logo

భయం లేక బియ్యం పక్కదారి

పౌర సరఫరాల శాఖ పంపిణీ చేసే బియ్యం పొరుగు రాష్ట్రాలకు తరలిపోతుంటే.. అక్కడి శాఖ సరఫరా చేసే గోధుమలు నగరానికి తరలొస్తున్నాయి.

Published : 29 Nov 2022 04:37 IST

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, అమీర్‌పేట్‌, మొయినాబాద్‌: పౌర సరఫరాల శాఖ పంపిణీ చేసే బియ్యం పొరుగు రాష్ట్రాలకు తరలిపోతుంటే.. అక్కడి శాఖ సరఫరా చేసే గోధుమలు నగరానికి తరలొస్తున్నాయి. చౌకధరల దుకాణాల బియ్యం లబ్ధిదారుల నుంచి బహిరంగంగానే ఆటోల్లో కొనుగోలు చేస్తున్నా పట్టించుకొనే నాథుడు లేడు. కొందరు వాటిని కొని నగర శివార్లలోని గోదాములకు తరలించి, అక్కడి నుంచి టన్నుల కొద్దీ మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ మీదుగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఆయా రాష్ట్రాల నుంచి గోధుమలు తెప్పిస్తున్నారు. అధికారికంగా గ్రేటర్‌ పరిధిలో 600కు పైగా పీడీఎస్‌ డైవర్షన్‌ కేసులు నమోదవుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా తరలిపోతున్నవాటికి లెక్కలే లేవు. పట్టుబడినవారిపైనా నామమాత్రపు కేసులే పెడుతుండటంతో ఈ దందాకు చెక్‌ పడే అవకాశాలు కనిపించడం లేదు.

అరికట్టడంలో విఫలం.. పీడీఎస్‌ బియ్యం రీసైక్లింగ్‌ దందాపై సమాచారం అందగానే స్థావరాలపై దాడి చేస్తున్న పౌర సరఫరాల శాఖ.. లబ్ధిదారుల నుంచి సేకరిస్తున్న ముఠాలను అరికట్టడంలో మాత్రం విఫలమవుతోంది. ఇటీవల అమీర్‌పేట్‌లోని రేషన్‌ దుకాణాల్లో బియ్యం పొందిన లబ్ధిదారుల నుంచి అక్కడే బహిరంగంగా ఆటోలో కొనుగోలు చేయడం కలకలం రేపింది.

టన్నుల కొద్దీ గోధుమలు..

మొయినాబాద్‌లోని వీఎన్‌జే ఆగ్రో ఫుడ్స్‌వారు గోధుమలను పిండిగా మార్చి విక్రయిస్తారు. ఈ కంపెనీ గోదాముపై శంషాబాద్‌ పోలీసు బృందం దాడులు చేయగా ఇతర రాష్ట్రాలకు చెందిన పీడీఎస్‌ గోధుమలు 60వేల బస్తాలు నిల్వ ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ రూ.కోట్లపై మాటే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని