logo

మళ్లీ నిరాశే..

పదో తరగతి ఫలితాల్లో వికారాబాద్‌ జిల్లా మళ్లీ అట్టడుగున నిలిచింది. గతేడాదిలాగే ఈసారీ 33వ స్థానంతో నిరాశ పరిచింది. గతేడాది కంటే ఉత్తీర్ణత 6 శాతం పెరగడం మాత్రం ఊరట కలిగించే అంశం. 2022-23 విద్యాసంవత్సరంలో 59.46 శాతం పాస్‌ కాగా.. ఈసారి(2023-24)లో 65.10 శాతం నమోదైందని సర్ది చెబుతున్నారు.

Published : 01 May 2024 03:51 IST

పది ఫలితాల్లో జిల్లాకు 33వ స్థానం
గతేడాది కంటే 6 శాతం పెరుగుదల
న్యూస్‌టుడే, వికారాబాద్‌ కలెక్టరేట్‌

ఓ కేంద్రంలో పరీక్ష రాస్తున్న విద్యార్థులు (పాతచిత్రం)

పదో తరగతి ఫలితాల్లో వికారాబాద్‌ జిల్లా మళ్లీ అట్టడుగున నిలిచింది. గతేడాదిలాగే ఈసారీ 33వ స్థానంతో నిరాశ పరిచింది. గతేడాది కంటే ఉత్తీర్ణత 6 శాతం పెరగడం మాత్రం ఊరట కలిగించే అంశం. 2022-23 విద్యాసంవత్సరంలో 59.46 శాతం పాస్‌ కాగా.. ఈసారి(2023-24)లో 65.10 శాతం నమోదైందని సర్ది చెబుతున్నారు. 2021-22లో మాత్రం 90.42 శాతం ఫలితాలు రావడం గమనార్హం.

గట్టెక్కింది 8,695 మంది..

ఈసారి పదో తరగతిలో 13,357 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. వారిలో 8,695 మంది ఉత్తీర్ణులయ్యారు. 6,664 మంది బాలురకు 3,821 మంది.. 6,693 బాలికలకు 4,874 మంది ఉత్తీర్ణులయ్యారు. 2022-23 విద్యాసంవత్సరంలో 13,399 మంది పరీక్ష రాయగా.. 7,967 మంది పాసయ్యారు. 6,759 మంది బాలురకు 3,643, బాలికలు 6,640 మందికి 4,324 మంది ఉత్తీర్ణులయ్యారు. 2021-22లో 14,236 మంది పరీక్ష రాయగా.. 12,863 మంది పాసయ్యారు. బాలురు 7,180 మందికి 6,265, బాలికలు 7,046 మందికి 6,598 గట్టెక్కారు.

ఫలితాలు తగ్గడానికి కారణాలివే..

జిల్లాలో పదో తరగతి ఫలితాలు అట్టడుగు స్థాయికి పడిపోవడానికి పలు కారణాలున్నాయి. రాష్ట్రంలోనే ఉపాధ్యాయుల కొరత అత్యధికంగా ఉన్న జిల్లా ఇదే. వికారాబాద్‌ జిల్లాలో 181 ఉన్నత పాఠశాలలున్నాయి. 96 బడుల్లో ప్రధానోపాధ్యాయులు లేక ఇన్‌ఛార్జిలతోనే నెట్టుకొస్తున్నారు. 118 మంది గణితం, ఆంగ్లం, సాంఘికశాస్త్రం బోధించే గురువులు లేరు. వివిధ అంశాలను ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులే బోధించారు. దీనికితోడు ఈసారి విద్యావాలంటీర్లను నియమించలేదు. జిల్లాలోని మారుమూల మండలాలైన బషీరాబాద్‌, బంట్వారం, కోట్‌పల్లి, పెద్దేముల్‌లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. జిల్లా నుంచి ప్రభుత్వ ఉత్తర్వులతో 40 మంది మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాలకు బదిలీపై వెళ్లిపోయారు. ఈ స్థానాల్లో ఎవర్నీ భర్తీ చేయలేదు. 20 మండలాలకుగాను ఒక్కరే రెగ్యులర్‌ మండల విద్యాధికారి ఉన్నారు. మిగతా వారంతా ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలే బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


కారణాలు విశ్లేషిస్తున్నాం..

- రేణుకాదేవి, జిల్లా విద్యాధికారిణి

పదో తరగతి ఫలితాల్లో జిల్లా అట్టడుగు స్థానంలో నిలవడానికి కారణాలు తెలుసుకుంటున్నాం. గతేడాదిలాగే ఈసారీ చివరి స్థానమే దక్కింది. మెరుగైన ఫలితాల కోసం ఎంతో శ్రమించాం. ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు ఏర్పాటు చేశాం. ప్రత్యేక తరగతులు నిర్వహించాం. మార్కులు సాధించే విధానాన్ని విద్యార్థులకు తెలిపాం. గతేడాది కంటే ఈసారి ఉత్తీర్ణత 6 శాతం పెరిగింది. ఇది కొంతవరకు సంతృప్తినిచ్చింది. వచ్చే సంవత్సరం బాగా కష్టపడతాం. మెరుగైన ఫలితాలు సాధిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని