logo

బరువు సరిపోతే లైసెన్స్‌ ఖాయం!

తూనికలు కొలతల శాఖలో లైసెన్స్‌హోల్డర్ల నియామకంలో అధికారులు నిబంధనలు విస్మరిస్తున్నారని.. డ్రైవర్లు, తమ సహాయకులకు బాధ్యతలు అప్పగిస్తున్నారన్న విమర్శలొస్తున్నాయి.

Published : 30 Mar 2024 02:31 IST

తూనికలు కొలతల శాఖలో ఇష్టానుసారంగా లైసెన్స్‌ హోల్డర్ల నియామకాలు!
ఈనాడు, హైదరాబాద్‌

తూనికలు కొలతల శాఖలో లైసెన్స్‌హోల్డర్ల నియామకంలో అధికారులు నిబంధనలు విస్మరిస్తున్నారని.. డ్రైవర్లు, తమ సహాయకులకు బాధ్యతలు అప్పగిస్తున్నారన్న విమర్శలొస్తున్నాయి. వారిలో పలువురు కాటాల మరమ్మతులతో పాటు స్టాంపింగ్‌, వ్యాలిడిటీ సర్టిఫికెట్‌ జారీ చేయడానికి మామూళ్లు వసూలు చేసి ఇస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకున్నా ముప్పుతిప్పలు పెడుతూ అడిగినంత చేతిలో పెట్టేవరకు కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారని పలువురు వాపోతున్నారు.

పరిజ్ఞానంతో పనిలేదు..

డిప్యూటీ కంట్రోలర్‌, డిస్ట్రిక్ట్‌ ఇన్‌స్పెక్టర్ల పరిధిలో ఉండేవారికి లైసెన్స్‌హోల్డర్‌ బాధ్యతలు అప్పగిస్తారు.  గతంలో ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా అర్హత కలిగిన వారికి రాతపరీక్ష, ప్రాక్టికల్‌, వైవా నిర్వహించి ఉత్తీర్ణులైనవారికి ధ్రువ పత్రాలు ఇచ్చేవారు. అనంతరం వారు రిపేరింగ్‌ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకునేవారు. అనంతరం వారిని లైసెన్స్‌హోల్డర్‌గా నియమించేవారు. వారు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కిరాణా జనరల్‌ స్టోర్లు ఐరన్‌, సిమెంట్‌ విక్రయాలు ఇతర ఉపకరణాల విక్రయ కేంద్రాల్లో ఉండే కాటాలు, పరిశ్రమల్లో వినియోగించే డిజిటల్‌ కాటాలను పరిశీలించి మరమ్మతులు ఉంటే చేసి సర్వీస్‌ఛార్జీ తీసుకోవాలి. వ్యాలిడిటీ, స్టాంపింగ్‌ అవసరమైతే డిస్ట్రిక్ట్‌ ఇన్‌స్పెక్టర్‌ ద్వారా చేయించాలి. 2002 నుంచి ఎంపిక కోసం పరీక్షలు నిర్వహించడం లేదు. ప్రస్తుతం ఐటీఐ, డిప్లొమా, బీటెక్‌ (ఎలక్ట్రానిక్స్‌ లేదా మెకానికల్‌) అర్హత ఉంటే కాటాల పరిశీలన బాధ్యతలు అప్పగించవచ్చు. కొందరికి అలాంటి పరిజ్ఞానం లేకున్నా లైసెన్సింగ్‌ బాధ్యతలు అప్పగించి సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలున్నాయి.

నిర్ణీత మొత్తం ఇస్తేనే..

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో మొత్తం 30కి మించి సిబ్బంది లేరు. రంగారెడ్డి జిల్లాలో రోజుకు 100.. మేడ్చల్‌ జిల్లాలో 60, హైదరాబాద్‌ జిల్లాలో 200 చొప్పున నిత్యం దరఖాస్తులు వస్తుంటాయి. లైసెన్స్‌ హోల్డర్లు పరిమితంగా ఉండటంతో.. పరిశ్రమల్లోని కాటాలకు స్టాంపింగ్‌, వ్యాలిడిటీ సర్టిఫికేట్‌ జారీ చేయాలంటే నిర్ణీత మొత్తం ఇస్తేనే చేస్తామంటూ చెప్పేస్తున్నారని పలువురు వాపోతున్నారు. ఇటీవల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఓ అధికారి పట్టుబడ్డారు. అంతకుముందు ఆ అధికారి.. ఆ స్థానానికి వచ్చేందుకు రూ.50లక్షలు చెల్లించానని దరఖాస్తుదారులకు నేరుగా చెప్పినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శాఖాపరంగా విచారణ జరిపి లైసెన్సింగ్‌ వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు