ హోటల్‌, గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌.


రాయితీలు వినియోగించుకోవాలి
వెంకన్న, సికింద్రాబాద్‌ ఆర్‌ఎం

విమానాశ్రయానికి బస్సుల్లో వెళ్లేవారు.. తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీ పొందవచ్చు. దీనిని వారం రోజుల్లో వినియోగించుకోవచ్చు. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువమంది కుటుంబీకులు ప్రయాణిస్తే 20 శాతం టిక్కెట్‌ రాయితీ ఉంటుంది. అలాగే విమానాశ్రయానికి వెళ్లేవారే కాకుండా.. అవే మార్గాల్లో ప్రయాణించే వారు కూడా ఈ బస్సుల్లో వెళ్లవచ్చు. కనీస టిక్కెట్‌ రూ.50.. గరిష్ఠ టిక్కెట్‌ ధర రూ.300 ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని