logo

చెరువుకు.. చెరువు

సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో ఎట్టకేలకు జలమండలి దిగివచ్చింది. ఏకంగా ఓ చెరువునే ఆగమేఘాల మీద తవ్విస్తోంది.

Updated : 26 Mar 2023 04:04 IST

లింగంకుంటలో ఎస్టీపీ నిర్మాణాన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు
మరోచోట తటాకం తవ్వాలని ఆదేశాలు.. రూ.10 కోట్లతో పనులు

కల్పగూర్‌లో కొనసాగుతున్న తటాకం పనులు

ఈనాడు, హైదరాబాద్‌: సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో ఎట్టకేలకు జలమండలి దిగివచ్చింది. ఏకంగా ఓ చెరువునే ఆగమేఘాల మీద తవ్విస్తోంది. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా కల్పగూర్‌ వద్ద రూ.10 కోట్లతో నూతనంగా నిర్మాణ పనులు చేపడుతున్నారు. మే, జూన్‌ నాటికి సిద్ధం చేసి ఫొటోలు..వీడియోలను న్యాయస్థానం ముందుంచనున్నారు. 

రెండింతల భూమిలో..

గ్రేటర్‌ పరిధిలోని శేరిలింగంపల్లి మండలం.. చందానగర్‌ పరిధి సర్వే నం.253లోని లింగంకుంటలో గతంలో 30 ఎంఎల్‌డీ సామర్థ్యంతో జలమండలి మురుగు శుద్ధి ప్లాంట్‌(ఎస్టీపీ) నిర్మించింది. చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లను ఆక్రమించి ఎస్టీపీ నిర్మాణం చేపట్టడం వల్ల భవిష్యత్తులో చెరువు ఉనికే ప్రమాదంలో పడనుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ)ను ఆశ్రయించారు. చాలాకాలం ఈ కేసుపై వాదోపవాదాలు నడిచాయి. చివరకు ఎన్జీటీ గతంలో కీలక తీర్పు వెలువరించింది. ఎస్టీపీ వల్ల సంబంధిత చెరువుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశాలిస్తూనే.. దాని విస్తీర్ణానికి రెండింతల భూమిలో హైదరాబాద్‌ చుట్టుపక్కల కొత్తగా తటాకాన్ని తవ్వించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఆగస్టు 18వ తేదీ తుది గడువు విధించింది. భూ సేకరణ.. నిధుల సమస్య కారణంతో జలమండలి ఎన్జీటీ తీర్పుపై సుప్రీంకోర్టు తలుపు తట్టింది. అక్కడా జలమండలికి చుక్కెదురైంది. ఎన్జీటీ తీర్పుతో ఏకీభవించిన సుప్రీంకోర్టు వెంటనే చెరువు తవ్వడానికి అవసరమయ్యే నిధులను డిపాజిట్‌ చేయాలని తీర్పు చెప్పింది. లేదంటే ఎస్టీపీని చెరువు పరిధి నుంచి తొలగించాలని తేల్చి చెప్పింది. 7 ఎకరాల భూమి కోసం అన్వేషించిన అధికారులు ఎట్టకేలకు మంజీరా జలాశయం సమీపంలోని కల్పగూర్‌ వద్ద జలమండలి భూమిలో చెరువు తవ్వనున్నట్లు సుప్రీంకోర్టుకు నివేదించారు. ఆ మేరకు పనులు చేపట్టారు.


ఎందరికో కనువిప్పు..

సుప్రీంకోర్టు తీర్పుపై పర్యావరణ వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎస్టీపీ వల్ల నష్టపోయిన లింగంకుంట చెరువు విస్తీర్ణం తొలుత 13 ఎకరాల వరకు ఉండేది. ఆక్రమణలు పోను.. ప్రస్తుతం 3.5 ఎకరాలు మిగిలింది. సుప్రీం ఆదేశాలతో 3.5 ఎకరాల చెరువు కంటే రెండింతలు అంటే దాదాపు 7 ఎకరాల్లో కొత్త చెరువును నిర్మిస్తున్నారు. సుప్రీం సూచనల నేపథ్యంలోనైనా.. చెరువుల పరిరక్షణ విషయంలో కళ్లు తెరవాలని, లేదంటే భవిష్యత్తులో ముప్పు తప్పదని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని