logo

సీఈఐఆర్‌తో ఆచూకీ

ఫోన్‌ పోయిదంటే ఎవరికైనా బేజారే. పోలీసులకు ఫిర్యాదు చేసినా.. అంతా వెతికినా.. తెలిసినచోట్ల గాలిస్తూ ఎన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని కనిపెట్టడం దాదాపు అసాధ్యమయ్యేది.

Published : 26 May 2023 03:22 IST

ఇకపై ఫోన్‌ పోతే రాబట్టుకోవచ్చు
రికవరీలో రాష్ట్రంలో సైబరాబాద్‌ ప్రథమం

ఫోన్లను అప్పగిస్తున్న ఎల్బీనగర్‌ డీసీపీ సాయిశ్రీ, మాదాపూర్‌ డీఐ

ఈనాడు, హైదరాబాద్‌: ఫోన్‌ పోయిదంటే ఎవరికైనా బేజారే. పోలీసులకు ఫిర్యాదు చేసినా.. అంతా వెతికినా.. తెలిసినచోట్ల గాలిస్తూ ఎన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని కనిపెట్టడం దాదాపు అసాధ్యమయ్యేది. సీఈఐఆర్‌ (సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌) వెబ్‌సైట్‌ రాకతో పరిస్థితి మారిపోయింది. పోగొట్టుకున్న ఫోన్ల ఆచూకీ ఇట్టే తెలిసిపోతోంది. రోజుల వ్యవధిలో యజమానుల చేతుల్లోకి తిరిగొస్తున్నాయి. ఈ ప్రక్రియలో సైబరాబాద్‌ కమిషనరేట్‌ రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది. 30 రోజుల్లో 149 ఫోన్లు రికవరీ చేశారు. ఒక్క మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోనే 343 ఫిర్యాదులు రాగా 119 ఫోన్లు రాబట్టారు. సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో 7 ఫోన్లను డీసీపీ సాయిశ్రీ యజమానులకు అప్పగించారు. హుమాయున్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో తాజాగా 50 ఫోన్లు రికవరీ యజమానులకు అప్పగించారు.

ఒకప్పుడు అంతా సంక్లిష్టం

మొబైల్‌ ఫోన్లలో వ్యక్తిగత సమాచారం ఉంటుంది. బ్యాంకు లావాదేవీలు నిర్వహిస్తుంటాం. ఇది పోయిందంటే ఇంతేసంగతులు. పోలీసులకు ఫిర్యాదు చేసినా రికవరీ చేయడమూ కష్టంగా ఉండేది. ముందుగా ఐఎంఈఐ నెంబరు ఆధారంగా కాల్‌డేటా రికార్డు తీయడం.. ఆ తర్వాత ఫోన్‌ నెంబర్ల ఆధారంగా సిమ్‌కార్డులు వినియోగించే వ్యక్తుల చిరునామా కోసం నెట్‌వర్క్‌ ప్రొవైడర్లకు లేఖలు పంపడం.. కొన్నిసార్లు నెట్‌వర్క్‌ ప్రొవైడర్లు ఆలస్యంగా స్పందించడం.. ఇలా రికవరీ ప్రక్రియ సంక్లిష్టంగా ఉండేది. ఫోన్లు పోగొట్టుకున్నవారు ఆశలు వదులుకునేవారు. 100 ఫిర్యాదులందితే 20 శాతంలోపు మాత్రమే రికవరీ అయ్యేవి. ఇప్పుడు సీఈఐఆర్‌ రాకతో రికవరీ శాతం 80 శాతానికి పెరిగింది.

ఇప్పుడు ఎంతో సునాయాసం

ఫోన్‌ పొగొట్టుకున్నా/చోరీకి గురైనా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. ఐఎంఈఐ నెంబరు ఆధారంగా సీఈఐఆర్‌ వెబ్‌సైట్లో ఫిర్యాదు చేయాలి. ఫోన్‌ తయారీ సంస్థ పేరు, మోడల్‌, బిల్లులు, ఏరోజు ఎక్కడ పోయిందో అప్‌లోడ్‌ చేయాలి. ఫిర్యాదు వివరాలు నమోదు చేయాలి. వ్యక్తిగత వివరాలు, ప్రస్తుతం వినియోగించే కొత్త నెంబరు నమోదు చేయాలి. తొలుత ఫోన్‌ బ్లాక్‌ అవుతుంది. కొట్టేసిన వ్యక్తి సిమ్‌కార్డు వేయగానే పోలీసులకు తెలిసిపోతుంది. ఆ వివరాల ఆధారంగా ప్రాంతం, ఇతర ఆధారాలతో ఫోన్‌ స్వాధీనం చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని