logo

యూనిట్లు 146.. దరఖాస్తులు.. 8,016

స్వశక్తితో కష్టపడి ఉన్నతంగా ఎదగాలని ఎంతోమంది యువతకు ఉంటుంది. వీరిని తగిన రీతిన ప్రోత్సహిస్తే జీవితంలో పైకొస్తారు.

Published : 25 Jan 2023 01:46 IST

మైనార్టీ రుణాలకు అధిక పోటీ
న్యూస్‌టుడే, బొంరాస్‌పేట, వికారాబాద్‌ టౌన్‌

స్వశక్తితో కష్టపడి ఉన్నతంగా ఎదగాలని ఎంతోమంది యువతకు ఉంటుంది. వీరిని తగిన రీతిన ప్రోత్సహిస్తే జీవితంలో పైకొస్తారు. ఇదే ఉద్దేశంతో ప్రభుత్వం యువతకు రాయితీ రుణాలను అందిస్తోంది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఉపాధికోసం రాయితీ రుణాలు అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. అందుకు రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా అల్ప సంఖ్యాక వర్గాల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. 2022- 23 ఆర్థిక సంవత్సరానికి రెండు కేటగిరీలుగా జిల్లాకు రూ.1.43 కోట్ల రాయితీ రుణాలు మంజూరు చేస్తుండగా వేలల్లో దరఖాస్తులు వచ్చాయి.  

అంచనాలకు మించిన స్పందన..

జిల్లాలోని 20 మండలాల్లోని మైనార్టీలకు 146 యూనిట్లు( కిరాణా, బొమ్మల దుకాణం, గృహోపకరణాల రిపేర్‌, కుట్టు మిషన్లు తదితరాలు) అందించేందుకు అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందుకు దరఖాస్తుల గడువు ముగిసింది. అంచనాలకు మించి యువత స్పందించారు. జిల్లాలో 8,016 మంది దరఖాస్తులు చేసుకోవటంతో లబ్ధిదారుల గుర్తింపు అధికారులకు పరీక్షగా మారింది.

2015-16 ఏడాదిలో చివరి సారిగా మైనార్టీ కార్పొరేషన్‌ నుంచి రుణాలు ఇవ్వగా... ఆరేళ్లుగా రుణాల ప్రస్తావనే తీసుకు రాలేదు. తాజాగా ఈ ఆర్థిక సంవత్సరం చివర్లో రాయితీ రుణాలు అందించేందుకు ప్రభుత్వం ముందుకు రావటంతో అల్ప సంఖ్యాకులు ఉత్సాహం చూపారు. కేటగిరి ఒకటి, రెండుగా విభజించి రుణాలు ఇచ్చేందుకు అవకాశాలు కల్పించారు. ఒకటో కేటగిరీలో 80 శాతం రాయితీ వర్తిస్తుండగా 36 రకాలతో 102 యూనిట్లు ఉండగా రూ.లక్ష వరకు రుణం మంజూరు చేస్తున్నారు. రెండో కేటగిరీలో 70 శాతం రాయితీగా 52 రకాలుండగా 44 యూనిట్లు కేటాయించారు. ఇందుకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల వరకు రుణాలు ఇస్తారు.

జనాభా ఆధారంగా లక్ష్యాలు

ఆయా మండలాలు, పురపాలికల పరిధిలో జనాభా ఆధారంగా తమ లక్ష్యాలకు అనుగుణంగా అర్హులను ఎంపిక చేయనున్నారు. అధికారులు లబ్ధిదారుల పేర్లను రూపొందిస్తారు. ఈ జాబితాను జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ తరపున జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పరిశీలించిన తర్వాత రుణ మంజూరుకు రాష్ట్ర కార్యాలయానికి పంపిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని