logo

మధ్యాహ్నం బస్సుల్లేక హైరానా

ఆర్టీసీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు.

Published : 19 Apr 2024 02:53 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్టీసీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా నిత్యం జన సంచారముండే నగరంలో మధ్యాహ్నం ఎండల సాకు చూపుతూ దాదాపు 1275 బస్సులకు విశ్రాంతి ఇవ్వడాన్ని తప్పు పడుతున్నారు. విద్యాసంస్థలకు ఇంకా సెలవులివ్వనే లేదు.. అయినా మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకూ సిటీ బస్సులు పరిమితంగా నడుపుతామని ప్రకటించడం విడ్డూరంగా ఉందంటున్నారు. ఇళ్లకు వెళ్లడానికి బసుల్లేక విద్యార్థులు నానా తంటాలు పడుతున్నారు. 5 నిమిషాలకో బస్సు నడిచే మార్గంలో 10 నిమిషాలకొకటి వస్తుందని అధికారులు ప్రకటించినా అవీ సక్రమంగా రావడం లేదు. ఇన్నేళ్లుగా లేనిది ఈసారే ఎందుకిలా అనేది ప్రయాణికులకు అర్థం కావడం లేదు.  

మహాలక్ష్ముల ప్రయాణమెలా.. మహిళలకు మధ్యాహ్నం సమయమే కాస్త విరామం దొరికేది. ఉదయం దుకాణాలు తెరవరు. సాయంత్రం ట్రాఫిక్‌ ఇబ్బందులతో బయటకు రాలేరు. ఇలాంటి పరిస్థితుల్లో తగినన్ని బస్సుల్లేక ఉచితంగా ప్రయాణం చేసే మహాలక్ష్ముల సంగతేంటని అడుగుతున్నారు. గంటకు 1.29 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఉదయం 5 నుంచి రాత్రి 10 వరకు 17 గంటల్లో 22 లక్షల మంది సిటీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. మరి మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకూ 5.16 లక్షల మంది ప్రయాణికుల పరిస్థితేంటో ఆర్టీసీ పట్టించుకోవడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని