logo

మహా నగరం ..దోమలతో నిత్య నరకం

రాజధానిలో దోమల సమస్య తీవ్రంగా ఉంది. వేసవి మొదలవడంతో ఓ వైపు ఉక్కపోత.. మరోవైపు దోమలు నగరవాసులను వేధిస్తున్నాయి. బస్తీలు, చెరువుల సమీపవాసులైతే నిత్యం నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు

Published : 30 Mar 2023 02:04 IST

చెరువులు, కుంటల చుట్టూ స్వైర విహారం

 సాయంత్రమైతే వణికిపోతున్న బస్తీలు, కాలనీలవాసులు
 డ్రోన్లు, ఎఫ్‌టీసీల పేరుతో జీహెచ్‌ఎంసీ కాలక్షేపం

ఈనాడు, హైదరాబాద్‌

ఎఫ్‌టీసీతో గుర్రపుడెక్క తొలగించినట్లు బల్దియా చెబుతున్న మల్కాజిగిరి బండచెరువు ఇప్పుడిలా..

రాజధానిలో దోమల సమస్య తీవ్రంగా ఉంది. వేసవి మొదలవడంతో ఓ వైపు ఉక్కపోత.. మరోవైపు దోమలు నగరవాసులను వేధిస్తున్నాయి. బస్తీలు, చెరువుల సమీపవాసులైతే నిత్యం నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. రాత్రంతా దోమలను వేటాడుతూ జాగారం చేస్తున్నామని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని నివారించాల్సిన జీహెచ్‌ఎంసీ నామమాత్రపు చర్యలకే పరిమితమవుతోంది.

పనిచేయని యంత్రాంగం

వేసవిలో డెంగీ, మలేరియా వంటి జ్వరాలకు కారణమయ్యే దోమలు తక్కువే. సంతానోత్పత్తికి జంతువులు, మనుషుల రక్తం పీల్చేవే ఎక్కువగా ఉంటాయి. ఇవి మురికి నీటిలో పుట్టి అందులోనే గుడ్లు పెట్టి మళ్లీ పిల్లలను ఉత్పత్తి చేస్తాయి. చెరువుల్లో గుర్రపు డెక్క, కాలనీల్లో మురుగునీటి నిల్వలు పెరిగిపోవడం, ఇతర కారణాలతో నగరంలో దోమలు విపరీతమయ్యాయి. వాటి కట్టడిలో జీహెచ్‌ఎంసీ అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. ఇంటింటికి తిరిగి, దోమల ఉత్పత్తికి కారణమయ్యే నీటి నిల్వలను తొలగించట్లేదు. చెరువుల్లోని గుర్రపుడెక్కనూ తొలగించట్లేదు. అందుకోసం ప్రత్యేకంగా కొనుగోలు చేసిన ఫ్లోటింగ్‌ ట్రాష్‌ కలెక్టరు(ఎఫ్‌టీసీ) యంత్రాలను సవ్యంగా వినియోగించట్లేదు.

డ్రోన్లు ఎక్కడ?

డ్రోన్లతో చెరువు విస్తీర్ణం మొత్తానికి రసాయనాలు పిచికారీ చేసి గుర్రపు డెక్క అరికడతామని జీహెచ్‌ఎంసీ రెండేళ్ల కిందట ప్రకటించింది. ఆరు డ్రోన్లను రంగంలోకి దించి ఏటా రూ.1.4కోట్లు చెల్లిస్తోంది. అవి మందు పిచికారీ చేస్తున్న ఏ ఒక్క చెరువులోనూ దోమలు కట్టడి కాలేదు. గుర్రపుడెక్క విస్తరిస్తూనే ఉంది.

రూ.10కోట్లతో కొనుగోలు చేసినా..

జోన్‌కు ఒకటి చొప్పున మొత్తం ఆరు ఫ్లోటింగ్‌ ట్రాష్‌ కలెక్టర్‌ యంత్రాలను రూ. 10కోట్ల ఖర్చుతో జీహెచ్‌ఎంసీ గతేడాది మార్చిలో కొనుగోలు చేసింది. వాటి నిర్వహణకు మాత్రం నిధులు కేటాయించట్లేదు. యంత్రాలను విక్రయించిన సంస్థకే ఆ బాధ్యతలు అప్పగించగా, ఏడాదిగా నిర్వహణ వ్యయాన్ని చెల్లించట్లేదని సదరు సంస్థ వాపోతోంది. ఇంధనం, సిబ్బంది జీతాల చెల్లింపునకు నిధుల్లేకపోవడంతో.. సదరు నిర్వహణదారు ఎఫ్‌టీసీ యంత్రాలను మొక్కుబడిగా నడిపిస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ యంత్రాలతో మొత్తం 20 చెరువులకు గుర్రపుడెక్క నుంచి విముక్తి కల్పించాలని లక్ష్యం నిర్దేశించుకోగా, ఒక్కటీ పూర్తి కాకపోవడమే అందుకు నిదర్శనం. వెరసి.. జీహెచ్‌ఎంసీ యంత్రాంగం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని