logo

డెడ్‌ డ్రాప్‌ విధానంలో డ్రగ్స్‌ విక్రయం

ఇప్పటివరకూ రైళ్లు, బస్సులు, బైకులు, దుస్తులు, కూరగాయల మాటున డ్రగ్స్‌ సరఫరా చేస్తుండడం చూశాం.

Published : 06 Feb 2023 03:57 IST

ఐదుగురి అరెస్టు

డ్రగ్స్‌ను చూపుతున్న డీసీపీ శ్రీనివాస్‌ఏసీపీ చంద్రశేఖర్‌, సీఐ నర్సింగ్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌- న్యూస్‌టుడే, మూసాపేట: ఇప్పటివరకూ రైళ్లు, బస్సులు, బైకులు, దుస్తులు, కూరగాయల మాటున డ్రగ్స్‌ సరఫరా చేస్తుండడం చూశాం. మాదాపూర్‌ ఎస్‌వోటీ, కూకట్‌పల్లి పోలీసులకు పట్టుబడ్డ ముఠా అదృశ్య విధానంలో డ్రగ్స్‌ చేరవేస్తోంది. ‘డెడ్‌ డ్రాప్‌’ పేరుతో కొత్త విధానానికి తెరలేపింది. డ్రగ్స్‌ సరఫరాదారు, వినియోగదారుల మధ్య ప్రత్యక్ష సంబంధాలుండవు. డ్రగ్స్‌ అవసరమైన వ్యక్తులు ఫోన్‌ సందేశం ద్వారా సరకు అడగ్గానే.. ఒక ప్రాంతం పేరు, సమయం చెబుతారు. వినియోగదారు చెప్పిన సమయానికి అక్కడికెళ్లి తీసుకోవాలి. డబ్బు ఆన్‌లైన్‌లో పంపించాలి. ఈ ముఠాలోని ఐదుగురిని మాదాపూర్‌ ఎస్‌వోటీ, కూకట్‌పల్లి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వారంతా పాతికేళ్లలోపు కుర్రాళ్లు కావడం గమనార్హం. రూ.లక్ష విలువైన ఎండీఎంఏ, నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నాడు. సైబరాబాద్‌ ఎస్‌వోటీ డీసీపీ రియాజ్‌, అదనపు డీసీపీ నారాయణ, కూకట్‌పల్లి ఏసీపీ చంద్రశేఖర్‌, ఇన్‌స్పెక్టర్‌ టి.నర్సింగ్‌రావుతో కలిసి బాలానగర్‌ డీసీపీ టి.శ్రీనివాసరావు కూకట్‌పల్లి ఠాణాలో వివరాలు వెల్లడించారు.


చిన్నవయసులోనే మత్తుకు బానిసలు

విజయవాడకు చెందిన దాసరి హరికృష్ణ అలియాస్‌ హరి(21) గచ్చిబౌలిలో ఉంటూ చెఫ్‌గా పనిచేస్తున్నాడు. మాదకద్రవ్యాలకు బానిసగా మారిన ఇతను డ్రగ్స్‌ విక్రేతగా మారాడు. ఇతనితోపాటు ఇటీవల డిగ్రీ పూర్తిచేసిన గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన నెమలికంటి పవన్‌కుమార్‌ అలియాస్‌ పవన్‌(24), కళాశాల విద్యార్థి జంగం కిరణ్‌తేజ్‌(20), అమర రఘునందన్‌ సాంబమూర్తి అలియాస్‌ రఘు(23), కాగ్నిజెంట్‌లో ప్రాసెస్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న అనంతపురం జిల్లాకు చెందిన సాయికుమార్‌(24) కలిసి ముఠాగా ఏర్పడ్డారు. రఘునందన్‌ గతంలో బెంగళూరులో ఉన్నప్పుడు నైజీరియా దేశానికి చెందిన డ్రగ్స్‌ సరఫరాదారు అలీ పరిచయం అయ్యాడు. ఇతని ద్వారా రఘు డ్రగ్స్‌ కొనుగోలు చేస్తాడు. రఘు హైదరాబాద్‌ వచ్చాక డ్రగ్స్‌ కోసం నైజీరియన్‌ను సంప్రదించగా అతడు ఓ మహిళ ఫోన్‌ నంబరు ఇచ్చాడు. ఆమె ద్వారా ఈ ముఠా డ్రగ్స్‌ కొనుగోలు చేస్తుంది. కూకట్‌పల్లి ఐడీఎల్‌ చెరువు బతుకమ్మ ఘాట్‌ వద్ద డ్రగ్స్‌ విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న మాదాపూర్‌ ఎస్‌ఓటీ, కూకట్‌పల్లి పోలీసులు ఐదుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. 18 గ్రా ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు.


ఎవరా అదృశ్య మహిళ?

డెడ్‌ డ్రాప్‌ విధానంలో డ్రగ్స్‌ కొనుగోలు చేస్తున్న ఈ ఐదుగురు నిందితులకు ఒక మహిళ తరచూ సరకు అందిస్తున్నట్లు సమాచారం. యువకులు సరకు అవసరమైనప్పుడు మహిళ ఫోన్‌కు వాట్సాప్‌ సందేశం పంపిస్తారు. ఆ వెంటనే ఆమె ఎక్కడ ఏ ప్రాంతంలో డ్రగ్స్‌ ఉంచుతుందో చెబుతుంది. ఆ ప్రాంత ఫొటో కూడా పంపిస్తుంది. ఆ సమయానికి యువకులు ఆ నిర్మానుష్య ప్రదేశానికెళ్లి డ్రగ్స్‌ తీసుకోవాలి. ప్రత్యక్ష సంబంధాల్లేకుండా సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అదృశ్య మహిళ వివరాలు పట్టుబడ్డవారి దగ్గరా లేవని పోలీసులు చెబుతున్నారు. ఆమె ఆచూకీ లభిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు