Hyderabad: బాగ్‌లింగంపల్లిలో భారీ అగ్నిప్రమాదం..

బాగ్‌లింగంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శుభకార్యాలకు ఉపయోగించే డెకరేషన్‌ సామగ్రి పూర్తిగా కాలిబూడిదయ్యాయి.

Updated : 02 Feb 2023 11:55 IST

హైదరాబాద్: నగరంలోని బాగ్‌లింగంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బాగ్‌లింగంపల్లి వీఎస్టీ సమీపంలోని గోదాములో అగ్ని ప్రమాదం సంభవించి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. శుభకార్యాలకు ఉపయోగించే డెకరేషన్‌ సామగ్రి మంటల్లో కాలి బూడిదయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన గోదాము పరిసర ప్రాంతాల్లో బస్తీలు ఉండడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

వారికిదే ఫైనల్‌ వార్నింగ్‌: మంత్రి తలసాని

ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎండాకాలం దగ్గరకు వస్తోంది. అగ్నిప్రమాదాలు జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కమర్షియల్‌ వ్యాపారాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. వారి వల్ల సామాన్యులకు ఏదైనా నష్టం జరిగితే మాత్రం సహించేది లేదు. ఈ మధ్యకాలంలో ఈ తరహా ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటికి ఓ పరిష్కార మార్గాన్ని తీసుకొచ్చేందుకు ఒక కమిటీని సైతం ఏర్పాటు చేశాం. కమర్షియల్ వ్యాపారాలు చేసే వ్యాపారులకు ఇదే ఫైనల్‌ వార్నింగ్‌’’ అని తలసాని హెచ్చరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని