logo

ఇంటినుంచే సమస్యలపై ఫిర్యాదు..

పురపాలికల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఇప్పటి వరకు కార్యాలయాలకు పరుగులు తీయాల్సి వచ్చేది.

Published : 26 Jan 2023 00:49 IST

పురపాలికల్లో పౌరసేవా కేంద్రాలు

న్యూస్‌టుడే, వికారాబాద్‌, పరిగి: పురపాలికల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఇప్పటి వరకు కార్యాలయాలకు పరుగులు తీయాల్సి వచ్చేది. సమస్యలను వినతిపత్రాల రూపంలో అందించాల్సి వచ్చేది. ఈ కష్టాలకు తెరదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఇంట్లో నుంచే ఆన్‌లైన్‌లో సమస్యలపై ఫిర్యాదు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. దీనికోసం ప్రత్యేకంగా ‘పౌర సేవా యాప్‌’ను అందుబాటులోకి తెచ్చింది. వాస్తవానికి దీనిని ఆరు నెలల క్రితమే రూపొందించినా తాజాగా ప్రజలకు చేరువ చేసేందుకు అవగాహన కల్పిస్తున్నారు.


చిత్రాల ద్వారా అధికారుల దృష్టికి వివరణ

సమస్య తీవ్రతను తెలిపే ఛాయా చిత్రాలతో అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు యాప్‌లో వెసులుబాటు కల్పించారు. ఈ యాప్‌ను పురపాలికల వారీగా రాష్ట్ర పురపాలక శాఖ రూపొందించింది. జిల్లాలో ప్రస్తుతం తాండూర్‌, వికారాబాద్‌ పురపాలికల కార్యాలయాల్లో ప్రత్యేకంగా పౌరసేవా కేంద్రాలు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తున్నారు. పరిగి, కొడంగల్‌ పురపాలికల్లో కూడా యాప్‌ ద్వారా సేవలు అందుబాటులోకి వచ్చాయి.

సత్వర పరిష్కారం..: పురపాలికల్లో నెలల తరబడి వ్యర్థాలు తొలగించకపోవడం, తాగునీటి సరఫరా నిలిచిపోవడం, వీధి దీపాల మరమ్మతులపై ఫిర్యాదు చేసిన వెంటనే చరవాణికి సంక్షిప్త సందేశం వస్తుంది. సమస్య సంబంధిత విభాగాల అధికారులకు చేరుతుంది. అధికారులు గడువులోపు పరిష్కరించాల్సి ఉంటుంది. పరిష్కారం ఎంతవరకు వచ్చిందనే సమాచారమూ ఆన్‌లైన్‌ ద్వారా తెలుసుకునే వెసులుబాటు ఉంది. సమస్యలు పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జరిమానా విధించి వారి వేతనాల్లో కోత విధించనున్నారు. పౌరసేవల యాప్‌ పనితీరు ఎప్పటికప్పుడు రాష్ట్ర పురపాలకశాఖ అధికారులు పర్యవేక్షిస్తుండటంతో సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని