logo

Electricity Bill: వేసవిలో విద్యుత్తు ఆదా చేద్దామిలా!

వేసవి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. వచ్చే రెండు నెలలు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఫ్యాన్లు, ఏసీలు లేనిదే ఉండలేని పరిస్థితులతో కరెంట్‌ వినియోగం సైతం పెరగనుంది.

Updated : 28 Mar 2023 07:51 IST

ఈనాడు, హైదరాబాద్‌: వేసవి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. వచ్చే రెండు నెలలు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఫ్యాన్లు, ఏసీలు లేనిదే ఉండలేని పరిస్థితులతో కరెంట్‌ వినియోగం సైతం పెరగనుంది. తద్వారా సాధారణం కంటే విద్యుత్తు బిల్లులు రెండు మూడు రెట్లు అధికంగా వస్తుంటాయి. అధిక బిల్లులకు ప్రధానకారణాల్లో ఏసీ ఒకటి. ఏసీ వాడకంలో జాగ్రత్తలు పాటిస్తే 24 శాతం వరకు విద్యుత్తు ఆదా చేసుకోవచ్చని బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిసియన్సీ (బీఈఈ) చెబుతోంది.

* ఏసీలో ఉష్ణోగ్రత 1 డిగ్రీ పెంచితే 6 శాతం విద్యుత్తు బిల్లు ఆదా చేసుకోవచ్చు. చల్లదనం కోసం ఎక్కువ మంది 18 డిగ్రీల వద్ద పెడుతుంటారు. ఫలితంగా బిల్లు పెరుగుతుంది.

* ఏసీని ఎల్లప్పుడు 24 డిగ్రీల వద్ద ఉండేలా చూసుకోవాలి. దీంతో 24 శాతం విద్యుత్తు ఆదా అవుతోందని బీఈఈ చెబుతోంది. ఇక్కడ కంప్రెసర్‌ తక్కువ సమయం నడుస్తుంది కాబట్టి బిల్లు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

* ఇంట్లోకి నేరుగా ఎండ రాకుండా కర్టెన్లు, బాల్కనీల్లో మొక్కలతో ఏసీపై భారం తగ్గించి ఆ మేరకు బిల్లు తగ్గించుకోవచ్చు.

ఇతర ఉపకరణాల వినియోగంలోనూ..

* వాషింగ్‌ మెషిన్‌లో లోడ్‌కు తగ్గట్టుగా.. ఉతకాల్సిన బట్టలు ఉన్నప్పుడు మాత్రమే వేయాలి.

* ప్రస్తుతం అందరి ఇళ్లలో ఎల్‌ఈడీలు ఉపయోగిస్తున్నారు. నాణ్యమైన వాటినే వాడాలి. అవసరం ఉన్న గదుల్లోనే లైట్లు వేసుకోవాలి.

* వేసవి రిఫ్రిజిరేటర్‌ వినియోగం సైతం ఎక్కువే. పదే పదే ఫ్రిజ్‌ డోర్‌ తీయకుండా అవసరమైనవన్నీ ఒకేసారి తీసుకుని.. ఒకేసారి లోపల సర్దడం ద్వారా విద్యుత్తు వినియోగాన్ని తగ్గించుకోవచ్చు.

డిస్కం సూచనలిలా..

* పగటిపూట విద్యుత్తు దీపాల అవసరం లేకుండా  చూసుకోవాలి.

* అనవసరంగా ఫ్యాన్లు, లైట్లు వాడకుండా. ఏ గదిలో ఉంటే అక్కడే వాడాలి.

* వంటకు ఎలక్ట్రికల్‌ పరికరాలు కాకుండా ప్రెజర్‌ కుక్కర్లు వినియోగించాలి.

* గీజర్‌ ఆన్‌ చేయగానే ఆలస్యం చేయకుండా కుటుంబ సభ్యులంతా ఒకరి వెంట ఒకరు స్నానం చేయడం ద్వారా విద్యుత్తు వినియోగం తగ్గించుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని