logo

రూ.లక్షలు వెచ్చించి.. మూలకు చేర్చి!

మున్సిపాలిటీల్లో రోడ్లు శుభ్రం చేసేందుకు అధికారులు రూ.లక్షలు పోసి యంత్రాలను కొనుగోలు చేస్తున్నారు. కానీ వాటిని రకరకాల కారణాలు చెబుతూ మూలకు చేరుస్తున్నారు.

Published : 28 Mar 2024 03:06 IST

తాండూరులో నిరుపయోగంగా రోడ్లు ఊడ్చే యంత్రం

న్యూస్‌టుడే, తాండూరు, పరిగి: మున్సిపాలిటీల్లో రోడ్లు శుభ్రం చేసేందుకు అధికారులు రూ.లక్షలు పోసి యంత్రాలను కొనుగోలు చేస్తున్నారు. కానీ వాటిని రకరకాల కారణాలు చెబుతూ మూలకు చేరుస్తున్నారు. దీంతో ప్రజా ధనం వృథా అవుతోందని పలువురు వాపోతున్నారు. ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి.. తాండూరు, పరిగి, మున్సిపాలిటీల్లోని రోడ్లు ఊడ్చే యంత్రాలు

గుంతల రోడ్లపై కుదరదన్నారు

తాండూరు మున్సిపాలిటీలో రోడ్లు ఊడ్చే యంత్రాన్ని (స్మార్ట్‌ రోడ్‌ స్వీపింగ్‌ మిషన్‌) మూడేళ్ల కిందట రూ.అరకోటికి పైగా వ్యయం చేసి మున్సిపాలిటీ కొనుగోలు చేసింది. అయితే తాండూరు పట్టణంలోని ప్రధాన రోడ్లు మినహా మిగిలిన అంతర్గత రోడ్లు గుంతల మయంగా ఉన్నాయి. చాలా చోట్ల తారు, సిమెంటు కంకర తేలి పోయాయి. కొన్ని ఎగుడు దిగుడుగా ఉన్నాయి. ఇలాంటి రోడ్లను యంత్రం శుభ్రం చేయాలంటే కుదరదని,  ప్రధాన రహదారులను శుభ్రం చేయాలంటే డీజిల్‌ వినియోగం ఎక్కువ కావాలని అధికారులు పేర్కొన్నారు. అంతేకాదు ఈ యంత్రాన్ని నడిపేందుకు శిక్షణ పొందిన డ్రైవర్‌ లేడు. ప్రారంభంలో ప్రధాన రోడ్లను యంత్రంతో శుభ్రం చేసే కార్యక్రమం చేపట్టినా ఫలితం మాత్రం పెద్దగా కనిపించ లేదు. దీంతో అధికారులే దాన్ని పాత మున్సిపల్‌ కార్యాలయం వెనుకాల ఓ మూలకు చేర్చారు. వానకు తడుస్తూ, ఎండకు ఎండుతూ ఆ యంత్రం నిరుపయోగంగా మారింది. 

మొదట్లో బాగు.. తరువాత జాగు

పరిగి మున్సిపాలిటీలో చెత్త తరలించే వాహనాన్ని మూడేళ్ల క్రితం కొనుగోలు చేశారు. మొదట్లో పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు వాడుకున్నారు. ఆ తరువాత ఎవరూ పట్టించుకోకపోవడంతో మండల కార్యాలయ ఆవరణలో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ పాడై పోతోంది. అసలే చెత్త వాహనం. పేరుకు తగినట్టుగానే చెత్తలో పడేశారు.  అధికారులు దీనివైపు కన్నెత్తి చూడటం లేదు. చిన్నచిన్న మరమ్మతు పనులు చేసి వాడటమో లేదా చెత్త సామాను కింద తరలించినా ఎంతో కొంత ఆదాయం సమకూరుతుంది. కనీసం ఈ విధంగా నైనా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.  

పరిగి మండల కార్యాలయంలో చెత్త మధ్య వాహనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని