logo

కళాశాల ‘వసతి’.. అద్దె భవనమే గతి..!

జిల్లాలోని వెనుకబడిన తరగతుల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన కళాశాల వసతి గృహాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.

Published : 25 Jan 2023 01:46 IST

సమస్యలతో విద్యార్థుల ఇక్కట్లు

న్యూస్‌టుడే, వికారాబాద్‌ మున్సిపాలిటీ, పరిగి: జిల్లాలోని వెనుకబడిన తరగతుల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన కళాశాల వసతి గృహాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటిలో సరియైన సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ వసతి గృహాలు విశాలంగా ఉండటమే కాకుండా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా క్రీడా స్థలం ఉంటుంది. వసతి గృహాల్లో ఇలాంటి జాడ కనిపించడంలేదు. ఈ విద్యా సంవత్సరం చివరి దశకొచ్చింది. కనీసం వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం నాటికైనా సౌకర్యాల మెరుగుదలకు అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.  

శౌచాలయాలూ కరవే..

జిల్లాలోని 9 కళాశాల వసతి గృహాలున్నాయి. వికారాబాద్‌లో 4, కొడంగల్‌లో 1, తాండూరు, పరిగిలో రెండు చొప్పున ఉన్నాయి. వీటిలో 802 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కుటుంబాల కోసం నిర్మించిన గృహాలను కళాశాల వసతి గృహాలకు అద్దెలకు ఇచ్చారు. వికారాబాద్‌లో రెండు అంతస్తుల్లో వసతి గృహాలున్నాయి. భోజనం గది, వంట గది,  చదువుకునే గది అంటూ ప్రత్యేకంగా లేదు. విద్యార్థులు భోజనం చేసి ప్లేట్లను కడగటానికి రెండో అంతస్తు నుంచి కిందకు రావాల్సి వస్తోంది. సరిపడే విధంగా శౌచాలయాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.

పదో తరగతి విద్యార్థులకు ప్రతి నెల సౌందర్య సాధన ఛార్జీల కింద నెలకు రూ.62 చెల్లిస్తున్నారు. బాలికలకు రూ.75 ఇస్తున్నారు. కళాశాల విద్యార్థులకు మాత్రం ఎలాంటి ఛార్జీలు ఇవ్వడంలేదు. ఎస్సీ, ఎస్టీ కళాశాల వసతి గృహాల్లో నివసించే విద్యార్థులకు నెలకు రూ.500 కాస్మొటిక్‌ ఛార్జీలను చెల్లిస్తున్నారు. ఈ తరహాలోనే బీసీ విద్యార్థులకు చెల్లించాలని పలువురు కోరుతున్నారు.  

స్థలాల కోసం అన్వేషణ

వసతి గృహాల నిర్మాణం కోసం అధికారులు స్థలాల కోసం అన్వేషిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో వికారాబాద్‌, తాండూర్‌, పరిగి, కొడంగల్‌లో వసతి గృహ భవనాలకు అవసరమైన స్థలాలు కేటాయించాలని రెవెన్యూ డివిజన్‌ అధికారులకు బీసీ అధికారులు లేఖలు రాశారు. స్థలాలు ఇస్తే భవనాలు నిర్మించటానికి బీసీ సంక్షేమ శాఖ సిద్ధంగా ఉంది. ఒక్కొక్క నిర్మాణానికి రూ.కోటి నుంచి రూ.2 కోట్ల వరకు నిధులు మంజూరు చేస్తారని అధికారులు తెలిపారు.


మెరుగైన ఫలితాల సాధనకు కృషి

 - కె. ఉపేందర్‌, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి

ఈసారి వసతి గృహాల్లో ఉంటూ చదువుకునే విద్యార్థులు మెరుగైన ఫలితాల రావడానికి కృషి చేస్తున్నాం. గత జూలై నుంచే 9, 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని