logo

ఎన్నికల ప్రక్రియ రాజ్యాంగబద్ధమేనా?

ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే కేవలం అధికారులు సజావుగా పనిచేస్తే సరిపోదని, సమర్థమైన రాజకీయ నాయకులతోనే సాధ్యమని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ అన్నారు.

Published : 29 Mar 2023 02:09 IST

జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌

మాట్లాడుతున్న ముఖ్యఅతిథి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, చిత్రంలో లక్ష్మీనారాయణశర్మ, శరత్‌ పిత్తీ, జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి, అక్షయ్‌ పిత్తీ

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే కేవలం అధికారులు సజావుగా పనిచేస్తే సరిపోదని, సమర్థమైన రాజకీయ నాయకులతోనే సాధ్యమని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ అన్నారు. దేశంలో ఐదేళ్లకోసారి రాజ్యాంగ హక్కులకు లోబడి ఎన్నికలు జరుగుతున్నాయని, అయితే ఆ ప్రక్రియ ఎంత వరకు రాజ్యాంగబద్ధంగా సాగుతోందనేది ప్రశ్నార్థకమన్నారు. ప్రముఖ సామాజిక వేత్త, సోషలిస్టు పార్టీ నాయకుడు బద్రీవిశాల్‌ పన్నాలాల్‌ పిత్తీ 95వ జయంతి సందర్భంగా మంగళవారం రాత్రి తాజ్‌ డెక్కన్‌లో 17వ స్మారకోపన్యాసం జరిగింది. ముఖ్య వక్తగా హాజరైన ఆయన ‘75 ఏళ్ల భారత రాజ్యాంగం’ అంశంపై కీలకోపన్యాసం చేస్తూ.. ప్రజాస్వామ్యం పరిఢవిల్లేందుకు ఎన్నికైన నేతల నీతి, నైతిక విలువలు కీలకం అన్నారు. అయితే, దురదృష్టవశాత్తూ లోక్‌సభ స్థానానికి పోటీ చేసేందుకు రూ.50 కోట్లు ఖర్చు పెడుతున్న దుస్థితి దేశంలో నెలకొందని భారత మాజీ ఎన్నికల ప్రధాన అధికారి ఓ సందర్భంగా చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. స్వాతంత్య్రానంతరం భారత న్యాయవ్యవస్థ సామాన్యులకు ఎంత వరకు సత్వర న్యాయం అందించగలుగుతోందనేది ప్రశ్నార్థకమేనని, సుప్రీంకోర్టులో సైతం ఓ కేసు విచారణకు రావాలంటే ఏళ్ల తరబడి సమయం పట్టడం చూస్తున్నామని వివరించారు. స్వాతంత్య్రానంతరం కొన్ని కాలం చెల్లిన పద్ధతులను అనుసరించడమూ ఇందుకు ఓ కారణమని తెలిపారు. ప్రజాస్వామ్యానికి న్యాయవ్యవస్థ హృదయం లాంటిదని అభివర్ణించారు. రాజ్యాంగ విలువల పరిరక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఆకాంక్షిచారు. గౌరవ అతిథిగా హాజరైన జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి బద్రీవిశాల్‌ పన్నాలాల్‌ పిత్తీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బద్రీవిశాల్‌ పన్నాలాల్‌ పిత్తీ ట్రస్టు ప్రతినిధి లక్ష్మీనారాయణశర్మ సభాధ్యక్షత వహించగా ట్రస్టీలు శరత్‌ పిత్తీ, అక్షయ్‌ పిత్తీ పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని