logo

ప్రేమను ఓడించిన అనుమానం

కులాలకు అతీతంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు... ఏడాది కాపురంలో అనుమానంతో భర్త వేధింపులు ఎక్కువయ్యాయి.

Published : 01 Dec 2022 08:06 IST

భర్త వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: కులాలకు అతీతంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు... ఏడాది కాపురంలో అనుమానంతో భర్త వేధింపులు ఎక్కువయ్యాయి.. దీంతో మనస్తాపానికి గురైన వివాహిత రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. సికింద్రాబాద్‌ జీఆర్పీ ఎస్సై మజీద్‌ కథనం ప్రకారం.. మల్కాజిగిరి వినాయకనగర్‌లో ఉండే వంగ శ్రీనాథ్‌, స్థానికంగా ఉండే భవాని(24) ఓ షాపింగ్‌ మాల్‌లో పని చేసేవారు. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమకు దారితీసింది. మూడేళ్లుగా ప్రేమించుకున్న వారు పెద్దలకు చెప్పకుండానే ఏడాది క్రితం వివాహం చేసుకున్నారు. వినాయకనగర్‌లోనే ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. కొన్నిరోజులపాటు కాపురం సజావుగానే సాగింది. భార్య ఎవరితోనైనా మాట్లాడితే శ్రీనాథ్‌ అనుమానించేవాడు. ఫోన్‌కు లాక్‌ వేసేవాడు.. ఇంతటితో ఆగకుండా వేధింపులకు పాల్పడేవాడు. భర్త ప్రవర్తనపై ఇరు కుటుంబ సభ్యులకు చెప్పగా పెద్దలు కూర్చోబెట్టి సర్దిచెప్పారు. అయినా అతడిలో మార్పు రాకపోగా వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో మనస్తాపానికి గురైన భవాని గూడ్స్‌ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం అమ్ముగూడ-మౌలాలి రైల్వేస్టేషన్ల మధ్య ఓ మహిళ మృతదేహం పట్టాలపై ఉన్నట్లుగా గుర్తించిన రైల్వే సిబ్బంది సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల ద్వారా మృతురాలిని గుర్తించిన పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు బుధవారం మృతదేహాన్ని అప్పగించారు. భర్త వేధింపుల కారణంగానే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి కనకం శంకరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త శ్రీనాథ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని