logo

IPL 2023: తొలి యుద్ధం.. బలగం సిద్ధం

ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లకు కట్టుదిట్టమైన భద్రత కల్పించినట్లు రాచకొండ సీపీ డీఎస్‌ చౌహాన్‌ పేర్కొన్నారు.

Updated : 02 Apr 2023 11:24 IST

ఐపీఎల్‌ మ్యాచ్‌లకు  పకడ్బందీ  భద్రత
సీసీ కెమెరాలతో నిరంతర నిఘా

ఉప్పల్‌, న్యూస్‌టుడే: ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లకు కట్టుదిట్టమైన భద్రత కల్పించినట్లు రాచకొండ సీపీ డీఎస్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. ప్రేక్షకులకు, సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ల విక్రయం ఆన్‌లైన్‌లో జరుగుతుందని.. ఎవరైనా బ్లాక్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. స్టేడియంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాయింట్‌ సీపీ సత్యనారాయణ, మల్కాజిగిరి డీసీపీ జానకి, ట్రాఫిక్‌ డీసీపీ అభిషేక్‌ మహంతితో కలిసి ఆయన మాట్లాడారు. ప్రేక్షకులకు అత్యవసర సమయంలో తక్షణ వైద్య సేవల కోసం 7 అంబులెన్సులను అందుబాటులో ఉంచామన్నారు. స్టేడియం ఆవరణలో 4 ఫైర్‌ ఇంజిన్లు సిద్ధంగా ఉంటాయని వివరించారు.

1500 మందితో..

మ్యాచ్‌ల సందర్భంగా 1500 మంది పోలీసులను భద్రత విధులకు కేటాయించాం. క్రీడాకారులు, ప్రేక్షకుల కోసం స్టేడియం లోపల, బయట వీరు విధులు నిర్వర్తిస్తారు. గేటు నం.1 నుంచి కేవలం క్రీడాకారులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ప్రేక్షకులకు సూచించిన గేట్ల నుంచి మాత్రమే ప్రవేశం ఉండేలా ఏర్పాట్లు చేశాం. స్టేడియం లోపల, బయట, తనిఖీ ప్రదేశాలు, గేట్ల వద్ద, వాహనాల పార్కింగ్‌ ప్రదేశాలలోనూ మొత్తం 340 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశాం. తక్షణ చర్యలు తీసుకునేందుకు, అన్ని సీసీటీవీల ఫుటేజీలను పరిశీలించేందుకు ప్రత్యేకంగా జాయింట్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశాం.  

సీసీ కెమెరాల ద్వారా స్టేడియం చుట్టుపక్కల పరిస్థితి పర్యవేక్షణ

షీ టీంలు..

మహిళలపై ఎలాంటి వేధింపులకు ఆస్కారం లేకుండా ప్రత్యేకంగా షీటీంలను నియమించాం. స్టేడియం పరిసర ప్రాంతాల్లో మఫ్టీలో పోలీసు బృందాలు ఏర్పాటు చేశాం.

అనుమతించని వస్తువులు..

భద్రత కారణాల దృష్ట్యా స్టేడియంలోకి కొన్ని రకాల వస్తువులకు అనుమతి ఉండదు. ముఖ్యంగా ల్యాప్‌టాప్‌లు, బ్యానర్లు, వాటర్‌ బాటిళ్లు, కెమెరాలు, సిగరెట్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, అగ్గిపెట్టెలు, లైటర్లు, పదునైన వస్తువులు, రాత పెన్నులు, బ్యాటరీలు, హెల్మెట్లు, బ్యాగులు, బయటి తినుబండారాలు, పర్ఫ్యూమ్‌లు.

స్టేడియం లోపల పోలీసుల బందోబస్తు

అనుమతి ఇలా..

స్టేడియంలోకి ప్రేక్షకులను డే మ్యాచ్‌లకు .. మ్యాచ్‌ ప్రారంభానికి 3గంటల ముందు నుంచి, రాత్రి మ్యాచ్‌లకు సాయంత్రం 4.30గంటల నుంచి అనుమతిస్తాం. సూచించిన ప్రదేశాలలో మాత్రమే వాహనాలను పార్కింగ్‌ చేయాలి.

మెట్రో సేవల సమయం పెంపు..

క్రికెట్‌ మ్యాచ్‌ను దృష్టిలో పెట్టుకుని మెట్రోరైళ్లను రాత్రి 1 గంట వరకు నడపనున్నారు. 3.30 గంటలకు మొదలయ్యే మ్యాచ్‌ను చూసేందుకు మధ్యాహ్నం నుంచే ప్రేక్షకులు స్టేడియం చేరుకునే అవకాశం ఉంది. మధ్యాహ్నం 12.30 నుంచే ఫ్రీక్వెన్సీని పెంచనున్నట్లు మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.

60 ప్రత్యేక బస్సులు

ఈ నెల 2, 9, 18 తేదీలతో పాటు.. మే నెల 4, 13, 18 తేదీల్లో ఉప్పల్‌లో మ్యాచ్‌లు తిలకించేందుకు వచ్చే వారికి నగరంలోని అన్ని డిపోల నుంచి 60 బస్సులను నడుపుతున్నట్లు గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ జోన్‌ ఓ ప్రకటనలో తెలిపింది. మధ్యాహ్నం 1.30 నుంచి రాత్రి 8.30 వరకూ ఈ బస్సులు క్రికెట్‌ వీక్షకులకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని