logo

మురుగే కదా అని వదల్లేరిక..

మెట్రోనగరాల్లోని మురుగునీటి కాలుష్యం తగ్గించేందుకు శుద్ధి కేంద్రాల ఏర్పాటు తప్పనిసరి అంటూ కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది.

Published : 27 Nov 2022 03:17 IST

 శుద్ధి చేయాల్సిందేనంటూ కేంద్రం ఆదేశాలు

కోకాపేట ఎస్టీపీ పనులు ఇటీవల పరిశీలిస్తున్న మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: మెట్రోనగరాల్లోని మురుగునీటి కాలుష్యం తగ్గించేందుకు శుద్ధి కేంద్రాల ఏర్పాటు తప్పనిసరి అంటూ కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. లేని పక్షంలో పర్యావరణం, ప్రజారోగ్యంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందన్న భావనతో మురుగుశుద్ధి కేంద్రాల(ఎస్టీపీల) పర్యవేక్షణను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు అప్పగించింది. జాతీయ హరిత నల్‌(ఎన్‌జీటీ) ప్రమాణాలు పాటించని ప్రభుత్వాలపై కఠినంగా వ్యవహరిస్తోంది.

రెండు నెలలకోసారి వివరాలివ్వాల్సిందే..

తాజా అంచనాల ప్రకారం హైదరాబాద్‌తో సహా మెట్రో నగరాలన్నింటిలోనూ వ్యర్థజలాల శుద్ధి యాభైశాతంలోపే. అందుకే మురుగుశుద్ధి.. శుద్ధి అనంతరం నీటినాణ్యత, బయోఆక్సిజన్‌ డిమాండ్‌, బొగ్గుపులుసువాయువు, నత్రజనిలతోపాటు సీసం శాతం ఎంతుందన్న వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌ మెట్రోనగరాలున్న రాష్ట్రాలను ఆదేశించింది. ప్రతి రెండు నెలలకోమారు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు స్వయంగా హాజరై మురుగుశుద్ధి కేంద్రాల పురోగతి వివరించాలంటూ ఉత్తర్వులు జారీచేసింది.  

లండన్‌.. న్యూయార్క్‌ ఆదర్శం

లండన్‌ నగరంలో సమగ్ర మురుగునీటి వ్యవస్థ కోసం బృహత్‌ ప్రణాళికను 1860లోనే రూపొందించారు. అప్పటి నుంచి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రణాళికను మారుస్తున్నారు. ప్రస్తుతం అక్కడ 98.5శాతం మురుగునీటి వ్యవస్థ అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహిస్తున్నారు.  
* న్యూయార్క్‌లో ప్రస్తుతం రోజుకు 1.4బిలియన్‌ గ్యాలన్ల మురుగునీటిని శుద్ధి చేస్తున్నారు. ఇందుకు ప్రత్యేకంగా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ పేరుతో ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు. న్యూయార్క్‌ నగరానికి సమగ్ర మురుగునీటి వ్యవస్థ 1890లో అందుబాటులోకి వచ్చింది.  

త్వరలో 31 కేంద్రాలు..

ప్రస్తుతం నగరంలో సుమారు 500 మిలియన్‌ లీటర్లు మురుగు శుద్ధి చేస్తున్నారు. వంద శాతం  మురుగునీటి శుద్ధి లక్ష్యంగా రూ.3,900 కోట్లతో జలమండలి 31 మురుగుశుద్ధి కేంద్రాలు నిర్మిస్తోంది. వీటిని వచ్చే ఏడాది మార్చిలోపు పూర్తి చేయాలని జలమండలి అధికారులు నిర్ణయించారు. ఇవి అందుబాటులోకి వస్తే రోజుకు 1260 మిలియన్‌ లీటర్ల మురుగునీరు శుద్ధి అవుతుంది. శివారు ప్రాంతాల్లో నివసిస్తున్న పదిలక్షలమందికి మురుగుబాధ తప్పనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని