logo

చిన్నారులకు వరం.. భవిత కేంద్రం

మోమిన్‌పేట మండలం మొరంగపల్లికి చెందిన హర్షిత వైకల్యంతో నడవలేని పరిస్థితి. దీంతో తల్లిదండ్రులు వికారాబాద్‌ భవిత కేంద్రంలో చేర్పించారు.

Published : 30 Jan 2023 00:54 IST

న్యూస్‌టుడే: వికారాబాద్‌ కలెక్టరేట్‌

* మోమిన్‌పేట మండలం మొరంగపల్లికి చెందిన హర్షిత వైకల్యంతో నడవలేని పరిస్థితి. దీంతో తల్లిదండ్రులు వికారాబాద్‌ భవిత కేంద్రంలో చేర్పించారు. నాలుగేళ్ల పాటు ఫిజియోథెరపీ చేయడమే కాకుండా, శిక్షకులు చదవడం, రాయడం నేర్పారు. ప్రస్తుతం ఆ చిన్నారిని వికారాబాద్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో చేర్పించారు.

* కర్ణాటక యానగుందే సమీపంలో మెతుకు గ్రామానికి చెందిన సుప్రియ వినికిడి లోపంతో బాధపడుతోంది. ఆ చిన్నారికి స్థానిక కేంద్రంలో తర్ఫీదు ఇవ్వడంతో కొంత మార్పు వచ్చింది.

భవిత కేంద్రాలు ప్రత్యేక అవసరాల చిన్నారులకు వరంలా మారాయి. వారిని మామూలుగా మార్చేందుకు సిబ్బంది కృషి చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 28 కేంద్రాలుండగా తాండూరు, పరిగి, వికారాబాద్‌లో చదువుకున్న పిల్లలు సాధారణ పాఠశాలల్లో ఎక్కువ సంఖ్యలో చేరారు. ఇలా ఇప్పటి వరకు వివిధ కేంద్రాల నుంచి సుమారు 38మంది బడుల్లో చేరి చదువుకుంటున్నారు. వీటిల్లో 5 ఏళ్ల నుంచి 14 ఏళ్లలోపు ఉన్న పిల్లలకు మానసిక, శారీరక, చెవిటి, మూగ, అంధత్వం వంటి 21 రకాల సమస్యలతో బాధ పడే వారికి సపర్యలు చేస్తున్నారు. 238 మంది ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. గతంలో వికారాబాద్‌ కేంద్రానికి 20 మంది మాత్రమే వచ్చేవారు. ప్రస్తుతం 31 మంది వస్తున్నారు.


సదుపాయాలు ఇలా

విద్యాశాఖ సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో వసతులను కల్పిస్తున్నారు. ఈ కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు తరగతులను నిర్వహిస్తారు. ఇక్కడికి వచ్చే చిన్నారులకు నెలకు రూ.350 రవాణా భత్యం చెల్లిస్తారు. మధ్యాహ్న భోజనం అందిస్తారు. దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ చేతులు, ఇతర పరికరాలు ఉచితంగా అందజేస్తారు. ప్రతి సోమవారం ఫిజియోథెరఫీ, ప్రతి బుధవారం స్పీచ్‌ థెరపీ చేయిస్తారు. వికారాబాద్‌లో శిక్షకులు ప్రియాంక, వీరమణి విద్యార్థులను తీర్చిదిద్దటంతో ప్రత్యేక కృషి చేస్తున్నారు.


పిల్లలను తీర్చిద్దిడమే లక్ష్యం: రవికుమార్‌, సెక్టోరియల్‌ అధికారి

కేంద్రాలకు వచ్చే చిన్నారులకు చక్కగా విద్యాబుద్దులు నేర్పి వారిని సాధారణ పిల్లల మాదిరిగానే తయారు చేస్తారు. తరచుగా తనిఖీ చేస్తూ, శిక్షకులకు తగిన సూచనలు, సలహాలను ఇస్తున్నాం. తగిన తర్ఫీదు నిచ్చి వారిని తీర్చిదిద్దాలన్నదే ప్రధాన ఉద్దేశం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని