logo

ఇంటి దొంగల పని.. ఫిర్యాదుదారుల ఇబ్బంది

డయల్‌ 100కు ఫోన్‌ చేస్తే పోలీసులు వేగంగా స్పందిస్తారని.. సమాచారం ఇచ్చిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంచుతారని ప్రజల్లో నమ్మకం.

Published : 31 Mar 2023 02:44 IST

డయల్‌ 100కు సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు బయటకు

ఈనాడు- హైదరాబాద్‌: డయల్‌ 100కు ఫోన్‌ చేస్తే పోలీసులు వేగంగా స్పందిస్తారని.. సమాచారం ఇచ్చిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంచుతారని ప్రజల్లో నమ్మకం. నగరంలోని కొన్ని ఠాణాల్లో ఇంటి దొంగల నిర్వాకం మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు తెస్తోంది. కిందిస్థాయి సిబ్బందిలో కొందరు సమాచారం ఇచ్చిన వ్యక్తులు, ఫిర్యాదుదారుల వివరాల్ని అవతలి వ్యక్తులకు చేరవేయడం ఆందోళన కలిగిస్తోంది.

* జీడిమెట్ల ఠాణా పరిధి ఎస్‌ఆర్‌నాయక్‌ నగర్‌ పరిసరాల్లో కొందరు గంజాయి తీసుకుంటున్నారని డయల్‌ 100కు సమాచారం వచ్చింది. మరుసటి రోజు ఫిర్యాదు చేసిన వ్యక్తి వివరాలు బయటకు పొక్కాయి. దాంతో నిందితులు ఫిర్యాదుదారుపై దాడి చేసేందుకు యత్నించారు.
* మల్కాజ్‌గిరి డివిజన్‌లోని ఓ ఠాణా పరిధిలో మద్యం బెల్టు దుకాణంపై కొందరు డయల్‌ 100కు సమాచారం ఇచ్చారు. తర్వాత పోలీసులకు సమాచారం ఎవరిచ్చారో తెలుసుకున్న బెల్టు దుకాణం యజమాని ఫిర్యాదుదారుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

మాకెందుకొచ్చిన తంటా..

డయల్‌ 100 ఫిర్యాదుదారుల వివరాలు బహిర్గతం చేసే ఘటనలు నగర శివార్లలోని ఠాణాల్లో ఎక్కువగా జరుగుతున్నట్లు డీసీపీ స్థాయి అధికారులు అంగీకరిస్తున్నారు. ఫలితంగా కొందరు డయల్‌ 100కు సమాచారం ఇచ్చేందుకు వెనుకాడుతున్నారు. మాకెందుకొచ్చిన తంటా అనే ఉద్దేశంతో ఉంటున్నారు. దీంతో ఎస్సైలకు తమ సెక్టార్ల పరిధిలో స్థానికుల నుంచి సమాచారం ఇచ్చే వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకోవడం తలనొప్పిగా మారుతోందని డీసీపీ స్థాయి అధికారులు చెబుతున్నారు. నిఘా అధికారులు ఉన్నా స్థానికులతో సంబంధాలు లేకపోవడం సమస్య. కొన్ని నేరాలకు సంబంధించి నిందితులు, అంతర్రాష్ట్ర ముఠాలు బస్తీలు, కాలనీల్లో తలదాచుకుంటున్నా తెలుసుకోలేని పరిస్థితి. దీనికి తోడు డయల్‌ 100 ఫిర్యాదుదారుల సమాచారం లీకవుతోందనే ఆరోపణలతో పరిస్థితి ఇబ్బందికరంగా మారుతోందని అధికారులు అంగీకరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని