logo

మూసీ.. దోమలతో పేచీ

నగరమంతా ఓ తీరు.. మూసీ నది పక్కన మరో తీరు. నదిలో నీటి నిల్వలు పెరిగిపోయి, గుర్రపుడెక్క నిండిపోతుండటంతో సమీప ప్రాంతాల ప్రజలు నిత్యం దోమలతో సావాసం చేస్తున్నారు.

Published : 05 Jun 2023 02:08 IST

పరీవాహక ప్రాంతాల్లో 60 వేల మందికి నిద్ర కరవు

ఈనాడు, హైదరాబాద్‌: నగరమంతా ఓ తీరు.. మూసీ నది పక్కన మరో తీరు. నదిలో నీటి నిల్వలు పెరిగిపోయి, గుర్రపుడెక్క నిండిపోతుండటంతో సమీప ప్రాంతాల ప్రజలు నిత్యం దోమలతో సావాసం చేస్తున్నారు. దోమకాటుతో ఆనారోగ్యాలకు గురవుతున్నారు. ప్రధానంగా 22 ప్రాంతాలు, ఓ ఆస్పత్రి, రెండు కాలేజీలు తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటున్నాయి. అరవై వేల మంది రోజూ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. మూసీ నది పొడవునా ఉన్న దోమల సమస్యపై జీహెచ్‌ఎంసీ తాజాగా విడుదల చేసిన నివేదికతో ఆ విషయాలు స్పష్టమవుతున్నాయి.

అటకెక్కిన నివారణ చర్యలు.. మూసీ నది జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలోని చార్మినార్‌, ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌, ఎల్బీనగర్‌ జోన్ల పరిధిలో 19.7 కి.మీ. పొడవునా ప్రవహిస్తోంది. జీహెచ్‌ఎంసీ తెలిపిన వివరాల ప్రకారం.. నది పొడవునా రోజూ దోమల నియంత్రణ చర్యలు నడుస్తున్నాయి. నలుగురు అసిస్టెంట్‌ ఎంటమాలజిస్టులు, ఐదుగురు ఫీల్డ్‌ అసిస్టెంట్లు, 57 మంది కింది స్థాయి సిబ్బంది 15 బృందాలుగా యాంటీ లార్వా ఆపరేషన్లు, అడల్ట్‌ మస్కిటో మెజూర్స్‌, బయోలాజికల్‌ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. నదిలోని నీటి నిల్వల్లో దోమలు భారీగా వృద్ధి చెందుతున్నాయి. గుర్రపుడెక్కను తొలగించి, నీటిపై మస్కిటో లార్విసైడ్‌ ఆయిల్‌ను పిచికారీ చేస్తే.. లోపలున్న దోమల గుడ్డు నిర్వీర్యం అవుతుందని, ఆ దిశగా రోజూ పని చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే.. 2021 నుంచి గుర్రపుడెక్క తొలగింపు పనిని మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి సంస్థ(ఎంఆర్‌డీసీఎల్‌) చూస్తోంది. ఇటీవల.. ఎంఆర్‌డీసీఎల్‌ నిధుల సమస్యలో కూరుకుపోయింది. మూసీ నది సంరక్షణ చర్యలన్నింటినీ అటకెక్కించింది. అప్పట్నుంచి గుర్రపు డెక్క మళ్లీ విస్తరిస్తోంది. దాని వల్ల దోమలు పెరిగాయి.

ఫాగింగ్‌తో ప్రయోజనం లేదు..

నదికి ఇరువైపులా ఉన్న ప్రాంతాల్లో రోజూ నాలుగు పెద్ద యంత్రాలు, 12 చిన్న యంత్రాలతో ఫాగింగ్‌ చేపడుతున్నట్లు బల్దియా చెబుతోంది. హైకోర్టు, సాలార్‌ జంగ్‌ మ్యూజియం, ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిలో దోమల నియంత్రణకు ఫాగింగ్‌ చేపడుతున్నప్పటికీ.. పొగ వల్ల దోమలు ఏమాత్రం తగ్గడం లేదు. దాంతో.. నదిలోని గుర్రపుడెక్కను అంతం చేసేందుకు డ్రోన్లతో రసాయనాలను పిచికారీ చేసే కార్యక్రమం చేపడుతున్నామని అధికారులు చెబుతున్నారు.

ఇవే సమస్యాత్మక ప్రాంతాలు..

నదికి ఇరువైపులా ఉన్న జుమ్మెరాత్‌బజార్‌, చుడీబజార్‌, శంకర్‌బజార్‌, జాలి హనుమాన్‌, జిమిచౌరియా, అంబేడ్కర్‌నగర్‌, దూల్‌పేట, ఒంట్‌వాడీ, చకన్‌వాడీ, బేగంబజార్‌, గాంధీగల్లీ, ఉస్మాన్‌ షాహి, బేగంవాడీ, మొగరంబస్తీ, గౌలిగూడ, ఫీల్‌ఖానా, అబుస్తర్బ్‌ తాయా, ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రి, ఇసామియా బజార్‌, మోతినగర్‌, ఉస్మానియా మెడికల్‌ కాలేజీ, కోఠి మహిళా కళాశాల ప్రాంతాల్లోని 10,106 కుటుంబాలు, 60 వేల మంది ప్రజలు తీవ్రమైన దోమ కాటు సమస్యను ఎదుర్కొంటున్నట్లు అంచనా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని