logo

కొనుగోలుకు సౌలభ్యం.. కర్షకులకు లాభదాయకం

గ్రామీణాభివృద్ధిలో భాగంగా ‘పల్లె మార్కెట్‌’ పేరిట ఊరూరా అంగళ్ల (సంత)ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ యోచిస్తోంది. దీనివల్ల ప్రజలకు కొనుగోళ్లకు వీలుగాను, రైతులకు లాభదాయకంగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.

Published : 27 Mar 2023 01:32 IST

పల్లెల్లో సంతల ఏర్పాటుకు ప్రభుత్వ యోచన
అమలు చేస్తే ఎంతో మేలు
న్యూస్‌టుడే, పరిగి, వికారాబాద్‌ కలెక్టరేట్‌, కుల్కచర్ల  

పరిగిలో కూరగాయల విక్రయాలు

గ్రామీణాభివృద్ధిలో భాగంగా ‘పల్లె మార్కెట్‌’ పేరిట ఊరూరా అంగళ్ల (సంత)ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ యోచిస్తోంది. దీనివల్ల ప్రజలకు కొనుగోళ్లకు వీలుగాను, రైతులకు లాభదాయకంగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, పల్లె దవాఖానాలు తదితరాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ మార్కెట్లను అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. తద్వారా పంచాయతీలకు అదనపు ఆదాయ వనరులు సమకూరనున్నాయి.

కనీసం అర ఎకరం అవసరం

గ్రామీణులకు రవాణా కష్టాలు తీర్చడంతోపాటు పాటు ఊళ్లోనే కావాల్సిన సరకులు లభించడానికి సంతల ఏర్పాటుకు ఉపాధిహామీ పథకం కింద నిధుల కేటాయింపు జరుగుతోంది. తాగునీటి, వాహనాల నిలుపుదల, శౌచాలయాలు వంటి సౌకర్యాలు ఉండేలా గ్రామాల్లో స్థలాలను ఎంపిక చేయాల్సి ఉంది. కనీసం అరెకరం స్థలం అవసరం ఉంటుంది. నిర్మాణ పనులకు జియోట్యాగింగ్‌ చేసి విడతల వారీగా నిధులు విడుదల చేస్తారు.  

గతంలోనే ఎమ్మెల్యేల కృషి  

బొంరాస్‌పేట మండలం తుంకిమెట్లలో గతంలో ఏర్పాటు చేయాలని తలపెట్టారు. కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం  నరేందర్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపినా స్థలాభావంతో ముందడుగు  పడలేదు. ఇటు కుల్కచర్లలోనూ ప్రారంభించాలని మహేష్‌రెడ్డి ప్రయత్నించినా ముందడుగు పడలేదు.  

వారాంతపు సంతలతో కొంత ఉపయోగం

అన్ని మండలాల్లోనూ దశాబ్దాలుగా వారాంతపు సంతలు కొనసాగుతున్నాయి.వీటిలో కనీస సౌకర్యాలు లేకున్నా రైతులు  పరిసర గ్రామాల నుంచి వచ్చి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఇవి కొంతమేర ఆదుకుంటున్నాయి.  

ప్రస్తుతం మండల కేంద్రాలు, ప్రధాన పంచాయతీలు

మండల కేంద్రాలతో పాటు ప్రధాన పంచాయతీల్లోనూ ప్రస్తుతం సంతలు జరుగుతున్నాయి. కేటగిరి -1 (పెద్ద పంచాయతీలు) కింద 30 దుకాణ సముదాయాల ఏర్పాటుకు రూ.15లక్షల వరకు అవసరం ఉండగా ఉపాధి నిధులు రూ.10లక్షలు పంచాయతీ వాటా రూ.5లక్షలు ఉండాలి. కేటగిరి -2 కింద (చిన్న పంచాయతీలు) 20 దుకాణాలకు రూ.12.25లక్షలు వ్యయం కాగా ఉపాధి నిధులు రూ.9లక్షలు, పంచాయతీ వాటా రూ.3.25లక్షలు ఉంది.


స్థలం చూపితే మంజూరు చేస్తాం

కృష్ణన్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి

ఉపాధి నిధుల కింద పల్లెల్లో సంతల నిర్మాణానికి మంచి అవకాశం. స్థలాలు చూపితే పరిపాలన అనుమతులు వెంటనే ఇస్తాం. పల్లె సంతల్లో అన్ని రకాల కనీస సౌకర్యాలు కల్పిస్తాం. దీంతో పేద రైతులకు, వ్యాపారులకు మేలు జరుగుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు